Take a fresh look at your lifestyle.

ఏం ‌దీక్షలివి..

తేల్చుకోవాల్సి ఉంది… తెలంగాణ

సినిమా షూటింగులను తలపింప చేసే భారి సెట్టింగులు.. ఎండ తాకకుండా ఖరీదైన టెంటు..టెంటు కింద వేడి గాలి తగల కుండా ఓ వైపు ఎసీలు..ఫ్యాన్లు ..కూలర్లు కూర్చునేందుకు హంసతూలికా తల్పాన్ని పోలిన మెత్తటి పరుపులు..దిండ్లు దాని మీద ఆసీనురా లైన షర్మిల..కొలువుల భర్తి చేయాలంటు హైదరాబాద్‌ ‌లో ఇందిరా పార్కు వద్ద కనిపించిన యధార్థం. గతంలో షర్మిల సోదరుడు ప్రస్తుతం పొరుగు రాష్ట్రం అయిన ఎపికి ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి కూడ రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ సమైక్య వాదం ఎత్తుకుని ఇట్లాగే దీక్షలు చేశాడు. ఆనాడు తన సోదరున్ని అనుసరించి సమైక్య వాదానికి జై కొట్టిన షర్మిల తెలంగాణ రాష్ట్రం సాకారం అయినంక ఈ ఏడేళ్ల కాలంలో ఎక్కడా కనిపించకుండా పోయి ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణలో పరిస్థితులు తారు మారు అయ్యాయని తెలంగాణ ప్రజలు ఎందుకు విడిపోయామా అంటూ తెగ భాద పడిపోతున్నారని రాజన్న రాజ్యం కోసం తపిస్తున్నారని షర్మిలకు తోచి రాజన్న రాజ్యం తెస్తానంటూ ఊడిపడింది.

తెలంగాణ ప్రాంతంలో ప్రజల సమస్యలు చూసి షర్మిల చలించి పోయారు పాపం. ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం లేకుండా చాలా వెనక పడి పోయారని అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడతానంటూ స్వీయ ప్రకటన చేసి నాయకత్వం పుచ్చుకున్నారు. తన సోదరుడి లోటస్‌ ‌పాండులో మకాం వేసి జిల్లాల వారీగా మంతనాలు జరిపింది.ఖమ్మం జిల్లా యాత్ర చేసి ఇప్పుడు నిరుద్యోగుల కోసమంటూ ఇందిరాపార్కు వద్ద దీక్షకు కూర్చుంది. పోలీసులు భగ్నం చేస్తే లోటస్‌ ‌పాండ్‌ ‌లో దీక్ష కొనసాగించింది. అక్కడ కూడ నీడ పట్టునే ఎసీలు, ఫ్యాన్ల మద్య మెత్తటి పరుపుల మీద కూర్చుని ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ కొనసాగించిన దీక్ష మీడియాను ఆట్రాక్ట్ ‌చేయగలిగిందేమో కాని తెలంగాణ ప్రజలు మాత్రం దీన్నో తమాషాగా చూసారు. ఎందుకంటే వలసాంధ్ర పాలకుల 60 ఏండ్ల పాలనలో అరిగోస పడ్డ తెలంగాణ ప్రజలకు అసలైన పోరాటాలు అంటే ఏమిటో త్యాగాలు అంటే ఏమిటో అసలేంటో నకిలీ ఏంటో బాగా తెల్సు కనుక.

తెగించి కొట్లాడే తెలంగాణ ప్రజల దీక్షలు పోరాటాలు ప్రసంగాలు రిహార్సల్స్ ‌చేసి ప్రదర్శించేవిగా ఉండవు. ఎవరో రాసిపెడితే బట్టి పట్టి అక్షరం పొల్లు పోకుండా అప్పచెప్పే పాఠాలుగా అస్సలు ఉండవు . మలివిడత ఉద్యమంలో సుదీర్ఘ కాలం పాటు కొన సాగిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సమాజం ఎంతటి పరిణతి ప్రదర్సించారో చూసి ప్రపంచం అంతా నివ్వర పోయింది. నిజమే తెలంగాణ రాష్ట్రం సాకారం అయినంక ఆకాంక్షల కోసం ఎదురు చూసిన తెలంగాణ ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. నిరుద్యోగులు ఉసూరు మంటున్నారు. అక్కడక్కడా బలవన్మరణాలు కూడ జరిగాయి. ఈ సమస్యలకు పరిష్కారాలను వెదుక్కునే పనిలోనే తెలంగాణ సమాజం ఉంది. ఎవరితో తేల్చుకోవాలోవారితోనే తేల్చుకునేందుకు సిద్దపడుతోంది. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు కెసిఆర్‌ ‌ను పూర్తిగా విశ్వసించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడ సంపూర్ణంగా నమ్మారు. ప్రజా తీర్పులో కెసిఆర్‌ ‌కే తెలంగాణ ప్రజలు రెండు సార్లు పట్టం గట్టారు.

