Take a fresh look at your lifestyle.

‌నాడు సునీల్‌కుమార్‌… ‌నేడు సునీల్‌ ‌నాయక్‌

‌నాడు తెలంగాణరాష్ట్ర సాధనకోసం సునీల్‌ ‌కుమార్‌ ‌ప్రాణత్యాగం చేస్తే, నేడు ఉపాధి కరువై సునీల్‌ ‌నాయక్‌ ‌బలవర్మాణానికి పాల్పడ్డాడు. ఈ రెండు సంఘటనలకు మధ్యకాలం పన్నెండేళ్ళు. ఈ పన్నెండు ఏళ్ళకాలంలో రాజకీయంగా అనేక మార్పులు సంభవించాయేగాని, ఏ లక్ష్యంకోసమైతే పోరాటం చేశారో ఆ ఫలితాలను మాత్రం తెలంగాణ యువత అందుకోలేకపోయిందనడానికి సునీల్‌నాయక్‌ ‌తాజా మరణం గుర్తుకు తెస్తున్నది. రాష్ట్రం ఎందుకు రావాలనుకున్నాడో ఆ ఆశయాన్ని చవిచూడకుండానే రాష్ట్రం ఏర్పడడానికి ముందే మిరియాల్‌కర్‌ ‌సునీల్‌కుమార్‌ ‌మృత్యువును కౌగలించుకుంటే, హమ్మయ్య రాష్ట్రం ఏర్పడింది ఇక మన ఆశలు నెరవేరుతాయని గడచిన ఏడేళ్ళుగా చకోరపక్షిలా ఎదురు చూసి, చూసి విసిగి వేసారి ప్రాణత్యాగం చేశాడు బోడ సునీల్‌ ‌నాయక్‌. ‌విచిత్రంగా ఇద్దరి పేర్లూ ఒక్కటే. వీరిద్దరూ విద్యావంతులే. ఇద్దరూ వరంగల్‌ ‌బిడ్డలే. ఇద్దరూ కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని వారే.

పోస్టుగ్రాడ్యుయేషన్‌తోపాటు ఐటిఐ, నర్సింగ్‌ ‌లాంటి ఎనిమిది రకాల వృత్తివిద్యాకోర్సులు చేసిన సునీల్‌కుమార్‌ ‌చివరకు జర్నలిస్టుగా మారాడు. 2009లో అప్పటి మంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూల ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్ర ఎంపీలు, ఎంఎల్‌ఏలంతా సామూహికంగా చేపట్టిన రాజీనామాల డ్రామా ఆయన్ను కలిచివేసింది. అంతే ఇంట్లో ఉరివేసుకుని 2010 మార్చ్ ఎనిమిదిన తెలంగాణకోసం ప్రాణత్యాగం చేశాడు. నిధులు, నీళ్ళు, నియామకాలన్న నినాదంతోనే తెలంగాణను సాధించుకున్న విషయం తెలియందికాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటినుండి ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో సీమాంధ్ర నాయకుల పెత్తనం కారణంగా తెలంగాణ ప్రజలు ఉపాధి అవకాశాలను దశాబ్ధాల కాలంగా కోల్పో వలసి వొచ్చింది. తెలంగాణ ఏర్పడితే ఇక రాష్ట్రంలో ఏర్పడే ఖాళీలన్నీ తమతోనే నింపుతారన్న ఆశయంతో విద్యార్థిలోకం ప్రత్యేకరాష్ట్ర సాధనకోసం ఉద్యమించింది. ఈ పోరాటంలో కనీసం పన్నెండు వందల మంది యువత తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగంచేశారు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడినతర్వాత కూడా వారే ప్రాణాలర్పిస్తున్నారు. గిరిజన కుటుంబాలకు చెందిన వారు విద్యాధికులుగా ఎదగడమే కష్టం.

అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న సునీల్‌ ‌నాయక్‌ ‌మరణించే ముందు అన్నమాటలను ఒకసారి గుర్తుతెచ్చుకుంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో యువత ఎలాంటి అడియాశలకు లోనవుతున్నారన్నది అర్థమవుతుంది. తానొక ఐఏఎస్‌ ఆఫీసర్‌ ‌కావాలన్నది ఆయన కల. ఆయన కల నెరవేరకుండానే అర్ధాంతరంగా ప్రాణత్యాగం చేశాడు. అయితే తాను చేతగానితనంతో చనిపోవడంలేదని. తనలాగా చాలామంది యువకులు బాధపడుతున్నారని, అందుకు ప్రభుత్వమే కారణమని ఎత్తిచూపుతూ, ఉద్యోగాలులేవు.. నోటిఫికేషన్‌లు ఉండవు. ఇలాంటి పరిస్థితిలో తన మరణం ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నదే లక్ష్యంగానే విషాన్ని తీసుకున్నట్లు సెల్ఫ్ ‌వీడియోద్వారా పేర్కొన్నాడు. 2016లోనే ఎసై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు క్వాలిఫై అయినా ఎత్తు తక్కువ ఉండడంతో తీసివేశారని, అప్పటినుండీ ఉద్యోగవేట కొనసాగిస్తూనే, ఇక ప్రభుత్వ ఉద్యోగాలు వొచ్చే పరిస్థితిలేదని విషం తాగి వారం రోజులుగా చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 2‌న మృతిచెందాడు. దీంతో రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీ విద్యార్దులను మరోసారి కదిపిలేపినట్లైంది.

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు మిన్నముడుతోంది. రాష్ట్రంకోసం బలిదానాలు చేయాల్సివస్తే, రాష్ట్రం ఏర్పడినతర్వాత దాని ఫలాలను అందుకోవడం కోసంకూడా మళ్ళీ బలిదానాలు చేయాల్సిరావడమేంటని అటు రాజకీయ పక్షాలుకూడా ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నాయి. రాష్ట్రంలో ఎంతలేదన్నా ముప్పై లక్షల మంది యువకులు ఉపాధి అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారన్నది ప్రతిపక్షాలు, నిరుద్యోగులు చెబుతున్నమాట. కాగా రాష్ట్రంలో సుమారుగా ఇప్పటికే దాదాపు రెండు లక్షల వరకు ఖాళీలున్నప్పటికీ ప్రభుత్వం వాటిని భర్తీ చేసే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నదన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడేనాటికి అంటే 2014లో నిరుద్యోగులు 2.7 శాతంగా ఉంటే 2019 నాటికి అది 8.3కు చేరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు ప్రకటిస్తోంది. వాస్తవంగా ఎన్ని ఖాళీలున్నాయి.. ఎన్ని భర్తీ చేశారన్న విషయంలోమాత్రం స్పష్టతలేదంటున్నాయి ప్రతిపక్షాలు. కొన్ని పోలీసుశాఖలో, కొన్ని విద్యుత్‌శాఖలో మరికొన్ని కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పించినంతమాత్రాన అన్నిరంగాలవారికి ఉద్యోగాలు కల్పించినట్లు కాదన్న విమర్శఉంది.

సాధారణంగా రాష్ట్రంలో సగటున ప్రతి నెల ఆరువందలమంది పదవీ విరమణ చేస్తున్నారు. ఆ లెక్కన ప్రతి ఏటా ఏడునుండి ఎనిమిది వేల ఖాళీలు ఏర్పడుతున్నాయి. కాని, ఆ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయడం లేదంటున్నారు నిరుద్యోగులు. కనీసం నిరుద్యోగ భృతి అయినా కల్పిస్తున్నదా అంటే అదీలేదు. 2018 శాసనసభ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు ప్రతీ నెల 3016 రూపాయలను అందిస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు మాటనిలుపుకోలేదు. తాజాగా శాసనసభ సమావేశాల్లో కొరోనా కారణంగా ఉపాది భృతిని కల్పించలేకపోయామని, కొరోనా సెకండ్‌వేవ్‌ ‌తర్వాత కల్పిస్తామన్న సిఎం కెసిఆర్‌ ‌ప్రకటనకూడా సునీల్‌ ‌నాయక్‌కు మనస్తాపాన్ని కలిగించిందంటున్నారు తోటి మిత్రులు. ఏదిఏమైనా ఉపాధి లభించకనే బలవన్మరణానికి పాల్పడినట్లు ఆయన సెల్ఫీ ద్వారా స్పష్టమవుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించకపోవడం కూడా విద్యార్థిలోకాన్ని ఆగ్రహానికి గురిచేస్తోంది. రాష్ట్రంకోసం ప్రాణత్యాగం చేసినట్లు, ఉద్యోగాలకోసం ఇంకెంతమంది ప్రాణాలు వదులాలో చెప్పండని వారు పాలకులను నిలదీస్తున్నారు.

Leave a Reply