Take a fresh look at your lifestyle.

నీవు ధన్యుడవు

తలవంచి ప్రణామం చేయాలి నీ  సేవకు
దేవుని ఆస్తి పంపకాలలో దేశంకోసం రక్తాన్ని చిందించే అదృష్టం నీదే
అని వ్రాయబడిన పత్రాలను అందుకొన్న నీవు ధన్యుడవు..

యూనిఫామ్‌ ‌లో కొలువైన  దేశ గౌరవమా
హిమాలయాపర్వతం లాంటి ఘనమైన సాహసమా
నిను చూసి  భయం కూడా దారి మార్చుకొంటున్నది చూడు
శత్రువుతో నీ పోరాట పఠిమ, స్థైర్యం, ధైర్యం,
మట్టిలో కలపడానికైనా..మట్టి లో కలసిపోవడానికైనా సిద్ధపడే నీవు  ధన్యుడవు ..

తల పై బాధ్యతల మకుటాన్ని ఇష్టంగా ధరించి
ఆరోగ్యం కరిగిపోతున్న ఆశల దీపాలు మసకబారుతున్నా..
చీకటినైనా కర్తవ్యం కోసం మృత్యువు వైపు అడుగులు వేసేవాడా ..
నీవు ధన్యుడవు ..

సంఘ విద్రోహ శక్తుల, అల్లరిమూకలు పీచమణచి సమాజానికి రక్షణ గోడగా నిలిచిన
నిజ జీవితపు కథా నాయకుడా నీవు
ధన్యుడవు ..

తనవారి ప్రేమానురాగాలకు అంతంపాడుతూ దేశంకోసం దేహాన్ని సమర్పించి
తరలిరాని తీరాలకు సాగిపోయిన త్యాగ శీలి నీవు ధన్యుడవు…

సముద్రం ఇంకి పోదా
నీ గాథలో బాధలు వివరింపగా..
గోరింటాకు నల్లబడిపోదా ..
నవ వధువు సౌభాగ్యం నేలరాలగా..
పసిడి బాల్యం మూగబోదా..
భరోసానిచ్చే నాన్న పిలుపు వినపడని లోకాలకు తరలిపోగా..
పచ్చదనం రంగును కోల్పోదా ..
అండగా నిలువవలసిన పుత్రునికి అంతక్రియలు జరుపగా..

నీ సర్వస్వాన్ని ఒడ్డి శాంతి సౌభాగ్యాలను దేశ ప్రజలకు దానమిచ్చిన ధనవంతుడా..
నీవు ధన్యుడవు  …

– సయ్యద్‌ ‌ఫరీదా బేగం
సీనియర్‌ అసిస్టెంట్‌, ‌డీజీపీ కార్యాలయం, హైదరాబాద్‌

Leave a Reply