Take a fresh look at your lifestyle.

విశాఖ జిల్లాలో విషాదఘటన

సెల్ఫీ మోజులో ప్రాణాలు తీసుకున్న యువకులు
ఊబిలో పడి ముగ్గురు యువకుల గల్లంతు
విశాఖపట్టణం, మే 31 : ఫొటోలు తీసుకుంటూ ప్రమాదవశాత్తూ జలపాతంలోని ఊబిలాంటి ప్రాంతంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయిన విషాదఘటన హుకుంపేట మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై రిషికేష్‌ ‌తెలిపిన వివరాల ప్రకారం… హుకుంపేట మండలం తీగలవలసలో సన్యాసమ్మపాలెం గ్రామానికి చెందిన మోరి నిరంజన్‌ (18), ‌బాకూరు వినోద్‌కుమార్‌ (25), ‌తమర్భ శివనాగేంద్రకుమార్‌ (22), ‌మరో ఏడుగురు స్నేహితులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం తీగలవలస గ్రామ సపంలోని గుడ్డిగుమ్మి జలపాతానికి వెళ్లారు. ఈ ముగ్గురూ ఒకచోట స్నానాలు చేస్తుండగా, మిగిలిన ఏడుగురు వేరొకచోట ఉన్నారు. సరదాగా ఫొటోలు తీసుకుంటున్న సమయంలో… నిరంజన్‌, ‌వినోద్‌కుమార్‌ ‌కాలుజారి జలపాతంలోని ఊబిలాంటి ప్రాంతంలో మునిగిపోయారు. వారిద్దరికీ ఈత రాదు. వినోద్‌కుమార్‌కు ఈత రావడంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతను కూడా నీటిలో మునిగిపోయాడు.

వీరితోపాటు వచ్చిన మిగిలిన ఏడుగురు ఈ విషయాన్ని గమనించే లోపే ఆ ముగ్గురూ నీటిలో గల్లంతయ్యారు. ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా ఉండకపోవడంతో ఎవరూ సహాయం చేసేవారు లేకుండాపోయారు. సమాచారం తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన జనం యువకుల ఆచూకీ కోసం గాలించారు. వారు మునిగిపోయిన ప్రాంతం పెద్ద ఊబిలా ఉంటుందని స్థానికులు తెలిపారు. హుకుంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. విషయం తెలుసుకున్న యువకుల కుటుంబీకులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

సన్యాసమ్మపాలెంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు మాట్లాడుతూ… కరోనా కారణంగా కొద్దిరోజులుగా ఈ యువకులు గ్రామంలోనే ఉంటున్నారుని అన్నారు. రోజూ తమ కళ్లముందే ఉండేవారని, ఆదివారం ఉదయమంతా కుటుంబ సభ్యులతోనే ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ ముగ్గురు యువకుల్లో బాకూరు వినోద్‌కుమార్‌ ఎం.‌ఫార్మసీ పూర్తి చేశాడని, శనివారమే అతడి పుట్టినరోజును చేసుకున్నారని తలచుకున్నారు. తరవాత రోజే ఇలా ప్రమాదానికి గురయ్యాడని తండ్రి నాగరాజు కన్నీరుమున్నీరయ్యారు. మిగిలిన ఇద్దరిలో నిరంజన్‌ ఇం‌టర్‌ ‌చదువుకోగా, శివనాగేంద్ర కుమార్‌ ‌డిగ్రీ పూర్తిచేశాడు. చేతికందొచ్చిన కొడుకులు ఏమయ్యారో ఆచూకీ తెలియక వారి తండ్రులు మాణిక్యం, విశ్వనాథం పడాల్‌ ‌కన్నీటిపర్యంతమయ్యారు. జలపాతం వద్దనే తమ బిడ్డల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. యువకుల కోసం గాలింపు కొనసాగుతోంది.

Leave a Reply