“అడిగెటోళ్ళు కరువైతె అర్సుకునెటోడెందుకు ముందు బడ్తడు!? కొత్త హక్కుల కోసం కొట్లాడక మునుపే పాత హక్కులు గుంజుకుని,నల్లచట్టాలు దెచ్చె’’రామ’’ రాజ్జెంలున్నం మనం. అడుగుతరని అనుమానంతోనే అండా జేల్ కాన్లు నింపినోళ్ళ రాజ్జెంల అడుగక మునుపే ఏడిశి కండ్లు తుడుసుకునుడే కొత్త పజాస్వామ్యం! గ సొంటి రాజ్జెం లాక్ డౌన్ ల గరీబోళ్ళను అర్సుకునుడు కానచ్చే కత కాదుగని”
మబ్బుల లేశి, అందరికన్న ముందే సద్ది బువ్వ తోనితొవ్వబట్టి సటాసటా నడుసుకుంట అడ్డ మీదికి పోయే కూలీలుండేటి మూలమలుపు కాడ ఎవలు కానత్తలేరు.లొల్లిలొల్లి ధూంధాముండేటి అడ్డ సిన్నబొయింది.మోరి పక్కపొంటి బక్క కుక్కపిల్లోటి అటిటు తిరుగుతాంది. గాడ చాయి అమ్మేటి ఉస్మాన్ జాడపత్త లేదు. ‘‘ఓ మేస్తీ! పారగాండ్లను జర గట్టోల్లను జూడు. ఎక్కువ తక్కువ సామాన్లేసుకోని రాకు.జప్పున బయిలెల్లు’’! అని కూళోల్లను మాట్లాడుక బోయేటోళ్ళు కానత్తలేరు. అంబేద్కర్ బొమ్మకాడ లేబరోళ్ళ అడ్డ సిన్నబోయింది.మట్టి మోశెటోళ్ళు,ఇటికె మోశెటోళ్ళు మాల్ గలిపి మేస్త్రీకి అందించెటోళ్ళు బతికే అడ్డకూళోల్ల వాడలల్ల ఇనిపించే ఆకలిపాట కు ఇప్పుడు లాక్ డౌన్ కోరసియ్య బట్టింది.
ఇండ్లల్ల పనిజేశెటోళ్ళు,బజాట్ల కూరగాయలమ్మేటోళ్ళు, చెప్పులు కుట్టెటోళ్ళు,బండ్ల మీద పూలమ్మెటోళ్ళు,పండ్లమ్మెటోళ్ళు,
ఇండ్లుకట్టే కాడ కూలికి,ఇటుక బట్టీల కాడ కూలికి,రైస్ మిల్లుల కాడ కూలికి వేరే జిల్లాల నుండి,వేరే రాష్ట్రాల నుండికాంటాక్ట్ కింద వలసచ్చిన కూలోళ్ళ పనులు బందయినయి.బయిట గల్మ కాడనేమొ కరోనా సావు కావలుండె,చేతుల పైసల్లేక ఇంట్ల గిన్నెలు కొట్లాడబట్టె!పనుల్లేకుంటె పైసలైతెరావు,ఆకలి మాత్రం అస్సలిడిశిపోదు.ఆకలి ‘‘ఛలో!’’సొంతూళ్ళకు బయిలెళ్ళుమన్నది.రైలు బండ్లు బస్సులు లేకుంట మాయెగని రొండు కాళ్ళున్నయి వూరొచ్చెదాంక నడువు మన్నది. గరీబోళ్ళకు లాక్ డౌన్ల ఆకలి, కరోనా సావు రొండుఒక్క తీరనిపియ్యబట్టె!.
