Take a fresh look at your lifestyle.

కొరోనా! కొరోనా!

“చంద్రుడి మీద సూత రేపో మాపో రియల్‌ ఎస్టేట్‌ ‌దందా మొదలు జేత్తరనుకునే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సాధించిండు మనిషి, కానీ కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవికి భయపడి మొకానికి  ముసుగేసుకోని తిరిగే కాడికి వచ్చిండు. గల్మదాటి బయటికి వచ్చేందుకు గజ్జుమని గుబులు పడే కాడికి జేరిండు. మంది కూడుతె సూత గుబులే, మాట్లాడుతె సూత గుబులే, చేయి కలుపుతె గుబులే, చేయి కడుగకుంటె గుబులే! అఖరుగ తుమ్మచ్చినా, దగ్గచ్చినా సూత గజ్జున వణుకయ్యే బతుకయింది. కొమ్ములు దిరిగిన వస్తాదుల్లాసొంటి దేశదేశాలను గజ్జున వణికియ్య బట్టిన సూక్ష్మజీవికి గింతగనం బలం యేనంగచ్చిందో తెల్వకపాయె!”

yelamandha

భూమ్మీద జీవులన్ని సమానం అనుకుంటనే ‘‘మేం జర్రెక్కువ సమానం’’ అని మనిషి అనుకునుడే పెద్ద’’తొండి’’. ప్రకృతిని, ప్రకృతి తీర్గనే వుంచి, మనిషి, మనిషి తీర్గుంటె బాగుండేది. ప్రకృతిని అడ్డగోలుగ ఆగం జేషేటి మనిషి మీద ప్రకృతి మర్లవడ్డప్పుడే కొత్త తిప్పలు మోపయితది. బలవంతుడు బలహీనుని మీద పెత్తనం జేసుడు కొంతకాలం సాగుతదేమో గని ఎల్లకాలం సాగుతదా! మనిషి గాలిని, నీటిని, భూమ్మీద సంపదను, భూమి కింద సంపదను సొంతం జేసుకునే ఆగం జేషి లెక్క దప్పితె ఇచ్చంత్రం కాకుంటబోయింది. మనిషి తొండిని అప్పుడప్పుడు సవాల్‌ ‌జేషే వరదలు, కరువు, సునామీలు, గత్తర, రోగాలాసొంటి తిప్పలచ్చుడు మాత్రం సూషేందుకు పెద్ద ఇచ్చంత్రమే ఐతాంది. చంద్రుడి మీద సూత రేపో మాపో రియల్‌ ఎస్టేట్‌ ‌దందా మొదలు జేత్తరనుకునే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సాధించిండు మనిషి, కానీ కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవికి భయపడి మొకానికి  ముసుగేసుకోని తిరిగే కాడికి వచ్చిండు. గల్మదాటి బయటికి వచ్చేందుకు గజ్జుమని గుబులు పడే కాడికి జేరిండు. మంది కూడుతె సూత గుబులే, మాట్లాడుతె సూత గుబులే, చేయి కలుపుతె గుబులే, చేయి కడుగకుంటె గుబులే! అఖరుగ తుమ్మచ్చినా, దగ్గచ్చినా సూత గజ్జున వణుకయ్యే బతుకయింది. కొమ్ములు దిరిగిన వస్తాదుల్లాసొంటి దేశదేశాలను గజ్జున వణికియ్య బట్టిన సూక్ష్మజీవికి గింతగనం బలం యేనంగచ్చిందో తెల్వకపాయె! భౌగోళికంగ గోడ కట్టుకోని హద్దుబందులు పెట్టుకున్న చైనా, వ్యాపారం మార్కెట్ల విషయంల మాత్రం ప్రపంచం మొత్తాన్ని తన హద్దు బందులకు జరుపుకోని మీసం దిప్పింది. గసోంటి చైనాల పురుడు బోసుకున్న ‘‘కరోన’’ చైనా ఆర్ధిక మూలాల పునాదుల్ని కిందిమీదికి జేషిందనే అనాలె! ఇస్లామిక్‌ ‌దేశాల మీదికి, యూరోపియన్‌ ‌దేశాల మీదికి బోయి చేయాల్శినంత ఆగం జేషి వేల మందిని బలి దీసుకున్నది. ఇటలీ, స్పెయిన్‌  ‌దేశాలల్ల ఇర్సుక పడ్డది. ఆయుధాల దందా జేసుకుంట ప్రపంచంలనే పెద్దన్న అనిపిచ్చుకునే అమెరికా దేశం సూత కరోనా తోని కొట్లాడబట్టె!. దేశమంతట ‘‘ఆరోగ్య ఎమర్జెన్సీ’’ పెట్టేకాడికచ్చింది. మన దేశంల సూత అడుగేసుడు ఆలిశెం లేదు, దేశంల చిన్నా పెద్దా యాపారాల్ని కుప్ప జేషీంది. రోజోతీరిగ సావుడప్పు కొట్టబట్టింది.

