Take a fresh look at your lifestyle.

సూసుకుంటుండాలె !

మట్టికి లేని మతం మనిషి కున్నంక పాణంవిలువ పత్తకు లేకుంట బాయె పది మంది కూడితె ఎందుకనడిగి,అడ్డువడి,నిలేషే తుపాకీ,నాల్గుబాటల కాడ జనంగూడి ఓ నిజాన్ని నినాదం జేషి ఎగిరేస్తే ,ఎట్ల ఎగిరేస్తవని ఎట్లబడితట్ల కాల్పులు జరిపే తుపాకీ,ఇప్పడు ఢిల్లీ నేలంతా కారుతు న్న నెత్తుటి వెచ్చదనాన్ని సల్లారనివ్వకుంట, తూటాలు పేల్సుకుంట కావలి కాయబట్టింది.
ధర్మం ఎన్ని పాదాల మీద నడుత్తాందనే లెక్కల్‌, ‌గిక్కల్‌  ‌జాంతానై! మన రాజ్జెంల యే ధర్మం నడువాలె,ఎట్ల నడువాలె! అని  జెప్పే ‘‘యోగులు’’ మైకులల్ల జోరుగ జెప్తాంటరు. జర్ర షెవుబారిచ్చినాలె! గాళ్ళు ఏ ధర్మం ఎన్ని పాదాలతోని నడువాలంటె గా ధర్మం గన్ని పాదాలతోనే నడువాలె! అరె! గిదేందిర బయ్‌! అని ఎవలికి యేం అనుమానం గినుమానం వచ్చెగిట్ల!వత్తె బరాబరి అడుగుతమని అడిగేరు సుమా! యేం!లే! ఏనంగత్తరో గని జప్పున దేశభక్త పోలీసోళ్ళు ఉరికత్తరు పైలం! ముందుగాలాల్లు నిమ్మలంగ  సి.సి. ఫోట్వో కెమరాల్ని పగుల గొడ్తరు.ఎనుకషీరి యెవలిపనో యెరికెగద!చలో!వురుకు! వురుకుడు రాకుంటె అంతే మల్ల!లగ్గంనాగెల్లి పుక్కట్లవుడే!పెయి సూక సూకైనంక దావుకాన్ల కండ్లు తెరిషి ఇరికిన బొక్కల్లెక్కబెట్టుకునే పనిలుంటరు. ఎవలి పనిల ఆళ్ళుంటరు. ధర్మం కాపాడేందుకు లారీలల్ల ‘‘యోగులే’’గాదు,ఆల్లెంబడి కంకర రాళ్ళు, ఇనుపరాడ్లు, తపంచాలు,కంక కట్టెలు, పిట్రోల్‌ ‌డబ్బలు సూతత్తయి.ధర్మం కాపాడెటోళ్ళకు ఇవెందుకనేది బిత్తిరోళ్ళకు గియేయి బుర్రలకెక్కయి. జర పైలం!వాల్లెంత తిప్పలు బడి బస్తాలల్ల గాటిని తెచ్చి కుప్ప బోసుకున్నరో యేమో! మోషిన కుప్పేడ బోయాలె? ఏడ బోయాల్నో ,ఎవలింటిమీద బోత్తె లెక్క సరిగ్గుంటదో ముందే ప్లానింగ్‌ ‌చీటిల రాషేవుంటది.
చిన్నప్పుడు గోళీలాట బాగాడిన్నోళ్ళంత రాళ్ళకుప్పల దిక్కు బొయి పని జూడాలె! మిగిలినోళ్ళు కోటర్‌ ‌సీసాల పిట్రోల్‌ ‌బాంబులు ఇండ్ల మీద ఇసురుడాట ఆడుకోవాలె!గిట్ల పనులు పంచుకున్నరు. యేకంగ ఓ పోరడు ధర్మం కాపాడే పనిల జేబుల కేలి పిస్తోలు తీషి ‘‘డిషా! డిషా’’!అని ఎదురుంగున్నోళ్ళను కాల్షిండు! పిట్టల్‌ ‌రాలినట్టు ఏడెనిమిది మంది గిలగిల గొట్టుకోని నెత్తుటి ముద్దయి జీవిడిషిండ్లు.ఎదురుంగున్న పోలీసు గాన్ని దొరికిచ్చుకోని చేతిలున్నది గుంజుకుంటడేమో అనుకుంటిమి ఆ పోలీసు సార్‌ ‌పోరనితోని ఓ సెల్ఫీ దిగనీకి ముందుకు బోయిండు గని పని కానట్టున్నది.జరిగేటియన్ని కండ్లతోని సూడాలె! నోట్లెకేలి మాటెల్లుతె తుపాకీ  గుండు గొంతులచ్చి పేలుడు ఖాయం! గింతగనం జెప్పబడితివి. వద్దురా!వారీ అంటినకుంట టీవీ వోళ్ళం మాకే మైతది !అని ఎగిరెగిరి ఫోట్వోలు తీషె!ఈడియోలు గూంజె! గిసోంటి ‘‘దేశద్రోహం’’ పనులు జేత్తే పోలీసులూకుంటరా, ఆళ్ళసలే యెవలి ఫౌజిలో యెరికె గద!? గాల్లచ్చి పోరల్లను పండేషి,గిండేషి పొర్క పొర్క దంచి, జిందగీల యాదికుండేటట్టు మైలపోలు తీషిండ్లు..
