ఎప్పుడో ఒకప్పుడు
అంతమౌతుందీ ప్రపంచం అంటే
ఏ కొంచం కూడా భయపడలేదు…
పుట్టినవాడు గిట్టక తప్పదని
పోరుపెట్టి చెవిలో చెప్పినా
వొణికిందీ లేదు …తొణికిందీ లేదు…
నిత్యం రకరకాల భయాలతో
తికమకపడినా…
అతి జాగ్రత్తగానో, ఆత్మ ధైర్యంగానో
ఆకాశమై నిలబడ్డాను…
చరణాల మధ్య మరణం
రాసిపెట్టి ఉంటుందని తెలియందెవరికి..?
పట్టించుకుంటే మనుగడే మృగ్యమై
మనిషి మిగులుతాడా..?
ఆయువెంతున్నా
భయం దాన్ని తినేస్తుంది…
నిప్పుకి కూడా తుప్పు పట్టించే
నెరజాణ… బెంగ…
హంగులకు లొంగి
మామూలుగా నిద్రలేచిన నాకేదీ
మామూలుగా కనిపించడంలేదు..
తేటగా తెల్లారినా చీకటి తొలిగినట్లు లేదు..
జలదరించిన వెన్నెముక కదిలిపోతోంది..
కదిలే కనుగుడ్లు అదుపు తప్పుతున్నాయి..
సమూహంలో ఒంటరితనం సతాయిస్తోంది..
భయం.. భయం.. భయం..
—
నేనిప్పుడెవరికి భయపడుతున్నాను..?
నిలువుటద్దంలో కనిపించే నా నీడకా..?
కనిపించని పురుగు కరోనాకా..!?

099871 45310