Take a fresh look at your lifestyle.

అవును.. ఈ పాపం పాలకులదే ..!

“కోట్లాదిమంది వలస కార్మికుల గురించి ఆలోచించి వుంటే, లాక్ డౌన్ కి ముందే వీరిని స్వస్థలాలకు చేర్చే ఆలోచన చేసివుండేవారు. అది జరగకపోగా, వారి జీవితాలను చిందర వందర చేసేశారు. కనీసం, తర్వాతయినా రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఎవరిని వారిని వారి స్వరాష్ట్రాలకు చేర్చే ఆలోచన చేసివుండేవారు. చేయకపోవడంవల్ల, నాలుగువందలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో, నడిచిన అలసటతో, వడదెబ్బతో, ఆకలిదప్పులతో చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా వుండొచ్చు. రోడ్ల మీద ప్రసవమయ్యి, వెనువెంటనే వందల కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఈ దేశ ఆడపడుచులది!”

k sajayaఒకరోజు జనతా కర్ఫ్యూ అంటూ మార్చి 19న ప్రకటించిన  ప్రధానమంత్రి రు, ఇప్పటికీ వరుసగా మూడుసార్లు లాక్ డౌన్ ని పెంచుకుంటూ వెళ్లారు. దాదాపు నెలన్నర తర్వాత ఆయన మళ్లీ ప్రసంగిస్తున్నారంటే, నిజం చెప్పొద్దూ, అప్పటివరకూ ఆయనతే ఎంతోకొంత నమ్మకం వున్న సామాన్య జనం కూడా భయపడ్డారు. మళ్లీ ఎన్ని రోజులు ఈ లాక్ డౌన్ పెంచుతారో ఊహించలేక! దేశప్రజల నుద్దేశించి ప్రసంగించటమే కాకుండా ఒక నోరు తిరగని పదాన్ని పదే పదే చెబుతూనే వెళ్ళారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’. జనానికేమన్నా దీని అర్థం తెలుస్తుందా? దానికి ఇరవై లక్షల కోట్ల భారీ ప్యాకేజీ కూడా ప్రకటించారు. పైగా జాతీయ స్తూల ఉత్పత్తిలో జపాన్, అమెరికాల తర్వాత మనదేశం ప్రకటించిన ఈ ఆర్ధిక ప్యాకేజీనే అతి పెద్దదని కూడా ప్రకటించారు.

ఒకపక్క కోరోన వైరస్ పై యుద్ధానికి సహాయంగా అంటూ ఏర్పాటు చేసిన పిఎం కేర్స్ అనే స్వతంత్ర సంస్థను ఎవరూ ప్రశ్నించటానికి గానీ, ఆడిట్ చేయటానికి గానీ వీల్లేదట! ఏ నిబంధనలూ వర్తించవట! మామూలుగా ఏ ప్రభుత్వరంగ  సంస్థల వివరాలైనా సమాచారహక్కు చట్టం ద్వారా తీసుకోవచ్చు. వాటికి జవాబుదారీతనం వుంటుంది. ఆడిట్ చేస్తారు. కానీ దీనికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అంటే, ఈ సంస్థలోకి వచ్చే నిధుల వివరాలు, ఎక్కడి నుంచీ వచ్చాయి, దేనికి ఖర్చు ఎంత పెడుతున్నారు అని ఎవరికీ చెప్పాల్సిన అవసరంలేదట! జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఈ సంస్థకు లేదన్నమాట! అయినాగానీ, ఈ సంస్థకు ఇప్పటివరకూ పదిహేను లక్షల కోట్ల నిధులు వచ్చాయని వినికిడి! ఇది ఎలాగో బయటకు పొక్కింది. ఈ విషయం బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే ప్రధానమంత్రిగారు ‘ఆ..ని..భా’(ఈ పేరు సూచించిన గొప్పవారెవరో కనుక్కోవాలి)పేరుతో ఇరవై లక్షల కోట్ల ప్యాకేజిని ప్రకటించారు. ఈ రెండింటికీ ఏమన్నా సంబంధం వుండివుంటుందా? ఏమో, ‘లోగొట్టు పెరుమాళ్ల కెరుక’ అనే సామెత వ్యవహారం అయివుండవచ్చు. 

