Take a fresh look at your lifestyle.

నేడు ప్రపంచ తలసేమియా దినం ప్రాణాంతక వ్యాధి..తలసేమియా

nerupati aanandhప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నప్రాణాంతక వ్యాధుల్లో ‘తలసేమియా’ ఒకటి. తలసేమియా అనేది వంశపారంపర్యంగా వచ్చే రక్త సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ప్రాణాలు కాపాడుకోవాలంటే పదిహేను రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాల్సిందే. చాలా మంది బాధితులు రక్తం కొరత, అందుబాటులో లేక బాధితులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచ తలసేమియా దినాన్ని జరుపుకుంటాము. ఈ వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన, వ్యాధిగ్రస్తులలో మనోధైర్యం, వ్యాధి రాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడం, వివాహానికి ముందే వధూవరులు రక్త పరీక్షలు చేసుకునేల ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంవత్సరం ‘తలసేమియాకు కొత్త శకం ప్రారంభమైంది’’ అనే నినాదంతో జరుపుకుంటున్నాము. ప్రాణంపోసే కన్నవారి ద్వారానే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. తలసేమియా జన్యు వాహకుల్కెన తల్లిదండ్రులకు(తలసేమియా మైనర్‌) ‌జన్మించే బిడ్డల్లో పాతిక శాతం మంది పుట్టుకతోనే వ్యాధి గ్రస్థులయ్యే(తలసేమియా మేజర్‌) అవకాశం ఉంది. మిగతా పాతికశాతం మంది సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. మరో యాభైశాతం కేవలం వాహకులుగానే (తలసేమియా మైనర్‌) ‌మిగిలిపోవచ్చు.

వీరికి పెద్దగా సమస్యలు ఉండవు కానీ, మరో వాహకుడి ద్వారానో, వాహకురాలి ద్వారానో కలిగే సంతానానికి మాత్రం తలసేమియా వచ్చే అవకాశం ఉంది. మనదేశంలో ఆరు కోట్లమంది తలసేమియా వాహకులు ఉన్నారు. ప్రపంచ జనాభాలో 4.5(250 మిలియన్లు) శాతం మంది తలసేమియా మైనర్‌ ‌వ్యాధితో బాధపడుతున్నారు. 35 మిలియన్ల భారతీయులు ఈ వ్యాధి కలిగించే అసాధారణ కలిగిన వాహకులు. ఈ ప్రపంచంలో ప్రతి సంవత్సరం లక్ష మంది శిశువులు తలసేమియా మేజర్‌తో జన్మిస్తున్నారని అంచనా. మన దేశంలో ప్రతి సంవత్సరం 10 నుండి 12 వేల మంది పిల్లలు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు.తల్లిదండ్రుల ద్వారా పుట్టుకతోనే వచ్చే ఈ వ్యాధి పిల్లలు ఎదుగుతున్న కొద్దీ బయటపడుతుంది. మూడు నుంచి 18నెలల్లోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి బారిన పడిన వారిలో రక్తహీనత మొదలవుతుంది. జీర్ణశక్తి మందగించడం, మొహం పాలిపోవడం, పిల్లల్లో అల్లరి తగ్గిపోవడం, ఎదుగుదల లోపించడం, హుషారుగా కనిపించేవారు కాస్తా నీరసించడం జరుగుతుంది. పచ్చకామెర్లు, కీళ్లనొప్పులు, కడుపునొప్పి, మూత్రం పసుపు రంగులోకి మారడం వంటి వ్యాధులు కూడా వెంటాడుతాయి. ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్‌ ‌లోపించి రక్తహీనతకు దారితీస్తుంది. తలసేమియాతో బాధపడే వారిలో ఆక్సిజన్‌ను రవాణా చేసే హిమోగ్లోబిన్‌ ‌తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ వ్యాధి రెండు రకాలు. హిమోగ్లోబిన్‌ ‌ప్రోటీన్‌లో వివిధ భాగాలలో వచ్చే లోపాల వల్ల ఈ రెండు రకాల వ్యాధులు వస్తాయి. తక్కువ స్థాయి వ్యాధి గ్రస్తులలో రక్తహీనత, కాలేయం, పిత్తాశయం, పరిమాణం పెరగడం వ్యాధినిరోధకశక్తి తగ్గడం పెరుగుదల నెమ్మదిగా ఉండడం. ఎముకలు సన్నబడి పెళుసుగా మారడం గుండెపోటు మొదలైన లక్షణాలు ఈ వ్యాధి సోకినా వారిలో కనిపిస్తాయి.

