Take a fresh look at your lifestyle.

బుర్ర పూర్తిగా కుళ్లిపోయిన వ్యాఖ్య

‘‘ ‌భారత రాజకీయాలలో విమర్శ స్థాయిని బాగా అధోస్థాయికి దించిన ఘనత భారతీయ జనతా పార్టీదే. ఇప్పుడు ఈ హిమంత శర్మ వ్యాఖ్యలతో అది మురికి కాలువ స్థాయికి దిగజారింది. ’’

తెలంగాణలోరాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో నిరసనల పర్వం నడుస్తోంది ప్రస్తుతం. రేవంత్‌ ‌రెడ్డికి ఆ పదవి దక్కిన నాటి నుంచీ టిఆర్‌ఎస్‌ ‌సర్కారుకు వ్యతిరేకంగా  ఆయన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను ఏదో ఒక కారణంతో రోడ్డు మీదకు తీసుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు సాగుతున్న నిరసనలకు మాత్రం మూలం వేరే ఉంది. రాహుల్‌ ‌గాంధీని ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్న మాటలపై తెలంగాణలో కాంగ్రెస్‌ ‌నేతలు వేరే వేరే పోలీస్‌ ‌స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చారు. పోలీసులు ఆ ఫిర్యాదులపై తగిన విధంగా కేసు కట్టడం లేదంటూ కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిన్న రోడ్లపైకి వచ్చాయి.
రాహుల్‌ ‌గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టికీ వచ్చే ఉంటాయి గానీ ఒకసారి మళ్లీ చెబుతాను. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌లోని టెరరిస్టు శిక్షణా శిబిరాలపై జరిపారంటున్న సర్జికల్‌ ‌స్ట్రయిక్స్ ‌కు ఆధారాలు చూపమంటున్న రాహుల్‌ ‌గాంధీని.. ఆయన తన తండ్రికే పుట్టారనడానికి ఆధారాలు చూపమని మేమెప్పుడన్నా అడిగామా అని హిమంత శర్మ వ్యాఖ్యానించారు. బుర్ర పూర్తిగా కుళ్లిపోయిన వారు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యానాలు చేయగలరు. 2015 వరకూ కాంగ్రెస్‌ ‌లో ఉన్న హిమంత  శర్మను ఈ వ్యాఖ్యల విషయంలో తప్పు పట్టడానికి ‘ఎ పార్టీ  విత్‌ ‌డిఫరెన్స్’ అని గతంలో చెప్పుకున్న బీజెపి రెడీగా లేదు. మావాడు తప్పు మాట్లాడాడు అని ఇంతవరకూ బీజెపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అనలేదు. దీనిని బట్టి అస్సాం సిఎం వ్యాఖ్యలకు ఆ పార్టీ నాయకత్వం ఆశీస్సులు ఉన్నాయని మనం అనుకోవాలి. భారత రాజకీయాలలో విమర్శ స్థాయిని బాగా అధోస్థాయికి దించిన ఘనత భారతీయ జనతా పార్టీదే. ఇప్పుడు ఈ హిమంత శర్మ వ్యాఖ్యలతో అది మురికి కాలువ స్థాయికి దిగజారింది. నిజమే… కానీ ఆ వ్యాఖ్యలపై రేవంత్‌ ‌రెడ్డి బృందం చేస్తున్న కంగాళీ సమర్ధనీయమేనా..? హిమంత శర్మను పూర్తిగా పట్టించుకోకుండా ఉంటేనే  తానన్న మాటలకు అతను ఏమాత్రమన్నా సిగ్గుపడతాడేమో. ఇప్పుడీ రచ్చ జరిగేసరికి సైన్యాన్ని అడ్డం పెట్టుకుని తానన్న మాటలకు సమర్ధనీయతను ఆపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడాయన.