తెలంగాణ ఆకాంక్షలు నెర వేర్చడంలో కెసిఆర్‌ ‌విమర్శలు ఎదుర్కొంటున్నది నిజం. దాన్ని ఎవరు కాదన లేరు. కాని ఇందులో పరాయి వ్యక్తుల జోక్యాన్నో లేదా మద్యవర్తిత్వాన్నో తెలంగాణ సమాజం కోరేందుకు సిదదంగా లేదు. అందులో షర్మిల లాంటి నక్క జిత్తుల మనుషుల అవసరం అంతకన్నా లేదు. షర్మిల తండ్రి వై.ఎస్‌. ‌రాజశేఖర్‌ ‌రెడ్డి ఉన్నపుడే ఆయన తెలంగాణ పట్ల ఎంత కుట్ర పూరితంగా వ్యవహరించాడో తెలంగాణ ప్రజలకు తెల్సు. తెలంగాణ కు అడ్డం నిలువు కాదంటూనే తెలంగాణ ఉద్యమాన్ని నిలువునా మింగేయాలని చూశాడు. తెలంగాణ ప్రాంత టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అంగట్లో సరుకులు ఖరీదు చేసి నట్లు ఖరీదు చేశాడు. హైదరాబాద్‌ ‌కు వెళ్లాలంటే ఆంధ్రులకు పాస్‌ ‌పోర్టు కావాలంటూ ఆ వైపు రెచ్చ గొట్టాడు.

ఇక వై.ఎస్‌ ‌హెలికాప్టర్‌ ‌ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆయన తనయుడు వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఏం చేశాడో చూశాం. తండ్రి ఉన్నపుడే అక్రమాస్తులు కూడ బెట్టి లక్షల కోట్లకు పడగ లెత్తిన వ్యక్తి జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తండ్రి మరణం తర్వాత తొందరపడి చివరికి అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుని జైళు ఊచలు లెక్క పెట్టిన వ్యక్తి. జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి తెలంగాణ కు వ్యతిరేక లైను తీసుకుని ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నాడు. జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి కాని, ఆయన సోదరి షర్మిల కాని ఏనాడు తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన వారు కాదు. కనీసం ఉద్యమాన్ని గౌరవించిన ప్రజాస్వామిక వాదులు అంతకు కాదు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి ఓట్లు దండుకుని ఎన్నడో ఓ నాడు అధికారం లోకి రావాలని చూసిన వారే. కాని తెలంగాణ ప్రజలు వారి ఆటలు సాగ నీయ లేదు. తెలంగాణ లో వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఓదార్పు యాత్ర కంటూ బయలు దేరితే మాను కోట ప్రజలు ఎందుకు రాళ్ళతో కొట్టి యాత్రను భగ్నం చేసారో అన్నకు చెల్లికి బాగా తెల్సు. షర్మిల ఎవరు ఒదిలిన బాణం అయినా కాక పోయినా తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి నుండి పీల్చి పిప్పి చేసిన పెత్తందారి సీమాంధ్ర రాయల సీమ రాబందుల బాణంగా అర్దం చేసుకోవాలి.