బాధితులకు 15రోజులకోసారి సెలైన్‌ ‌వాష్‌డ్‌ ‌రక్తం ఎక్కిస్తే జీవిస్తారు. ఒకటి రెండుసార్లు కాదు జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందే. 20 సార్లకు పైగా రక్తం ఎక్కిస్తే వారి ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుంది. ఆ తర్వాత 40 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తులకు 15యూనిట్ల రక్తం ఎక్కించిన తర్వాత ఐరన్‌ ‌చిల్లేషన్‌ ‌మెడిసిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. నెలకు ఐదు నుంచి పదివేల దాకా మందులకే ఖర్చవుతుంది. మేనరికం, వ్యాధిగ్రస్తులు వివాహం చేసుకోవడం వల్ల ఈ వ్యాధి తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తుంది. వివాహానికి ముందే రక్త పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని నివారించవచ్చు. అలా చేయకపోవడం వల్ల పిల్లలు వ్యాధి బారిన పడాల్సి వస్తోంది. పెళ్లికి ముందు కంప్లీట్‌ ‌బ్లడ్‌ ‌కౌంట్‌(‌సీబీసీ), హెచ్‌బీఏ 2 పరీక్షలు చేయించుకుంటే సమస్యలు ఏర్పడవు. పెళ్లికి ముందు హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకునేలా ఎలా ప్రచారం చేస్తున్నారో తలసేమియాపైనా ప్రచారం చేయాలని పలువు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుదల తక్కువగా ఉండడం, పెలుసు బారిన ఎముకలు తొందరగా వ్యాధులకు గురికావడం వంటి లక్షణాలను మెదడు ఏడాదిలో గుర్తించినట్లయితే తలసేమియా మేజర్‌ను తగ్గించడం తేలికవుతుంది. మొదటి సంవత్సరములోనే శిశువులలో హిమోగ్లోబిన్‌ ‌స్థాయి పెరుగుదలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. హిమోగ్లోబిన్‌ ‌పరిమాణము 70 శాతం తగ్గినప్పుడు పిల్లలలో పెరుగుదల లోపిస్తుంది. వారు క్రమం తప్పకుండా మార్పిడికి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సమస్యల లెక్కల ప్రకారం హిమోగ్లోబిన్‌ ‌స్థాయి 115 నుండి 120 గ్రామ్స్ ‌ఫర్‌ ‌లీటర్‌గా ఉండేలా చూడటం ఈ చికిత్సలో ముఖ్యమైన అంశం. ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి గాఢత కలిగిన ఎర్ర రక్త కణాలను ప్రవేశపెట్టడం ద్వారా చికిత్స నిర్వహిస్తారు. మూల కణాల మార్పిడి ద్వారా తలసేమియా మేజర్‌ ‌వ్యాధిని నయం చేయవచ్చు. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు వారి కణజాలాలకు సమానమైన కణజాలం కలిగిన వారి(హెచ్‌ఎల్‌ఏ ‌రకం) సోదర, సోదరీల నుండి సేకరించిన ఎముక మజ్జలో వుండే ఎర్రరక్తకణాల మూలకాల(ఎముక మజ్జ మార్పిడి) మార్పిడి ద్వారా చికిత్స చేయవచ్చు.

తలసేమియా వ్యాధిపై చాలా మందిలో ఇప్పటికి అవగాహన లేదు. వివాహానికి ముందు వధూవరులు కంప్లీట్‌ ‌బ్లడ్‌కౌంట్‌(‌సీబీసీ), హెచ్‌బిఏ2 లెవెల్‌ ‌పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. ఇద్దర్లో కనీసం ఒక్కరైనా తలసీమియా వాహకులు కాదని తేలితే, నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. ఇద్దరూ వాహకులైతే బిడ్డకు తలసేమియా వచ్చే అవకాశాలు యాభైశాతం. శిశువు కడుపులో ఉన్నప్పుడు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షకు వీలుంది. కనీసం అప్పుడైనా, పుట్టబోయే బిడ్డ భవిష్యత్‌పై ఓ నిర్ణయం తీసుకోవచ్చు. తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవిత కాలం పెంచాలంటే రక్తమార్పిడి, విలువైన మందులు అవసరం. గర్భదారణకు ముందు, శిశువు జననం తరువాత పరీక్షలు చేయించు కోవడం అవగాహన కల్పించడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు. తలసేమియా పిల్లలకు రక్తమే పెద్ద సమస్య. ప్రతి పసివాడికీ ఏడాదికి పాతిక ఇరవైమంది రక్తదాతల సహకారం అవసరం. రక్తదానం వల్ల ఎలాంటి సమస్యలూ ఉండవు. పరిపూర్ణ ఆరోగ్యవంతులు నిరభ్యంతరంగా దానం చేయవచ్చు. ఇప్పుడున్న వ్యాధిగ్రస్తులను కాపాడాలంటే రక్త దానం తప్పని సరిగా, బాధ్యతగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్త దానం చేయాలి. రక్త నిధి కేంద్రాలలో అవినీతి జరగకుండా చూసుకోవాలి.(ఇది అవగాహన కొరకు మాత్రమే ఉద్దేశించినది).

Leave a Reply