ఇంతకీ ఈ ‘ఆ..ని..భా’ ప్రకటనతో తేలినదేమంటే, ఈదేశ నిర్మాణంలో ప్రధాన భాగస్వాములైన శ్రామికుల స్థితిగతుల పట్ల, వారి సంక్షేమం పట్ల మన ఘనత వహించిన ప్రధానమంత్రిగారు ఆవగింజంత బాధ్యత కూడా తీసుకోలేదనే విషయం మరింత స్పష్టంగా బయటికి వచ్చింది. వాళ్లు మనుషులని, కనీసం ఈదేశ పౌరులనేది కూడా గుర్తించినట్లు కనిపించలేదు. గుర్తించి వుండి వుంటే, కోట్లాదిమంది వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరాలని చేస్తున్న ప్రయత్నాలకు ఒక నిర్మాణాత్మకమైన ఊతాన్ని అందించగలిగేవారు. సంక్షోభ సమయంలో తమ కుటుంబాలతో గడపాలనుకున్న వారి ఆకాంక్షలను గౌరవించి వుండేవారు.

migrants by walkశ్రామిక్ రైళ్లు వేసాముగా అనొచ్చు? అదీ ఎప్పుడు? మార్చి 24 న లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత పిల్లాపాపలతో లక్షలాదిమంది దేశరహదారులమీద వేలాది కిలోమీటర్లు నడుస్తూవుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని, సామాజిక మాధ్యమాలలో ఆ హృదయవిదారకమైన దృశ్యాలు, కథనాలు వచ్చిన తర్వాత తాపీగా మే 1 నుంచీ రైళ్ళను కొద్దిగా నడపటం మొదలుపెట్టారు. అలా అయినా గానీ, ఈ ‘ఆ..ని..భా’ ప్రకటనలో దేశవ్యాప్తంగా ఆరోజు వరకూ ఎంతమందిని ఈ రైళ్ల ద్వారా స్వస్థలాలకు పంపించారో చెప్పి వుండాల్సింది. స్వస్థలాలకు వెళ్లాల్సినవారు కోట్లల్లో వుంటే, మే 11వ తేదీ వరకూ దేశం మొత్తం మీద మూడులక్షలఅరవైవేలు మాత్రమే ఈ రైళ్ల ద్వారా వెళ్ళగలిగారని రైల్వే మంత్రి ప్రకటించారు. నడిచిన ఈ రైళ్ల వ్యవహారం కూడా వలస కార్మికులకి అంత సులభమైన విషయమేమీ కాదు. రాష్ట్రం వదిలివెళ్ళటానికి పోలీసుల నుంచీ అనుమతి తీసుకోవాలి, ట్రైన్ టికెట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, తమ వంతు ఎప్పుడు వస్తుందా అని రోజుల తరబడి ఎదురుచూడాలి. ట్రైన్ బయలుదేరే అతికొద్ది సమయం ముందు పోలీసులనుంచీ సమాచారం వస్తే  ఉరుకుల పరుగుల మీద పోలీస్ స్టేషన్ కి చేరుకొని వాళ్లు ఏర్పాటు చేసిన బస్సో లేదా ట్రక్కో ఎక్కి వాళ్ళు తీసుకువెళ్ళిన రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కాలి. భోజనం దొరికితే దొరికినట్లు, లేదంటే ఉపవాసం, అంతే! అధికారులు ఈ వ్యవహారాన్ని అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. 

