ప్రాచీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4న ప్రారంభం కాగా, 14 వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 10న స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. 11న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం. 12వ తేదీన స్వామివారి దివ్య విమానం రథోత్సవం జరగనుంది. బ్రహోత్సవాల సందర్భంగా 11 రోజులపాటు బాలాలయంలో స్వామివారు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
యాదాద్రి ( యాదగిరిగుట్ట) తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి -భువనగిరి జిల్లాలోని మండల కేంద్రము. అష్టాదశ పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో ఈ ఆలయం మూలం గురించి ప్రస్తావించబడింది.
విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. ఆయన పుత్రుడు హాద ఋషి. హాదర్షి అని కూడా అంటారు. ఆయన నరసింహ స్వామి భక్తుడు. ఆయనకు స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక కలిగింది. ఆంజనేయస్వామి సలహా మేరకు చాలా కాలం తపస్సు చేశాడు. ఆ సమయాన ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. అయితే తపస్సులోవున్న ఋషికి తెలియ కుండానే వైకుంఠ నాథుని సుదర్శన చక్రం ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతి కాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి నట్లు కథనాలు.
యాద మహర్షి తన తపస్సుని కొనసాగించి, స్వామిని ప్రత్యక్షం చేసుకోగా, ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి, హాదర్షి కోరిక తీర్చి, శాంత మూర్తి రూపంలోనే లక్ష్మి నరసింహ స్వామి కొండపై కొలువై ఉండి పోయాడు. కొంత కాలం తర్వాత, స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్షి తిరిగి తపస్సు ఒనరించిన ఫలితంగా స్వామి వారు జ్వాలా, యోగా, ఉగ్ర, గండబేరుండ, లక్ష్మీ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. అలా యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి సమీపంలో అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు.
క్షేత్రానికి సంబంధించి మరో కథ ప్రకారం ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాక పోగా, దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని చెప్పి, లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయనవెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారని చెపుతారు.
చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ కోసం కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారని భక్తుల విశ్వాసం. ఋషులు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. మెట్ల మార్గాన వెళ్తే మధ్యలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూ గా వెలిశాడు. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరి గుట్ట పుణ్య క్షేత్రంలో పాత, లక్ష్మీ కొత్త లక్ష్మీనరసింహస్వామివారి రెండు ఆలయాలు ఉన్నాయి.
మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారట. ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఆ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద నిత్య జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు.
ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవములు పాల్గుణ శుద్ధ విదియ రోజున అంకురార్పణతో ప్రారంభమై 11 దినములు జరిగి , పాల్గుణ శుద్ధ ద్వాదశి తో సమాప్తం అవుతాయి. స్వామి వారిని ప్రతిరోజూ ఉదయం , రాత్రి వివిధ అలంకారములతో, శ్రీకృష్ణుడి అలంకారంలో, హంస వాహన లో, వటపత్ర శాయి, పొన్న వాహన సేవలో, గోవర్ధన గిరిధారి అలంకారములో, సింహ వాహన సేవలో, జగన్మోహిని అలంకార సేవలో, అశ్వవాహన సేవలో , శ్రీరామ అలంకార సేవ, గజవాహన సేవ, శ్రీమహావిష్ణు అలంకారం దివ్య విమాన రథోత్సవం లో లలో ఊరేగిస్తారు. మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, శ్రీస్వామి వారి శ్రీపుష్ప యాగం, డోలోత్సవం, శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో సేవలు నిర్వహిస్తారు. దేవాదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్ మార్గదర్శకత్వంలో, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్య నిర్వహణాధికారి ఎన్. గీత, ఆలయ ప్రధాన అర్చకులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్-19 నిబంధనలను అనుసరించి వేడుకలను బాలాలయం లోపలే నిర్వహిస్తారు. ప్రధానంగా మార్చి 10న – రామ అవతార అలంకారం, అశ్వ వాహన సేవ, రాత్రి 9గంటలకు స్వామివారి ఎదురుకొల్లుబీ
11న – హనుమంత సేవ, ఉదయం 11గంటలకు స్వామివారి కల్యాణోత్సవంబీ
12న – వెండి గరుడవాహన సేవ, రాత్రి 7 గంటలకు
మరియు స్వామివారి రథోత్సవంబీ 13న పూర్ణాహుతి, చక్రతీర్థం, శ్రీవారి పుష్పయాగం మరియు దోపు ఉత్సవం తదితర సాంప్రదాయ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్