ఆనాడు ఆంధ్ర పెత్తందారి రాజకీయ నేతలు భయాలు, భ్రమలు కల్పించి హైదరాబాద్‌ ‌రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో కలిపేసుకున్నారు. తెలుగు భాష పేరుచెప్పి తెలంగాణ ను భ్రష్టు పట్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి పెత్తందారి వర్గాలకు కుక్కకు బొక్కలు వేసినట్లు వేసి ముఖ్యమంత్రి పదవులు రాకుండా పి.వి. నరసింహరావు రావు వంటి వాళ్లకు వచ్చినా ఎక్కువ కాలం కొన సాగనీయకుండా బలమైన ల్యాబీతో పదవులు, ఉద్యోగాలు అన్ని వారే కబ్జా చేసారు. ఆస్తులు కొల్ల గొట్టారు. నీళ్ళు, నిధులు తన్నుకు పోయారు. పాత లెక్కల జోలికెందుకు అనుకుంటే రాజన్న హయాంలో లెక్కలు తీస్తే తెలుస్తుంది. వై.ఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి హయాంలో హైదరాబాద్‌ ‌లో సుమారు 30 వేల ఎకరాల విలువైన భూములు అమ్మాడు. రాయల సీమకు నిధులన్ని దోచుకు వెళ్లాడు. గణాంకాలు తీస్తే వాస్తవాలు అర్దం అవుతాయి. షర్మిల రాక వెనక ఆమె దీక్షల వెనక ఇక ముందు చేపట్టే యాత్రల వెనక మొదటి నుండి సీమాంధ్ర వలస పాలకులు తెలంగాణ పట్ల అనుసరించిన రాజకీయ కుట్ర కోణాలు దాగి ఉన్నాయనే వాస్తవాలను తెలంగాణ ప్రజలు మరిచి పోవద్దు.

వనరుల విషయానికి వస్తే మొదటి నుండి ఆంధ్ర ప్రాంతం కన్నా తెలంగాణ ప్రాంతంలో వనరులు ఎక్కువ. ప్రధానంగా నీళ్లు, నిధులు రాజకీయ పదవులు వీటిపైనే సీమాంధ్ర వలస పాలకుల కన్ను.
తెలంగాణ సమస్యను తెలంగాణ ప్రజలే తేల్చుకుంటారు. ఎవరితో తేల్చుకోవాలో వారి తోనే తేల్చుకుంటారు. ఎవరి మీద భ్రమలు, నమ్మకాలు పెట్టుకుని అధికారం వారి చేతుల్లో పెట్టారో వారితోనే తేల్చుకుంటారు. ఇందుకు మూడో వ్యక్తుల అవసరం ఏర్పడదు. తెలంగాణ ప్రజలకు ఎట్లా కొట్లాడాలో తెల్సు. ఎందు కోసం కొట్లాడాలో తెల్సు. ఎవరితో కొట్లాడాలో తెల్సు. కాకపోతే సమయం, సందర్బం కోసమే తెలంగాణ సమాజం ఎదురు చూసేది. ఇందు కోసం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బందగి చూపిన పోరాట స్పూర్తి వారసత్వం తెలంగాణ ప్రజలల స్వంతం.

షర్మిల దీక్ష చేసిన ఇందిరాపార్కు స్థలం తెలంగాణ వాదులు కొట్లాడి సాధించుకున్నదే. తెలంగాణ లో సమస్యలు చాలానే ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యం, నియంతృత్వం, తప్పిదాలు ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో పాలకుల ప్రయోగాలు కొన్ని వికటించాయి. ముందుగా నిరుద్యోగ యువత కోసం ఉపాధి రంగాలపై దృష్టి పెట్టుకుండా కేవలం సాగు నీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టి భారి నిధులు వ్యయం చేసారు. అడిగిన వాటిని వదిలి అవసరం లేని రంగాలపై దృష్టి సారించారు. ఇంతకి ఆంధ్ర లో అంతా సవ్యంగా ఉన్నదా షర్మిల చెప్పాలి. విశాఖ ఉక్క కర్మాగారం ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ యత్నాలను అక్కడి కార్మికులు వ్యతిరేకిస్తు పోరాటం కొన సాగిస్తున్నారు. నిరుద్యోగ సమస్య తెలంగాణ లోనే కాదు ఆంధ్ర లో కూడ ఉంది. షర్మిల ముందుగా ప్రజల పక్షాన నిలబడితే ఆంధ్రాలో నిలబడి తన అన్న జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డిని ప్రశ్నించాలి. ఆంధ్రాలో ప్రశ్నించే వారిని జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఏం చేస్తున్నాడో వార్తల్లో చూస్తున్నాం. అక్కడ కూడ పూర్తిగా పోలీసు రాజ్యం కొనసాగుతోంది.

