- జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా
- వర్షంలోనూ పాల్గొన్న వైకాపా ఎంపిలు
- స్టీల్ ప్లాంట్ కోసం జరిగిన త్యాగాలను గుర్తు చేసిన విజయసాయి
న్యూఢిల్లీ, ఆగస్ట్ 2 : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికులు చేపట్టిన ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. టిడిపి కూడా ఇందుకు మద్దతుగా నిలిచింది.ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయ సాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంలోనూ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వైఎస్సార్సీపీ ఎంపీ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కోసం 23 వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారు. స్టీల్ ప్లాంట్‌లో 1991లో ఉత్పాదన ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్నులు.
లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం తగదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది. దురుద్దేశపూర్వకంగానే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తోంది.. ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదు. దశాబ్దం పాటు పోరాటం చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ఎన్నో త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది. కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలను స్టీల్‌ప్లాంట్ కాపాడింది. రూ.22 వేల కోట్ల అప్పులను ఈక్విటీగా మార్చాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని అన్నారు. ఇక స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, విశాఖ స్టీల్ ప్లాంట్ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిందన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు.
ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారని, లేఖ ద్వారా సీఎం జగన్ ప్రత్యామ్నాయాలు సూచించారని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాఢలని సీఎం జగన్ కోరినట్లు తెలిపారు. పార్లమెంట్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించామని అన్నారు. ఏపీకి ప్రత్యేక •దా, పోలవరం, స్టీల్‌ప్లాంట్ అంశాలపై సభను అడ్డుకున్నామని.. సీఎం జగన్ దిశానిర్దేశరతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు తెదేపా ఎంపీలు మద్దతు పలికారు. జంతర్‌మంతర్ వెళ్లి ఆందోళన చేస్తున్న ఉక్కు కార్మికులకు ఎంపీ గల్లా జయదేవ్, కనకమేడల మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు పార్టీలన్నీ కలిసి పోరాడాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమకారులకు మా పార్టీ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా పార్లమెంటు లోపల, బయట పోరాటం చేస్తామన్నారు.