Take a fresh look at your lifestyle.

రైతులను భయపెడుతున్న యాస్‌ ‌తుఫాన్‌

‌యాస్‌ ‌తుఫాన్‌ ‌బుధవారం సముద్రతీరాన్ని దాటుతుందని వాతావరణ నిపుణులు చెప్పటంతో రైతాంగం భయపడిపోతున్నారు. దీని ప్రభావం తెలంగాణ పైన ఉంటుందని చెప్పడంతో వరి ధాన్యం కుప్పలను ఎలా కాపాడుకోవాలా అని బెంగపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఈసారి ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

రైతుల కల్లాల ముందుకే వొచ్చి కొనుగోలుచేస్తారని ప్రభుత్వ అభయమైతే ఇచ్చిందికాని, ప్రభుత్వ ఆదేశాలు ఆ మేరకు అమలు కావడం లేదనేందుకు రాష్ట్రంలో నిత్యం ఎక్కడో దగ్గర రైతులు నిరసనలకు దిగుతున్నారు.  కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యం తరలించి ఇరవై నుండి  నెలరోజులు గడిచిన కొనుగోళ్ళను ప్రారంభించని సంఘటనలనేకం రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. దీంతో వాటి కావలి కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుకోకుండా కురిసిన వర్షాలు వారి పరిస్థితిని మరింత అధ్వాన్న  పరుస్తున్నాయి.  ఇటీవల రాష్ట్రంలో పడిన వర్షం కారణంగా చాలా జిల్లాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. అలా  తడిసిన ధాన్యం, ఆపైన కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తుండడంతో అవి మొలకెత్తుతున్నాయి. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎటూ కాకుండా పోతుండడంతో రోడ్లమీద పోసి నిప్పు పెడుతున్నారు.

నల్లగొండ జిల్లాలోని నాంపల్లిలో, జనగామ జిల్లా అక్కపల్లి గూడెంలో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. రైతుల కోతలు పూర్తి అయినా కొనుగోలు కేంద్రా ప్రారంభంలో జాప్యం, ఒకవేళ కేంద్రాలు ప్రారంభమైన గన్నీ బ్యాగులు లేవనో, లారీలు అందుబాటులో లేవనో, మిల్లుల్లో ధాన్యం నిండి ఉండడంతో చోటులేదనో ఏదో కారణంతో రోజుల తరబడి ఆలస్యం జరుగుతున్నది.  అక్కపల్లి గూడెంలో కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నెల రోజులు దాటుతున్నా కొనకపోవడం, ఈలోగా వర్షాలు పడడంతో ధాన్యం తడిసి మొలకొత్తడంతో రైతులు రోడ్డుపై పోసి తగులపెట్టారు. ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ సకాలంలో కొనకపోవడంతో దేవుడిపైన భారం వేయాల్సిన పరిస్థితి రైతులది.

వాస్తవంగా  కొనుగోలు కేంద్రాలకు వొచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెబుతున్న ప్రభుత్వ విధానం ఎక్కడా అమలు కావడంలేదు.  ఒక పక్క లాక్‌డౌన్‌, ‌మరో పక్క  ఎక్కడ కొరోనా అంటుకుంటుందోనన్న భయం, మరోపక్క అకాల వర్షాలతో రైతులకు దిక్కు తోచకుండా పోతున్నది.  ఇదిలా ఉంటే రెండు మూడు రోజుల్లో కొనుగోళ్ల ను ఆపేస్తున్నట్లు వార్తలు రావడంతో రైతులు మరింత బెంగ పడుతున్నారు.
అదే నిజమైతే మిగతా ధాన్యం పరిస్థితి ఏమిటని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశ్నిస్తున్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పుకునే ఈ ప్రభుత్వం ప్రతీఏటా రైతులతో కన్నీరు పెట్టిస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఎందుకు వొస్తున్నదంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా ఈ విషయంలో ప్రభుత్వ విధానాన్ని తూర్పార పడుతున్నది.

రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ‌వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ‌చేర్మన్‌ ‌సంకట అన్వేష్‌రెడ్డి డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఎందుకంటే తూకాల్లో కూడా రైతులను భారీగా నష్టపరుస్తుంటే మంత్రిగాని, ఈ ప్రభుత్వంగాని చూస్తూ ఊరుకుంటున్నారని ఆయన ఘాటుగా విమర్శిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రతీ క్వింటాలుకు 2 నుండి 3 కిలోల వరకు తరుగు తీస్తుండగా, మిల్లర్లు 3 నుండి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. దాదాపు ప్రతీ జిల్లాలో ఇదే వరుస కొనసాగుతున్నది. రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ భారీ కుంభకోణంలో ఎవరి వాటా ఎంత అంటూ ఆయన నిలదీస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో  తీసుకున్న   చర్యల కారణంగా ఈసారి అధిక దిగుబడి వొచ్చింది..  గత సంవత్సరం అనగా 2020 మే 28 నాటికి  52.23 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 2021లో మే 22 వరకే 56.86 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు చెబుతున్నది. తడిసిన ధాన్యం తో పాటు, ఆఖరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెబుతోంది. కాని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో అధికారులు మాత్రం అయిష్టత వ్యక్తం చేస్తుండడం రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తున్న అంశం.

Leave a Reply