వలస కార్మికులకు మొదటినుంచీ సహాయంగా వుంటున్న పౌర సమాజ సంస్థలను ఇంత పెద్ద కార్యక్రమంలో భాగస్వామ్యం చేయలేదు. నిరంతర అసందిగ్ధతకు గురవుతున్న కార్మికులు శ్రామిక రైళ్ల మీద ఆశ వదిలేసుకుని నడకదారి పడుతున్నారు. అధికారుల అతిగోప్యత వల్ల సకాలంలో కార్మికులకు సమాచారం అందకపోవటం వల్ల కొన్ని రైళ్లు సగం కూడా నిండకుండానే బయలుదేరివెళ్లాయని విన్నప్పుడు ఏమనిపిస్తుంది? యధావిధిగా తప్పు కార్మికులదే అంటారు అధికారులు, కానీ తమ ప్రణాళిక, సమన్వయలోపం అని మాత్రం వొప్పుకోరు. పౌరసమాజ సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసివున్నట్లయితే మరింత సాఫీగా కార్మికులను పంపించగలిగి ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది.

కోట్లాదిమంది వలస కార్మికుల గురించి ఆలోచించి వుంటే, లాక్ డౌన్ కి ముందే వీరిని స్వస్థలాలకు చేర్చే ఆలోచన చేసివుండేవారు. అది జరగకపోగా, వారి జీవితాలను చిందర వందర చేసేశారు. కనీసం, తర్వాతయినా రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఎవరిని వారిని వారి స్వరాష్ట్రాలకు చేర్చే ఆలోచన చేసివుండేవారు. చేయకపోవడంవల్ల, నాలుగువందలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో, నడిచిన అలసటతో, వడదెబ్బతో, ఆకలిదప్పులతో చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా వుండొచ్చు. రోడ్ల మీద ప్రసవమయ్యి, వెనువెంటనే వందల కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఈ దేశ ఆడపడుచులది!  ప్రభుత్వాల మీద ఆశ వదిలేసుకున్న కార్మికులు తమకు తోచిన దారుల్లో గమ్యస్థానాలు చేరాలని కిలోమీటర్ల కొద్దీ నడుస్తూనే వున్నారు. చీమలపుట్ట పగిలినట్టు వలస కార్మికులు రాష్ట్రాలు దాటుకుంటూ అలా వెళ్తూనే వున్నారు. కూరగాయలు వేసుకెళ్ళే చిన్న చిన్న ట్రాలీల్లో వందల కిలోమీటర్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా ప్రయాణించడానికి సిద్ధపడుతున్నారు. చూస్తుంటే దుఖం సుళ్ళు తిరుగుతోంది. కరోనా వైరస్ తో కన్నా ఆకలితోనే చనిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. ప్రభుత్వమే ఉచితంగా రైళ్లను వేయటానికి సిద్దపడనప్పుడు, ప్రైవేటు వాహనాలు ఉచితంగా తీసుకెళతాయా? చేతిలో మిగిలిన ఆ కొద్ది పైసల్ని కూడా సమర్పించుకుని, అదీ లేకపోతే, తిండి నీళ్ళూ అందిస్తున్న దాతల సహాయంతో తరలి వెళ్ళిపోతున్నారు.

