Take a fresh look at your lifestyle.

యత్ర నార్యస్తు పూజ్యంతే…

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం..
స్త్రీ అంటే ఆదిశక్తి, స్త్రీ అంటే ప్రకృతి. సృష్టికే ప్రతిసృష్టి నిచ్చి సమాజానికి మార్గ నిర్దేశనం చేసే మహిళ సంసార సాగరంలో తనకు తానే సాటి. ఓర్పు, నేర్పు, ఓదార్పు లకు అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా ఆత్మీయతను అనురాగాన్ని పంచె అమృతమూర్తి మహిళ.

‘‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’
ఎక్కడైతే స్త్రీలు గౌరవింప బడతారు అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అనే స్ఫూర్తిని నిజం చేస్తూ అవని నుండి అంతరిక్షం వరకు రాజకీయ రంగం కార్పొరేట్‌, ‌వాణిజ్య, క్రీడా, విద్య,వైద్యం, అంతరిక్షం రంగాలలో అతివల విజయాలకు హద్దులు లేవని అనిపిస్తోంది. కానీ లింగ వివక్షత, వేతన సమానత్వం ఈ విషయంలో వెనకబడే ఉన్నారని చెప్పాలి. మొదట అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శ్రామిక మహిళా దినోత్సవం గా పిలువబడేది. చాలా ప్రదేశాల్లో స్త్రీలకు గౌరవం మరియు గుర్తింపు నుండి ఆర్థిక రాజకీయ సామాజిక సాధనాల ఉత్సవంగా ఏర్పడింది.గత చరిత్రను పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికి సమాజానికి, ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడానికే ఈ వేడుక.సంప్రదాయాలు కాపాడుకోవడానికి పండుగలు ఎలాగో మహిళల ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం మహిళా దినోత్సవంఅలాంటిదే.

పని గంటలు వేతనంలో వ్యత్యాసం, ఒక బట్టల మిల్లులో ప్రారంభమైన సమ్మె 1857లో మార్చి 8న సమ్మె విజయవంతమైన సందర్భంగా మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని చరిత్ర చెబుతుంది. మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని ఏది క్లారా,నాప్కిన్‌ అనే మహిళలు కోపెన్హాగెన్‌ అనే నగరంలో 1910లో ఇంటర్నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ఆఫ్‌ ‌వర్కింగ్‌ ఉమెన్‌ ‌సదస్సులో ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుండి సమావేశానికి హాజరైన వందమంది మహిళలు జట్కిన్‌ అభిప్రాయాన్ని ఏకీభవించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1911లో ఆస్ట్రేలియా,డెన్మార్క్, ‌జర్మనీ, స్విట్జర్లాండ్‌ ‌దేశాల్లో నిర్వహించారు. 1975 లోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్య రాజ్యసమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది.’’ గతాన్ని వేడుక చేసుకోవడం- భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడం’’ అనే థీమ్‌ ‌తో ప్రారంభించింది.

స్త్రీల జీవన ప్రమాణాలు దేశ అభ్యున్నతికి కొలమానాలు అన్నారు నెహ్రూ
క్రియాశీలక అంశాల్లో తనంతట తాను నిర్ణయాలను తీసుకునే శక్తిని మహిళా సాధికారత అంటాం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థిరత్వానికి విద్య తోడైతే మహిళా విజయానికి అవధులు ఉండవు. కానీ కానీ ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురవుతూనే ఉంది. సభ్యసమాజం చైతన్యాన్ని సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై వంచనలు,వేధింపులు, అఘాయిత్యాలు, ప్రేమించలేదని కత్తితో దాడులు, యాసిడ్‌ ‌దాడులు, కట్నం కోసం వేధింపుల వల్ల పూర్తిస్థాయిలో స్త్రీలు ముందుకు రాలేక పోతున్నారు. నిర్భయ దిశ లాంటి సంఘటనలు ఎన్నో(చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే ఉంటుంది) సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని నిర్భయలాంటి కఠినమైన చట్టాలు తెచ్చినా కామాంధుల ఆగడాలకు హద్దే లేకుండా పోతుంది. ఎక్కడుంది లోపం? ఎవరిది తప్పు? ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, కోర్టులు ఎన్ని శిక్షలు, వేసినా స్త్రీలపై అత్యాచారాలు చేసే వారి తీరు మారడం లేదు.మార్పు రావాలంటే స్త్రీల పట్ల సహృదయత, సమానత్వ భావం, గౌరవ భావం మొదలైన వాటిని తల్లిదండ్రులు పిల్లల్లో చిన్న వయసు నుండే కలిగించాలి. ఇది ఇది ప్రతి ఇంటి నుండి ప్రారంభం అవ్వాలి వ్యక్తిత్వాన్ని,సామర్థ్యాన్ని గుర్తించి గౌరవించాలని భావన మన సమాజంలో ప్రతి ఒక్కరిలో కలిగినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మార్పు సాధ్యమవుతుంది.