యాడది సంది కరోనా సావులెక్కువై,కాటికి కట్టె కరువయ్యేకతచ్చె! పోయే పానాలు పోతాంటె లాక్ డౌన్ బెట్టి దొంగేడుపులు ఏడిత్తె సాల్తదా!?ముందుగాలమనిషికింత బువ్వ గావాలె!బతికుంటె అటెంక కరోనాసూదిమందేసుకునుడు.ఇంటికిం
ఊళ్ళె దొంగలు బడ్తె దర్వాజలేసుకొని బన్నట్టు గీ బుగులు బడుడెంత కాలం!?దేశమంత ఓట్లేసుడు రొండు మూడు దినాలల్ల ఖతమయినప్పుడు, దేశమంత సూదిమందెశేటందుకుగింత ఆలిశెం యెందుకైతానట్టుల్లా!?ఈ తాప కరోనా సావులు పెంచింది కుంబమేళా,ఎలచ్చన్ల ప్రచార మేళాలు కాదానుల్లా! లోపటి లాగొక్కటి ఇశిపెట్టి వున్నయి,లేనియి అన్ని అమ్మిన అలవాటుతోని ఎగిరెగిరి సూదిమందు పక్కదేశాలకు అమ్ముకుంటిరి.సావులు దునియా మొత్తంల మనతానె యెక్కువయ్యేటాలకు సూదిమందు ‘‘బిచ్చాని’’కి పోబడితిరి.బయిటి కేలి సూదిమందు కొనుడెనుక ఏసొంటి మతులబుంటదో యెరుక లేందెవలికి!?కరోనాకాలంల కొత్తలెల్లక తిప్పలైతాంటె కొత్త బంగ్లా గట్టెటందుకు కోట్లు బెట్టుడైందని ఎవలడుగాలె!? అకరికి మళ్ళ లాక్ డౌనంటిరి.
లాక్ డౌన్ తిప్పలేందో గరీబోళ్ళకెరికె!గరీబోళ్ళ కూలినాలోళ్ళ తిండి తిప్పలను అర్సుకునేటందుకు సర్కార్ ఇంటికింతని పైసలిచ్చే ఇకమత్ బడుతలేదు. ‘‘సల్లంగుండు అంబానీ!నువు సక్కంగుండు ఆదానీ!’’అనే పాట గడ్డమాయినె పాడక ముందటి సందే గాళ్ళు సక్కంగనే వుంటాండ్లు. సల్లంగనే వుంటాండ్లు. ఎసొంటి లాక్ డౌనచ్చినా గాళ్ళ దందాలన్ని పైలంగున్నయి. గరీబోళ్ళ బతుకులే మెతుకులేక మాడుతున్నయి. జనం సావు గోరి ఆయుదాలమ్మే దేశాలు,జనం బతుకు గోరి సూది మందులమ్ముడే ఇచ్ఛంత్రమంటె గీ బేరాలల్ల కొనెటోళ్ళ లెక్కలు బరాబరే వుంటయనే యవ్వారం అందరికి యెరుకుండాలె!
కరోనా కాలంల మూతిమాశికల మీద సుత జీయెస్టి పన్నేసుడే గాదు,సర్కార్ లాక్ డౌన్ల గరీబోళ్ళ ఉప్పు పప్పులు నూనెలమీద దరలు మస్త్ పెంచింది.మస్త్ పిరమైన వంట సామాన్లతోని ‘‘ఏం గొనెటట్టు లేదు,యేం తినేటట్టు లేదు!’’ పాట తీరుగున్నది.గీ నెలల పన్నెండు మల్కల పిట్రోలు దర బెంచింది సర్కార్.పొయినేడు కరోనా కాలంల దునియాల అన్ని దేశాలు జనంచేతికి పైసలిచ్చినయి.జప్పున రొండు మల్కల సూది మందుముందే యేశినయి.మూతిమాశికలు లేకుంటిప్పండు బిందాసుగున్నయి.
లాక్ డౌన్ ఆపతిల గరీబోళ్ళ బతుకులు ఆగమైతాంటె ఇంటికింతని పైసలిచ్చుడు,బియ్యం,ఉప్పు పప్పు నూనెలియ్యాలన్న సోయి లేకుంట బోయింది.గీదొంగేడుపుల సాటున సర్కార్ యెవలిని అర్సుకుంటాంది!?యెవల్ని అర్సుకుంటలేదో యెరుకైతాందానుల్లా! గీ కరోనా రొండో మల్కచ్చి సావులెక్కువ యెందుకైతానయో ఎవలు జేయబట్టి అయితానయో యెవలికి యెరుకైత లేదు.గిందుకే వూరూర్లె సూదిమందేశే సెంటర్లల్ల సారు పోట్వ యాది మరువకుంట పెట్టాలని జెప్పబట్టిండ్లు.ఎవలేడ్వాల్నో గాళ్ళు యేడ్వక మునుపే యెవలేడ్వద్దో గాళ్ళు యేడ్సుడు దునియా మొత్తంజూడబట్టింది.