image.png

ఏ మతమన్న ఎదురుంగోని పాణాలు తీయమని జెప్తదా?ఏ మతమన్న ఇండ్లు,దుక్నాలు అగ్గి జేయమని జెప్తదా? మతాలన్ని మంచే జెప్పినంక మనుషులకేం బుట్టె! మాయదారి జిట్ట! ఇంతగనం వాడలకు వాడలు బూడిదకుప్పలెందుకైనయి! అనే అనుమానమచ్చి ‘‘అడుగుడు సూత యెందుకిట్ల నేరమైతాంది’’.అనడిగిన న్యాయమూర్తికి రాత్రికి రాత్రే తబాదలైంది. ‘‘చట్టం చేతుల తీస్కోని’’ ఎదురుంగ నడిషే ధర్మాని కడ్డు పోతేమయితది? యే మురికి నీళ్ళ మోరీల శవంగోలే తేలుతమో యెవలికి  యెరుక లేకుంటైతది! ధర్మం దాని పని అది జేత్తనే వుంటది. గంతగనం తిప్పలువడి ధర్మం కాపాడేటందుకు లారీలల్ల కాశీదేశం నుంచచ్చిన యోగులు బరాబరి పని జేత్తాండ్లా!లేదా! జేషే ముఖె?మైన పనిల ‘‘అమితా’’సక్తి తో నున్నరు దేశభక్త పోలీసులు. రాళ్ళు, ఇనుపరాడ్లు,యోగుల చేతులకందిచ్చేపని జూత ఆడాడ జేషినట్టే వున్నది!ఓ దిక్కు ఫోటోలు,ఈడియోలు తీషెటోళ్ళ కాల్జేతులు ఇర్గదంచే పని జేసుకుంటనే వుత్తగున్నట్టు మందికి కాన్రాబట్టిండ్లు.’’గింతగనం రోడ్లమీద నెత్తురు కారబట్టింది,గల్లీలకు గల్లీలె బగ్గి గావట్టినయి!జర ఆపకపోయిండ్లు సారూ ‘‘! అనెవలో అడుగుతె ‘‘గీ లొల్లిని ఆపమని పైనాపీసర్లు మాకేం మతులబ్‌ ‌పంపలె! మేం సూత యే ధర్మం కాపాడాల్నో పైనుంచి తెల్వంగనె జేషేది జేత్తం!అందాక మాత్రం గిట్నే జూత్తం’’ అని పోలీసులంటె జేషేదేమున్నది.

 పారిన నెత్తుటి తడి జూడబోతె యే మత మోల్లదో ఢిల్లీ గల్లీలల్ల మట్టికి సూత తెల్వ దాయె! మతాల తేడాలు జూడకుంట  అన్ని మతాల నెత్తుట్ల తడిషిన మట్టికి లేని మతం మనిషి కెందుకో సమజయితలేదు. మట్టికి లేని మతం మనిషి కున్నంక పాణం విలువ పత్తకు లేకుంట బాయె. పది మంది కూడితె ఎందుకనడిగి, అడ్డువడి,నిలేషే తుపాకీ..నాల్గుబాటల కాడ జనంగూడి ఓ నిజాన్ని నినాదం జేషి ఎగిరేస్తే ,ఎట్ల ఎగిరేస్తవని ఎట్లబడితట్ల కాల్పులు జరిపే తుపాకీ..ఇప్పడు ఢిల్లీ నేలంతా కారుతు న్న నెత్తుటి వెచ్చదనాన్ని సల్లారనివ్వకుంట, తూటాలు పేల్సుకుంట కావలి కాయబట్టింది. నిజాన్ని జూషి జడుసుకునే రాజ్యం అబద్దాల తొవ్వ తొక్కుతాందంటే కొత్త ఇచ్చంత్రమైతె కాదు.కానీ అబద్దాలను నిజమని జనానికి జెప్పి,నమ్మించే కుటిలబాజి కతలు బడి నెత్తుటేర్లు పారిచ్చుడు రాజ్యానికి మంచిదెట్లయితది?కుర్చీ గట్టి గుండాల్నంటె జనంమెచ్చే నాల్గుమంచి పనులు జేయాలె గని రైలు బుగ్గిజేసుడుతోని గుజరాత్‌ ‌కుర్చీ గట్టిగైందని గసోందేయే దేశమంత జేషి ‘‘అచ్చేదిన్‌’’ ‌తెచ్చుకుంటనని కలలు గంటె యేమయింది?దునియా మొత్తం మీడియోళ్ళు ‘నాలుగుతిట్టి,మూడు కొసరేషి’ ఇజ్జత్‌ ‌బర్బాత్‌ ‌జేషె!  ‘‘గోధ్రా రైలు’’ యేడ బడ్తె ఆడ నడువక పోవచ్చు! ఢిల్లీ మొగాన అసలు పోయే కతే కానత్తలేదు. గుజరాత్‌ ‌లెక్కలన్ని  దేశమంత కలవక పోవచ్చు! ధర్మం కాపాడుతానని,మతం మాస్క్ ‌తొడుక్కోని ‘‘కార్పొరేట్‌’’‌లకు దేశాన్ని,దేశ సంపదల్ని పిసికి, పాలబువ్వోలిగె కలిపి తినిపిచ్చుడు అందరికి కానత్తలేదా! మనుసులున్న దాసుకున్న ‘‘ఎజెండా’’ల కోసం  తీరొక్క కతలు పడుడు ఎంత కాలం నడుత్తది కావచ్చు! ఇలువైన మన ‘‘రాజ్యాంగం’’ కాపాడేటందుకు గద్దె నెక్కి,ఆ రాజ్యాంగాన్నే బొంద బెట్టె పనులు ఒకటెనుక ఒకటి కానియ్య పడితిరి. ‘‘ఔ!ఔ!నిజమేనుల్లా’’! అని ఏకంగ న్యాయం జేప్పే పెద్ద కోర్టుల్నే అన్నాయం రాజ్జెమేలుతాందని ‘‘నల్గురు న్యాయ మూర్తులు’’ గంతగనం ఖుల్లంఖుల్ల జెప్పెనే జెప్పె!
దేశభక్తులెప్పుడు దేశాన్ని యెట్ల కాపాడాలె అనే రంధి తోనే వుంటరు.
దేశద్రోహులనుకుంటె జాలు ‘‘గోళీ మారో’’ అని పిలుపునిత్తరు.లేకుంటె ‘‘శివాజీ చేతిల కత్తి లాంటిది తీస్కోని అడ్డమచ్చినోళ్ళందరిని నరికి పోగులేయంటరు’’ ఇంకో దిక్కున  ఎవలెంత మంది యేడ నిల్సోవాల్నో, కూకోవాల్నో ,ఎప్పుడు జాగ ఖాలీ జేషి పోవాల్నో జెప్తరు. ఏ ధర్మాన్ని పాటిస్తె దేశలభక్తులో మసీదు మీదికెక్కి బుగ్గి పెట్టిన దేశభక్తుడి చేతిలున్న జెండాలు ,ఎవలి ఎజెండా లేందో చెప్పకనే జెప్పబట్టె! ఢిల్లీల జరిగిన నెత్తుటి దాడులకు బాధ్యులెవలనేది’ జవాబు దొరకని ప్రశ్నగనే మిగులుతని అడిగెటోళ్ళందరికెరికె.కోర్టులకు జర్రింత ఎక్కువనే ఎరికె! ఎవలకు ఎరికె గాకుంటమాయె గని ఓట్లేషే జనానికి యెరికైతె సాలు! సూడ్రా బయ్‌!ఇ‌క్రమార్క్! ఇనుడే కాదు, టీ.వీ.లల్ల సూత చూసినవు కద ఢిల్లీల నెత్తుటేరులు పారిచ్చిన దాడులకు కారణం యేంది కావచ్చు?యెవలు జేషిండ్లని తేలుతాంది?నా ప్రశ్నలకు సరైన జవాబులియ్యకుంటె ఢిల్లీ పోలీసులను పిలుసుడే మల్ల! అని బెదిరియ్య బట్టిన భేతాళుని శవాన్ని ఎప్పటి తీరింగనే భుజానేసుకోని ‘‘  ఇను భేతాళ్‌ ‌మన రాజ్యాంగంల లౌకిక భావనలున్నంక సూత ఒకే భాష,ఒకే ధర్మం! ఒకే మతం!అనే కతలు పడుకుంట రాజ్యాంగం మౌలిక సూత్రాలను సమాధి చేసేటి సంఘపరివారం, తాము అనుకున్నది సాధించుకునేటందుకు ఎంతకైనా తెగబడ్తదనటానికి చేసిన హెచ్చరికనే ఢిల్లీ నెత్తుటి సంఘటన. ఓ చేతిల కాషాయ పతాకం,ఇంకో చేతిల జాతీయ పతాకంతోని మసీదు పైకెక్కి వికటాట్టహాసం చేసుకుంట ఓ యువకుడు తుపాకీ కాల్పులతో రోడ్డు మీద నడిషె ఇంకో యువకుడు వీడియోలు తీషి ఢిల్లీ గుండెలపై చేసిన నెత్తుటి సంతకం ఎవలిదో’’! అని జెప్పుకుంట నడ్వబట్టిండు…నడ్వబట్టిండు.
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply