- పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక కెసిఆర్ నగర్ ఇండ్లు
- కొత్త సంవత్సరంలో పట్టు వస్త్రాలలో గృహ ప్రవేశాలు చేపిస్తున్నాం…
- ఇండ్ల జిమ్మేదారులు ఇక మీరే…
- అవసరమైన సందర్భంలో ప్రభుత్వంకు బాసటగా నిలవాలి : మంత్రి హరీష్‌రావు
నిన్నటి గూడు లేని నిరుపేదలే నేటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఓనర్లనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా సిద్ధిపేటలోని కేసీఆర్ నగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం అన్ని వసతులతో నిర్మించి పేదలకు అప్పగిస్తున్నామన్నారు. బుధవారం సిద్ధిపేటలోని కేసీఆర్ నగర్‌లోని ఆడిటోరియంలో 216మందికి ఏడో విడత లబ్దిదారులకు మంత్రి హరీష్‌రావు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ…హైదరాబాద్ హైటెక్ సిటీలోని గేటెడ్ కమ్యూనిటీ మాదిరి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహ సముదాయం అన్ని వసతులతో నిర్మించామన్నారు. పేద ప్రజలు ఆత్మ గౌరవంతో బతకాలన్న ఉద్దేశ్యంలో ఆర్థికంగా భారమైనప్పటీకి హైటెక్ సిటీ కాలనీలోని సంపన్నుల గేటెడ్ కమ్యూనిటీ మాదిరి ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. గృహ సముదాయంలో సకల సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. స్వంత ఇల్లు మాదిరే…పేదల ఆత్మ గౌరవ ప్రతీకల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మీ కోసం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేశామన్నారు. దేశంలోని 718 జిల్లాల్లో అన్ని హంగులు, వసతులతో నిర్మించిన తొలి కాలనీ సిద్ధిపేట కేసిఆర్ నగరేనని మంత్రి తెలిపారు.
రూపాయి ఖర్చు లేకుండా గూడు లేని గరీబోల్లకే… డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించామన్నారు. 5 సార్లు వడపోత తర్వాతే నిజమైన లబ్దిదారుల ఎంపికను చేపట్టామన్నారు. పార్టీల కతీతంగా నిష్పక్షపాతంగా ఇండ్ల కేటాయింపు జరిపామన్నారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి.. కొత్త సంవత్సరంలో… పట్టు వస్త్రాలలో గృహ ప్రవేశాలు చేపిస్తున్నామన్నారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేసే సమయంలోనే…. పట్టా ఉత్తర్వుతో పాటు.. నల్లా కనెక్షన్ మంజూరు పత్రం, కరెంట్ కనెక్షన్, ఇంటి నెంబర్, పైపుడ్ గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నామన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో కేసిఆర్ నగర్‌ను అనుసంధానం చేశామన్నారు. ఫలితంగా ఉపరితల మురుగు కాల్వలు ఉండవన్నారు.
దోమలు, పందుల బెడద తప్పి.. అనారోగ్యం దరి చేరదన్నారు. మీరు చెమట చుక్క రాల్చకుండా ఇళ్ళు సొంతం చేసుకుంటున్నారంటే….తనతో పాటు స్థానిక ప్రజా ప్రతినిదులు, అధికారులు కృషి ఫలితమేనన్నారు. తాను డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించేందుకు రెండున్నర ఎండ్లలో …400 సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించానన్నారు. ఇప్పటికీ వరకు ఇండ్లకు తాము జిమ్మేదార్లుగా ఉన్నామని మంత్రి తెలిపారు. గృహ ప్రవేశాలతో తమ బాధ్యత తీరిపోతుందని అన్నారు. ఇక మీరే జిమ్మేదారులుగా ఉంటూ పచ్చదనం పరిశుభ్రతక•• పెద్ద పీట వేస్తూ మరింత ఉన్నతంగా ఎదగాలన్నారు. పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడు కోవాల్సిన బాధ్యతల లబ్ధిదారులదేనని మంత్రి స్పష్టం చేశారు. లబ్దిదారులు భవిష్యత్తులో మరింతగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిసరాలు…మీకు అప్పగించినప్పుడు ఎలా ఉందో రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
కమిటీలుగా ఏర్పడి..కామన్ ఏరియా పరిశుభ్రంతో పాటు, వసతుల నిర్వహణ చూసుకోవాలన్నారు. పరిశుభ్ర కేసిఆర్ నగర్‌కు ప్రజలు కంకణ బద్దులు కావాలన్నారు. ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్ముకున్నా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇండ్లు లేని పేద ప్రజలకు అంది స్తామన్నారు.