 పనుల కోసం వాళ్లు స్వరాష్ట్రం దాటి వస్తున్నప్పుడు కనీసం వారిని నమోదు కూడా చేయని స్వ, పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి వెళ్ళేటప్పుడు, వస్తున్నప్పుడు అనేక నిబంధనలను పెడుతున్నాయి. అనుమతి ఉంటేనే పోనిస్తాం, రానిస్తాం అని హూంకరిస్తున్నాయి. ఒక అడుగు ముందుకు వెళ్ళిన తెలంగాణా ఆరోగ్య శాఖామంత్రి వలస కార్మికుల కదలికలతోనే కరోనా వైరస్ ముప్పు పెరిగే ప్రమాదం వుందని కూడా ప్రకటించేశారు. ఒకపక్క వలస కార్మికులు ‘మా గౌరవ అతిథులు’ అని ప్రకటిస్తారు, కానీ వారికి సరైన రేషన్ గానీ, భద్రమైన పరిస్థితులుగానీ కల్పించరు. వారిని గాలికి వదిలేసిన కాంట్రాక్టర్ల మీద ఏ రకమైన చర్యలు వుండవు. కనీసం వారు తమ దారిన తాము వెళ్ళటానికి ఏదో ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు, నగరం ఆ మూల నుంచీ ఇంకో మూలకు నడిచి వెళుతుంటే వారికి రవాణా సౌకర్యం కల్పించరు.  తిండితిప్పలు ఏర్పాటు చేయరు. గత నెలన్నరగా హైదరాబాద్ నగరం చుట్టూ పచ్చిబాలింతలు, కడుపుతో వున్న ఆడవారు, ముసలివారు, యువకులు, చిన్న పిల్లలు,  నెత్తిన మూటలతో, పగిలి పుళ్లుపడిన పాదాలతో కుంటుకుంటూ నడుస్తూ వుంటే తెలంగాణా రాష్ట్ర  ప్రభుత్వానికి కనిపించలేదంటే అర్థం ఏమిటి? కళ్ళు తెరుచుకునే, చూడనట్లు వదిలేశారంతే! ఒక్క హైదరాబాద్ అనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితి!

కానీ, మహా గొప్పగా తిప్పి తిప్పి ఒకటే మాటను వందసార్లుగా చెప్పిన ‘ఆ..ని..భా’లో ప్రధానమంత్రి గారు వీళ్లేవరి గురించీ కూసింత చోటు కూడా పెట్టలేదు. మాకు మీ వోట్లు తప్ప మీరు అవసరం లేదు’ అని నొక్కి వక్కాణించి మరీ చెప్పటమే ఇదంతా! పైగా కరోనా కోవిద్  సంక్షోభంలో ప్రజలందరూ ఎన్నో త్యాగాలు చేసారట, వారి ఆర్ధిక హితం కోసమే ఇప్పుడు ఈ భారీ నిర్ణయాలట! దేశఆర్ధిక వ్యవస్థను గట్టేకించటానికి, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రముఖ స్థానం కల్పించామని చెబుతున్నఈ ‘ఆ..ని..భా’ కార్మికుల హక్కులను హరించే వ్యవహారానికి కూడా అప్పుడే తెర తీసింది. తమ ప్రభుత్వాలే వున్న రాష్ట్రాల్లో కార్మికుల 8 గంటల పనిగంటలను 12 గంటలవరకూ పెంచుతూ, ఏ రకమైన హక్కులకూ అవకాశం లేకుండా నిర్ణయం తీసుకోవటం అంటే, తొందరలోనే ఈ వ్యవహారాన్ని అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తామనే సూచన స్పష్టం గానే కనిపిస్తోంది.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో రాజకీయ ప్రయోజనాలకోసం ‘నమస్తే ట్రంప్’ లాంటి భారీ కార్యక్రమాలు తీసుకుని, దానివల్ల రెండు మూడు రాష్ట్రాలను వైరస్ కి ఎరగా వేసేసి, చేసిన పొరపాటుని కప్పిపుచ్చుకోవటానికి, వైరస్ కి మతపరమైన తేడాలుండవని తెలిసినప్పటికీ మత విద్వేషాలను కొనసాగేలా ఊతం ఇచ్చి, లాక్ డౌన్ చేయకపోతే కొంపలు మునిగిపోతాయి అని సరైన సమాచారం, ప్రణాళికా లేకుండా నిర్ణయాలు ఏకపక్షంగా ప్రకటించి, ఆరోగ్య అత్యవసర పరిస్థితిని పోలీసు శాంతి భద్రతల సమస్యగా మార్చివేసి, నెలన్నర తర్వాత ‘మనం వైరస్ తో సుదీర్ఘకాలం జీవించాల్సి వుంటుంది’ అని చెప్పటం (ప్రధాన మంత్రి నుంచీ ముఖ్య మంత్రుల వరకూ) అనేది ఏదైతే వుందో, దానినే చిత్తశుద్ధి లేకపోవటం అంటారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!