షర్మిల నకిలి దీక్షలకు కొందరు తెలంగాణ మేధావులు సంఘీభావం ప్రకటించడం ఏ మేరకు సమర్దనీయమో వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పు కోవాలి. ప్రొఫెసర్‌ ‌కంచ ఐలయ్య, బిసి సంఘాల నేత ఆర్‌ ‌కృష్ణయ్య ,జర్నలిస్టు సంఘం నేత కె. శ్రీనివాస్‌ ‌రెడ్డి వంటి వాళ్లు షర్మిల దీక్షలో కనిపించడం చూసి తెలంగాణ ప్రజలు ఆశ్చర్య పోయారు. రాజకీయ కాంక్షతో రాజన్న రాజ్యం తెస్తానంటూ వచ్చిన షర్మిలకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించాలను కుంటున్నారా అనేది ఆమెను సమర్దించే వారు స్పష్టం చేయాలి. ఎవరో పూనుకునే కంటే మీరే ముందు పడండి. తెలంగాణ సమాజం మీ వెంట ఉంటుంది. ఇక్కడి నిరుద్యోగులనో రాజకీయ నిరుద్యోగులనో మోసం చేసేందుకు మీడియా ఆకర్షిత యాత్రలతో కపట దీక్షలు చేపట్టిన షర్మిల అసలు స్వరూపం అర్దం చేసుకోకుండా తప్పుడు సంకేతాలు ఇచ్చే విదంగా తెలంగాణ వాదులు ఎవరూ వ్యవహరించవద్దు.

తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా చాలా పరిణతి సాధించిన రాష్ట్రం. ప్రశ్నించే సమయం వస్తే ప్రశ్నిస్తుంది. గర్జించే సమయంలో గర్జిస్తుంది. ఏదైనా తెలంగాణ వారితోనే తెలంగాణ సమాజం తేల్చుకుంటుంది. టెంట్ల కింద ఎసీలు ఫ్యాన్లు చుట్టు పెట్టుకుని ఉద్యమాలు దీక్షలు చేయరు. ఉద్యమాలకు పరాయి మనుషులు, కిరాయి మనుషులు అవసరం లేదు. షర్మిల ఈన్నే పుట్టినా లేక ఆడ పుట్టి ఈన్నే పెరిగినా ఎప్పటికి తెలంగాణ బిడ్డ కాలేదు. తెలంగాణ అస్తిత్వం కోసం ఉద్యమించినపుడు సంఘీభావంగా నిలిచిన ప్రతి ఒక్కరిని పేరు పేరునా తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటది. అట్లాగే తెలంగాణ వ్యతిరేకించిన వారినందరిని పేరు పేరునా గుర్తు పెట్టుకుంటది.

షర్మిల దీక్ష భగ్నం సందర్బంగా తాను ఎప్పటికైనా కాబోయే ముఖ్యమంత్రి నంటూ నోరు జారారు. ముఖ్యమంత్రి అయ్యే హక్కే కాదు ప్రధాన మంత్రి అయ్యే హక్కు కూడ ఉంది కాని తెలంగాణ ప్రజలు అందుకు సిద్దంగా లేరు అనే విషయం ముందు ముందు అర్దం అవుతుంది. తెలంగాణ ప్రజలు తెలంగాణ భవిష్యత్‌ ‌రాజకీయాలను తేల్చుకోవాల్సి ఉంది. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో స్వయం పాలన కోరుతున్నారా లేక పరాయి పాలన కోరుతున్నారా తేల్చేది తెలంగాణ ప్రజలే. మార్చాల్సి ఉంటే తెలంగాణలో పాలకులు మారుతారే తప్ప పరాయి వ్యక్తులకు ఆ అవకాశం రావడం అస్సలు జరుగదు. షర్మిల తెలంగాణలో ఏం ఆశించినా అది కచ్చితంగా అత్యాశే అవుతుంది.
కూన మహేందర్‌
‌జర్నలిస్ట్, 9440146633

Leave a Reply