“ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పరిపాలన కేంద్రీకృతం అయింది. తన సొంత ఆలోచనలకు అనుగుణంగా సాగుతోందనిపిస్తోంది. తండ్రి ఆశయాలను ఆయన దూరంగా జరిగిపోయినట్టు కనిపిస్తోంది. రాజకీయంగా నిలదొక్కుకోవడమే ప్రధానంగా ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తన మార్గమే జాతీయ మార్గంగా ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తన తండ్రి ఆశయాలను వల్లించడమే తప్ప అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.”
ఆశయాలు వల్లించడానికి బాగా ఉంటాయి. వాటిని ఆచరణలో చూపడమే కష్టం. ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రధాన రాజకీయ శత్రువు నారా చంద్రబాబు నాయుడును ఓడించి అధికారంలోకి వచ్చారు. ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించారు. కానీ, వాటిని ఆచరించడంలో మాత్రం వెనకబడుతున్నారు. ఆయన తన తండ్రి ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. రాజకీయాల వరవడిలో నడవడం లేదేమోననిపిస్తోంది. జగన్ తన తండ్రి ఆశయాలను వల్లిస్తారు. కాని తన రాజకీయ ప్రయోజనం కోసం రాజీ పడుతున్నారని ఆయన రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నవారు అభిప్రాయ పడుతున్నారు.తన తండ్రి ఆశయాలకు కట్టుబడి ఉంటారనే సామాన్యులు విశ్వసించి ఆయనకు ఎన్నడూ ఎవరికీ రాని మెజారిటీని ఇచ్చారు. అఖండ విజయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మైలు రాయి వంటింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కుదేలయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో చూస్తే ఆయనపై ప్రజలుఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
రాజన్న రాజ్యాన్ని తెస్తనన్న వాగ్దానంతో ఆయన అధికారంలోకి వచ్చారు. అంటే రాజశేఖర్ రెడ్డి విధానాలూ, కార్యక్రమాలను అమలు జేస్తానన్న వాగ్దానంతో అధికారంలోకి వచ్చారు. ఒక్క మాటలో తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానన్న వాగ్దానంతో అధికారంలోకి వచ్చారు. తన తండ్రి ముఖంలో చిరునవ్వు ఫోటోను ప్రతి ఇంట్లో చూడాలన్నది తన కోర్కె అని ప్రచారం సందర్భంగా ఆయన ప్రకటించారు. ప్రజలకు మేలు చేసిన జన నేత ప్రజల హృదయాల్లో శాశ్వతాంగ నిలిచిపోవాలన్నది తన ఆకాంక్ష అన్నారు. ఆ విధంగా పాలనను అందిస్తానని వాగ్దానం చేశారు. అయితే, ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పరిపాలన కేంద్రీకృతం అయింది. తన సొంత ఆలోచనలకు అనుగుణంగా సాగుతోందనిపిస్తోంది. తండ్రి ఆశయాలకు ఆయన దూరంగా జరిగిపోయినట్టు కనిపిస్తోంది. రాజకీయంగా నిలదొక్కుకోవడమే ప్రధానంగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తన మార్గమే జాతీయ మార్గంగా ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తన తండ్రి ఆశయాలను వల్లించడమే తప్ప అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ఇందులో మొదటిది శాసనమండలిని రద్దు చేయడం. 1985లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు శాసనమండలిని రద్దు చేస్తే 2007లో వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్ధరించారు. రాజ్యసభకు పార్టీ టికెట్లను కేటాయించడం రెండో విషయం. తన తండ్రి జీవితకాలమంతా ఏ కార్పొరేట్ సంస్థతో పోరాడారో ఆ సంస్థ సిఫార్సు చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం. అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాష్ట్రంలో రిలయన్స్ గ్రూపు వెలికి తీసే గ్యాస్‌లో పది శాతం రాష్ట్రానికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ – రిలయన్స్ అంబానీల మధ్య జరిగిన పోరు రాష్ట్ర ప్రయోజనాల కోసమే నన్న విషయం తెలుగు రాష్టాల్లో సామాన్యులకు సైతం తెలుసు. నిజానికి 2009ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజగురు రామోజీరావుతో అంబానీ కుట్ర పన్నారనీ, టిడిపి. టిఆర్‌ఎస్ మహాకూటమి ఏర్పాటులో కీలక పాత్ర వహించారని వదంతులు వచ్చాయి. వైఎస్‌ని తొలగిస్తే రిలయెన్స్ వ్యతిరేక పోరాటం అంతమవుతుందని మహాకూటమి భావించింది. ఆయనను ఆ ఎన్నికల్లో ఓడించేందుకు శతవిధాల ప్రయత్నించింది.
అయినా ఆ కుట్రలేవీ ఫలించలేదు. వైఎస్‌ఆర్ తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. కేజి బేసిన్‌లో రిలయెన్స్ గ్రూపు ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికే దీనిని ఏర్పాటు చేశారు. దీంతో అంబానీలకు ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార ప్రయోజనాలమీద ఆసక్తి తగ్గింది. అంబానీలతో వైరం పెరిగింది. అయితే, 2009లో తన తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వల్ల జగన్ అంబానీల వ్యతిరేక పోరాటాన్ని కొనసాగించలేదు. ఆయన మరణానికి ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ సంస్థలే కారణమన్న అనుమా నంతో వైసీపీ కార్యకర్తలు రిలయెన్స్ షోరూంలపై దాడులు చేశారు. అటువంటిది ఇప్పుడు జగన్ తన పార్టీ టికెట్‌ను రాజ్యసభ ఎన్నికకు ముకేష్ అంబానీ సిఫార్సు చేసినవారికి ఎలా ఇచ్చారన్నది ఎవరికీ అంతు పట్టని ప్రశ్న. ముకేష్ అంబానీ సన్నిహితుడైన నత్వానీకి ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా, లేదా బీజేపీ అగ్రనాయకత్వం సిఫార్సు చేసిన మీదట జగన్ తన పార్టీ టికెట్లు ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. బీజేపీ అగ్రనాయకత్వం అభ్యర్ధనకు జగన్ తలొగ్గారని వార్తలు వచ్చాయి.
తన ప్రభుత్వ అజెండాను అమలు జేయడానికి కేంద్రం నుంచి మద్దతు,సహాయ సహకారాలు ఆయనకు అవసరం. కనుక వారి సిపార్సులకు ఒప్పుకుని ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడు నిర్ణయాలపై రివర్స్ టెండరింగ్ అమలు జేసేందుకు కేంద్రం సహకారం కావాలి కనుక ఒత్తిడికి లొంగినట్టు కనిపిస్తోంది. అంతేకాక, ఆర్థిక శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కేసుల నుంచి విముక్తుల కోసం క్విడ్ ప్రోకోగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. అంబానీల రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వ్యాపార ప్రయోజనాల కోసం తమ శత్రువు కుమారునితో చేతులు కలిపారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాట నిజమే. చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా దీనిని అస్త్రంగా తీసుకుని జగన్‌పై దాడి చేస్తోంది. జగన్ చేజేతులా ప్రత్యర్థులకు అస్త్రాన్ని అందించినట్టు అయింది.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్