 

కంటికి కాన్రాని చిన్న జీవి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గజ్జున వణుక్కుంట కరోనా సంగతేందో జూషే పనిల బడ్డరు. పదిమంది గుమిగూడే పబ్బులు, సిన్మ టాకీసులు, హోటల్లు, బడులు, కాలేజ్‌లు, రాకపోకలు బందు బెట్టిండ్లు. ఎక్కడికక్కడ అన్నింటినీ మూయించి బట్టిండ్లు. ఎవరిని చూసినా మాస్కులు. ఎక్కడైనా హ్యాండ్‌ ‌క్లీనింగ్‌లు. దేశాల షట్‌ ‌డౌన్లు. సిటీల లాక్‌ ‌డౌన్లు. విమానాల గ్రౌండింగ్‌లు. బస్సులు రైళ్ల హాల్టింగ్‌లు. షాపులు, మాల్స్, ‌స్కూల్స్ అన్నీ క్లోజ్‌. ‌బోర్డర్లను బంద్‌ ‌పెట్టించింది. వ్యాపారాలను దెబ్బతీసింది. సామాన్యుడిని ఇంటికి పరిమితం చేసింది. ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసింది. ఎక్కడా ఆగకుండా, అడ్డూ అదుపులేకుండా ప్రజల ప్రాణాలను బలి తీసుకోబట్టింది. వేల మందికి పైన్నే పీనుగైండ్లని లెక్కలు గిట్ల తేల్షిండ్లు. తైవాన్‌, ఉత్తరకొరియా లాంటి దేశాలు జర నయమనాలె! గని ఇటలీ, స్పెయిన్‌, ఇస్లాం, అమెరికా దేశాలు బాగనే ఆగం కాబట్టినయి.
మన దేశంల సూత అన్ని రకాల దందాలు మూతేషి మూలగ్గూసున్నరు. బయటిదేశాలనుంచి వచ్చినోళ్ళందరిని థర్మల్‌ ‌పరీక్షలు జేయబట్టిండ్లు. అనుమానం మోపయితె దావకాన్ల తొలి రొండు వారాలు మంచమెక్కిచ్చి, అటెంక లేదని తేలినంకనే ఇడిషి పెట్టుడు, తాపతాపకు చేతులు కడుక్కునే పని జేయుండ్రని జోరుగ జనాలకు కరోనా పాటాలు నేర్పబట్టిండ్లు. అసలు నిజం అడుగు దాటకముందే అపోహ ఆరు మైళ్ళు దాటుడంటె గిదే!  కోడి మాంసం తింటే కరోనా అగం జేత్తదని, పుకారు లేపి కోళ్ళ యాపారాన్నే కాదు, కుప్పలు పోషి పాణమున్న లచ్చల కోళ్ళను బొందబెట్టిండ్లు. చిన్నయాపారాలు, రోడ్లపొంటి దందాలు దెబ్బ తిన్నయి.

ఎసోంటి దాన్ని సూత రాజకీయం జేషే ‘పెద్ద’ మనుసున్న మన దేశంల కరోన మీద చిత్రమైన కతలు పడబట్టిండ్లు. కరోనాకు సూత మతం రంగు జల్లి జనం విశ్వాసాలతోని హోలీ ఆడబట్టిండ్లు. ఆవు మూత్రం తాగాలంటరు, ఆవు పెండ మొకానికి పూసుకోవాలంటరు. ఆన్‌ ‌లైన్‌ల ఆర్డర్‌ ‌జేత్తె ఆవు మూత్రం ఇంటి గల్మకాడికి వచ్చే దాంక ఇచ్చంత్రాలు మోపైనయి. ‘‘సందులసడేమియా’’ అన్నట్టు చెట్లమందులు జేషి కరోనా మందని అమ్మ బట్టిండ్లు. మనువాదుల కరోనా మందు పనిజేషిందని పుకార్లు లేపినట్లయితె ఆవులు పాలిచ్చుడు బందుబెట్టి, నీళ్ళుతాగి బయిటికిడుసుడు పని మీదుంటది. డాక్టర్లు నౌఖర్లిడిషిపెట్టి ఆవులు గిట్ల పెంచే పనిమీదుంటరు. మందుల దుకాండ్లు బందుబెట్టి ఆవు మూత్రం అమ్మే కతలు బడుతరు! ఆవుమూత్రం అమ్ముకునే హక్కు అంబానీ కుటుంబానికే గుత్త కిత్తరు గావచ్చు. అంబానీ సేట్లు పిట్రోల్‌ ‌బంకులు బందుబెట్టి, అవు మూత్రం బంకులు షురూ జేత్తరు.

 

శవాల మీద పేలాలు ఎరుకునే దొంగలకు, వాళ్ళ దందా జేషేటోళ్ళకు మంచి సందైంది. కరోనా నివారణకోసం కావల్షిన మాస్కులను చేతులుకడుక్కునే  సానిటైజర్ల సర్కారే జనాలకు పంచాలె! కాని ఇచ్చంత్ర మేందంటె కనీసం కొందామంటె సూత బయిటి దుకాండ్లల్ల దొరికే కత లేదు. ఇరువై రూపాలుండే మాస్కులు రొండు వందల రూపాలకు సాటుసాటుంగ అమ్మబట్టిండ్లు. దిక్కుమెల్ల రసాయనాలు కల్పి డుప్లికేటు సానిటైజర్లు తయారుజేషే ముఠాలు పోలీసులకు దొరికినయి.   కష్టమత్తే దేముడా! నీ బాంచను, కాపాడు తండ్రీ! అని మొక్కుతం! కాకపోతె మొక్కులు కడ్తం! ఏకంగ తిరుపతి ఎంకన్ననే కరోనా దెబ్బకు గుబులుతోని, భక్తులకు దూరమై దర్శనం బందు బెట్టుడైతె మన గోస ఎవలికి జెప్పుకోవాలె! మనల్ని మనమే కాపాడుకోవాలె! మన దేశమంత ఇయాల ఇంట్లకేలి బయటికి యెల్లుడు బందు బెట్టి, జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోడీ జెప్పిండు. దేశమంత సరెనన్నది. గిట్లనన్న ఏమన్న ఫాయిదుంటదా జూడాలె! ‘‘సూడ్రా బయ్‌!ఇ‌క్రమార్క్’’! ‘‘‌మాగనే ఇనబట్టినవు గని, దేశదేశాలల్ల రోజో తీర్గ సావుడప్పు గొట్టబట్టిన కరోనా నివారణకు ఎసోంటి కార్యక్రమాలు జేయా లె!? ఎవలు జేయాలె!’’ నా ప్రశ్నకు జవాబియ్యకుంటె మాస్క్ ‌తీషి నీ మొకం మీద ఒక్కసారి గట్టిగ తుమ్ముత! పైలం’’! అని బెదిరిచ్చే భేతాళ్‌ను ఎప్పటి తీర్గనే భజం మీదేసుకోని ‘‘విను!భేతాళ్‌’’ ‌వైద్యం పూర్తిగ ప్రభుత్వరంగం చేతులల్లనే వుండాలె! శాస్త్రీయ దృక్పథంతోని ప్రజలను చైతన్య పరిచి సమిష్టి సహకారంతోని కరోనా నివారణ చర్యల చేపట్టాలె! ఉపేక్షిస్తే పీనుగల కుప్పలు పెరుగుతయి’’ అని జెప్పుకుంట నడ్వబట్టిండు..నడ్వబట్టిండు.
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply