- మొత్తం 88,956 మంది మృత్యువాత
- కొరోనాతో కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
- ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 15,23,898 కేసులు నమోదయ్యాయి. గురువారం సాయంత్రానికి ప్రపంచవ్యాప్తంగా 5,938 కేసులను పాజిటివ్ కేసులుగా ప్రకటించారు. అలాగే కరోనా మహమ్మారి వల్ల 501 మంది మరణించారు. ప్రపంచం వ్యాప్తంగా ఇప్పటి వరకు 88,956 మందిని ఈ రక్కసి బలికొంది. దేశంలో ఇప్పటి వరకు 5,734 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దేశంలో 24 గంటల్లో 17 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటి వరకు 166 మంది మృతి చెందారని చెప్పారు. రాష్టాల్రకు పీపీఈ కిట్స్, వెంటిలేటర్లు పంపుతున్నామని, 1.54 కోట్ల పీపీఈ కిట్లకు ఆర్డర్ చేశామని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం: క్రిస్టలినా
గడచిన శతాబ్దంలో ఎదురైన సంక్షోభాలన్నిటిలో అత్యంత తీవ్ర ప్రభావం చూపుతున్నది కరోనా వైరస్ మహమ్మారి అని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గ్రేట్ డిప్రెషన్ తర్వాత భారీగా దెబ్బతినడానికి కారణం ఈ మహమ్మారేనన్నారు. 2020లో ప్రపంచ వృద్ధి వ్యతిరేకాత్మకం అవుతుందని హెచ్చరించారు. ఐఎంఎఫ్ సభ్య దేశాలు 180 కాగా, వీటిలో 170 దేశాల్లో తలసరి ఆదాయం క్షీణించిందని చెప్పారు. వచ్చే వారం ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు స్ప్రిగ్ టింగ్స్ జరుగుతాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆంక్షలు అమలవుతుండటంతో ఈ సమావేశాలను డిజిటల్ విధానంలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా గురువారం ప్రసంగించారు. నిజానికి తాము గ్రేట్ డిప్రెషన్ తర్వాత అత్యంత దయనీయమైన ఆర్థిక వ్యవస్థ పతనం రాబోతోందని భావిస్తున్నట్లు క్రిస్టలినా తెలిపారు. వచ్చే ఏడాది పాక్షికంగా మాత్రమే కోలుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది చివరికి కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి మరింత దిగజారే అవకాశాలే కనిపిస్తున్నాయని, ఎటు చూసినా తీవ్రమైన అనిశ్చితి కనిపిస్తోందని చెప్పారు. వ్యాపారాలు, కుటుంబాలు కోలుకోవాలంటే ప్రభుత్వాలు మరింత అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే వివిధ దేశాలు దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరిలో ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచ వృద్ధి రేటు 2020లో 3.3 శాతం, 2021లో 3.4 శాతం అని అంచనా. అయితే ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తారతమ్యాలు లేకుండా, ఒకే విధంగా దెబ్బతిన్నాయని జార్జీవా చెప్పారు.