హిమంత శర్మ వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమైన మాటలు అన్న విషయంలో ఏ మాత్రం అనుమానం లేదు కానీ దానికి ఐపిసిలోని కఠినమైన సెక్షన్ల కింద ఆయనపై కేసు పెట్టాలని కాంగ్రెస్‌ ‌కోరడం సబబేనా..! అది కూడా కాంగ్రెస్‌ ‌కార్యకర్తల ఫిర్యాదు ఆధారంగా. నాకు తెలిసి హిమంత శర్మ మాటలు మహా అయితే పరువు నష్టం కేసుకు తగినవి. బాధితుడు రాహుల్‌ ‌గాంధీ కాబట్టి ఆ పరువు నష్టం కేసు ఆయనే పెట్టాలి. కానీ ఆయన హిమంత శర్మ మాటలను పట్టించుకోలేదు. అలా పట్టించుకోకపోవడమే కరెక్టు. హిమంత శర్మ లాంటి నీతిమాలిన రాజకీయవాదులకు అదే తగిన జవాబు. హిమంత మాటలపై ఇంత అల్లరి చేస్తున్న రేవంత్‌ ‌రెడ్డి.. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పుట్టినరోజు కాదు తద్దినం జరపండి అని ఎలా అన్నారు. మరి ఆ మాటలే రకమైన రాజకీయ విమర్శ. ఎదుటివారిని వేలెత్తి చూపేముందు మనం లోపరహితంగా ఉండవద్దూ.
రాహుల్‌ ‌గాంధీని ఉద్దేశించి హిమంత శర్మ అన్న మాటల వల్ల సమాజానికి ప్రమాదం లేదు. నిజానికి అలాంటి మాటల వల్ల అలా మాట్లాడిన వారికే ఎంతోకొంత నష్టం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌ ‌లో 80 శాతానికీ 20 శాతానికీ మధ్య పోటీ జరుగుతోందని.. తన పేరు ముందు యోగి అనే పదాన్ని తగిలించుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు చూడండి.. ఆ మాటల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. దేవభూమిలో ముస్లిం యూనివర్సిటీని సహిస్తారా అని ఈ  దేశ ప్రధానమంత్రి అన్నారు చూడండి.. అలాంటి మాటల వల్ల సమాజానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. దేశ విభజన సమయంలో ఇండియాను ఎంచుకున్న ముస్లింలు ఈ దేశానికేం మేలు చేసినట్లు కాదని యోగి ఆదిత్యనాధ్‌ అన్నారు చూడండి.. అలాంటి మాటల వల్ల సమాజానికి ఎక్కువ కీడు జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌ ‌లో యోగి ప్రభుత్వం గెలవకపోతే జనాన్ని బుల్డోజర్ల కింద తొక్కిస్తామని హైదరాబాద్‌ ‌పాతనగరం బీజెపి ఎమ్మెల్యే  రాజా సింగ్‌ అన్నాడు చూడండి… అలాంటి మాటల వల్ల సమాజానికి మరింత హాని జరుగుతుంది. అంతేకానీ వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే విమర్శల వల్ల కాదు.
గాంధీజీని విమర్శించి.. ఆయన హంతకుడు నాధూరాం గాడ్సేను కీర్తించినందుకు కాళీచరణ్‌ ‌మహరాజ్‌ అనే హిందూ స్వామీజీని మొన్న డిసెంబర్‌ ‌లో చత్తీస్‌ ‌ఘడ్‌ ‌పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. గాంధీజీని విమర్శించేందుకు, గాడ్సేను పొగిడేందుకూ పౌరులకున్న హక్కును గౌరవించకపోతే గాంధీ తత్వం గొప్పదనం గురించి మనం ఎవరికైనా ఏం చెప్పగలం. స్వేచ్ఛా స్వాతంత్య్రాల విలువల కోసం ఏం పోరాడగలం..! ఈ తేడా మనకు తెలియాలి. అసలైన వ్యవహారాలపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు హిమంత శర్మ చేసిన దూషణల వంటి వాటిని సృష్టించే కళలో బీజెపీ ఆరితేరింది. దేనిని పట్టించుకోవాలో దేనిని పట్టించుకోకూడదో రాజకీయులకు తెలియకపోతే దానికి సమాజం మూల్యం చెల్లించాల్సివస్తుంది.

Leave a Reply