ఒక సంపూర్ణ మానసిక స్థైర్యం కలిగిన స్త్రీ కండలు తిరిగిన పురుషుడి కంటే శక్తివంతమైనదని చెప్పాలి..ఊహ తెలిసిన వయసునుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం, అందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రేమను, ఆత్మీయతను పంచి తనవారి కోసం అహర్నిశలు కష్టించి అవమానాల్ని సహించి, కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తూ తన ఇంటిని నందనవనంగా మార్చి మరో తరానికి దారులు సుగమం చేస్తుంది పడతి. మహిళలను అంధకారం లోనూ తెరచాటున ఉంచేసి మీరు మాత్రం ముందుకు నడవాలి అనుకోవడం వృధా ప్రయాసే అది ఎప్పటికీ జరగదు అంటారు సిస్టర్‌ ‌నివేదితలిబ్రిటన్లో పుట్టి భారత మహిళా విద్యాభివృద్ధికి కృషిచేసిన సంస్కర్త సిస్టర్‌ ‌నివేదిత.

కొంతమంది మహిళలు రాజకీయ రంగంలో రాణిస్తుంటే మరికొంతమంది మహిళల భర్తలు వీరి పేరుతో పెత్తనం చెలాయిస్తున్న ఉదంతాలు ఎన్నో మనం చూస్తున్నాం సమాజ నిర్మాణంలో సగ భాగమైన స్త్రీకి సమానత్వమే దేశ ప్రగతికి మూలం అనే నినాదం రావాలి. మహిళల స్థితిగతులు బాగుపడందే సమాజం అభివృద్ధి చెందదు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కీలకం. రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకొని పురుష శక్తికి తామేమీ తక్కువ కాదని నిరూపించగలరు స్త్రీలు. ఇప్పుడిప్పుడే పురుషాధిక్య ప్రపంచంలో స్వేచ్ఛను సంపాదించుకొని అనేక రంగాల్లో ఎదుగుతున్నారు. కోరుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు. వైవాహిక వ్యవస్థలో స్త్రీకి కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. అవి తెలుసుకొని వారి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వరకట్న సమస్య నేటి మహిళలకు ఉరితాడు అయ్యింది నేటి కాలంలో పెళ్లి సమయంలో వధువు గౌరీ పూజ చేస్తుంటే వరుడు డౌరీ పూజ చేస్తున్నాడు.

ఒకప్పుడు వధువు తల్లిదండ్రులు వారి ఇష్టపూర్తిగా ఇచ్చే కానుకలు నేడు బేరసారాలు ఆడి వర కట్నం రూపంలో పచ్చని తోరణాలు వాడక ముందే కాళ్ళ పారాణి ఆరక ముందే కట్నం కొరలకు బలవుతున్నారు అబలలు. భర్తల ఆధిపత్యానికి కుటుంబ పెద్దల అహంభావానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నారనే ఆలోచనతో 2005 2006 ప్రాంతంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం గృహ హింస చట్టాన్ని తీసుకొచ్చింది .

కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లరు సుమతి..
ఏ ఇంట్లో నైతే స్త్రీ కంట నీరు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండదట. అంటే ఆడవారిని లక్ష్మీ సమానులుగా దేవతగా కొలిచే సంస్కృతి మనదని వేమన గారు ఆనాడే సుమతి శతకం లో చెప్పారు. సమాజమంతా తనను ఎదిరించిన భర్త తనను ఆదరిస్తే ఆ ఆదరణ ముందు చీదరింపులు అధిగస్తాయి. సమాజమంతా పొగిడినా ఎంత విలువ ఇచ్చిన భర్త కసిరితే దానికి కృంగిపోతుంది మహిళ.

కార్యేషు దాసి- కరణేషు మంత్రి
భోజ్యేషు మాత- శయనేషు రంభ
అని అని కవి చెప్పినట్లు ప్రతి మగాడి జీవితంలోనూ స్త్రీ పాత్ర లేనిదే అతని జీవితానికి మనుగడ లేదని చెప్పాలి. మహిళలకు కొంత ఆర్థిక స్వావలంబన స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా గ్రూపుల ద్వారా కొంత మార్పు వచ్చిందని చెప్పాలి, కానీ ఇంకా రావాల్సింది ఉందని చెప్పాలి. మహిళా సంఘాలు సఖీకేంద్రాల ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు.అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తున్నారు. స్త్రీల రక్షణ కోసం కొత్త టెక్నాలజీ ఎన్నో వచ్చాయి. వాటి వినియోగం పై అందరికీ చైతన్యం కల్పించాలి. ముఖ్యంగా యువతకు కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలి. మహిళా రక్షణ చట్టాలు మరింత కఠినతరం చేయాలి. మహిళలను కన్నెత్తి చూడాలంటే వెన్నులో వనుకు పుట్టేలా కఠిన శిక్షలు అమలు చేస్తే మహిళలపై జరిగే దాడులను కొంతవరకు తగ్గించవచ్చు. భారతదేశ చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధుల శాతం 12శాతానికి మించలేదు.ఎంత దారుణం అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా స్వతంత్ర భారతదేశానికి ఇప్పటివరకు ప్రతిభా పాటిల్‌ ‌గారు ఏకైక మహిళా రాష్ట్రపతిగా పని చేశారు. అదేవిధంగా ప్రధానిగా ఇందిరాగాంధీ తర్వాత ఎవరు కూడా స్త్రీలు ప్రధానిగా చేయలేదు. అంటే మహిళా ప్రాతినిధ్యం రాజకీయ రంగంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం జాతీయ చట్ట సభల్లో నే కాదు మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మొదటి కేబినెట్‌ ‌లో ఒక్క మహిళకు కూడా స్థానం లభించలేదు. కానీ పంచాయతీ ఎన్నికల్లో 50 శాతానికి రిజర్వేషన్‌ ‌మాత్రం కల్పించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ ‌కల్పించే ఉద్దేశంతో రూపొందించబడిన మహిళా బిల్లు దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమోదం కోసం వేచి చూస్తూనే ఉంది.

బేటీ బచావో బేటి పడావోలిలాంటి నినాదాన్ని తెచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి పార్లమెంటులో సంపూర్ణ మద్దతు ఉన్నందున మహిళా బిల్లును ఆచరణలోకి తేవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ మహిళలన్నా వారికి సంబంధించిన చట్టాలన్నా చిన్న చూపు. అశ్రద్ధ. మార్చి 8 రోజున మాత్రమే బుద్ధిమంతులుగా మాట్లాడడమే కాదు స్త్రీలను అందలమెక్కించక పోయినా పర్వాలేదు, గానీ అగ్ని కి ఆహుతి ఇయ్యకుంటే చాలు. ప్రతినిత్యం స్త్రీల పట్ల కొంత గౌరవం కలిగి ఉంటే చాలు. అచంచలమైన ఆత్మవిశ్వాసమే హద్దుగా మహిళలు ప్రగతి పథంలో పయనిస్తూ వారి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేయాలి…అవసరమైతే ఆడది ఆదిపరాశక్తి గా మారాలి…

– కొమ్మాల సంధ్య, తెలుగు అధ్యాపకురాలు, ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాల, సమ్మక్క సారక్క తాడ్వాయి
9154068272

Leave a Reply