Take a fresh look at your lifestyle.

నవ్వుదాం, నవ్వులను పంచుదాం..!

 నేటి ఆధునిక యాంత్రిక వేగవంతమైన జీవన విధానంలో సంతృప్తిగా నవ్వగలిగే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. మనస్పూర్తిగా నవ్వటంతో పలు శారీరక మానసిక అస్వస్థతలకు ఉపశమనం సిద్ధిస్తుందని నమ్మిన పలు జనసమూహాలు నవ్వుల క్లబ్లను నెలకొల్పి ‘లాఫింగ్‌ ‌యోగా’ సాధన, ‘లాఫ్టర్‌ ‌థెరపీ’ చేస్తున్నారు. మనస్పూర్తిగా నవ్వగలగడం ఓ మంచి అమూల్య వరం. మానవాళి సమగ్ర శ్రేయస్సుకు, క్షేమానికి నవ్వులు ఉచిత దివ్య ఔషధాలుగా పని చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా నవ్వుల ప్రాధాన్యతను గుర్తించిన సమాజం ప్రతిఏటా మే మాసపు తొలి ఆదివారం, అనగా 01 మే 2021న ‘ప్రపంచ నవ్వుల దినం’ నిర్వహిస్తున్నారు.
నవ్వుల యోగా ఉద్యమం :
10 జనవరి 1998 రోజున ముంబాయ్‌ ‌పట్టణంలో డా: మదన్‌ ‌కటారియా చొరవతో ‘నవ్వుల యోగా ఉద్యమం’ ప్రారంభించారు. దైనందిన జీవితంలో నవ్వుడానికి కారణాలను వెదకాలే కాని బాధలను వెతికి వెతికి మోయడం సరి కాదు. ప్రతికూల సమస్యల సాధన సమయంలో నవ్వులను ఆశ్రయించడం ఉత్తమంగా పాటించాలి. మానసిక ఒత్తిడిని మాయం చేయగల మహత్తర శక్తి నవ్వులకు ఉంటుంది. పట్టణాల్లోని పార్కుల్లో ప్రతి రోజు ఉదయం వ్యాయామ సమయంలో ‘లాఫింగ్‌ ‌క్లబ్‌’‌ల ద్వారా జోక్స్ ‌చేప్పుకుంటూ మనసారా నవ్వుకోవడం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు ఖండాల్లో 6000లకు పైగా లాఫింగ్‌ ‌క్లబ్బులు విస్తరించబడి ఉన్నాయి. నవ్వడం వల్ల అనేక అనారోగ్యాలు మాయమవుతాయనే ప్రచారంతో ‘లాఫ్టర్‌ ‌థెరపీ’ కూడా బహుళ ప్రచారం పొందింది. ‘వరల్డ్ ‌లాఫ్టర్‌ ‌డే’ సందర్భంగా నవ్వుల ప్రాధాన్యతలను తెలిపే ప్రసంగాలు, జోక్స్ ‌చెప్పి నవ్వించడం, శాంతి ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, పలు ఆసక్తికర హాస్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నవ్వు ఓ దివ్య ఔషధం :
నవ్వు ఓ అద్భుత ఉచిత దివ్య ఔషధం. నవ్వుల సుగుణాలతో మానవ సంబంధాలు, ప్రపంచ శాంతి, సోదరభావం, స్నేహబంధాలు లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. దినచర్యలో సదా నవ్వగలిగిన వారు చాలా అదృష్టవంతులుగా, ఆరోగ్యవంతులుగా అందరినీ దృష్టిని ఆకర్షిస్తారు. నవ్వడం, నవ్వులను పంచడమే జీవిత పరమార్థంగా బ్రతకడం అలవర్చుకోవాలి. నవ్వడంతో  శారీరక వ్యాయామం జరిగి జీవ వ్యవస్థ సర్దుకుంటుంది. ఆశావహ దృక్ఫథం కలిగిన వ్యక్తులు ఎల్లవేళల నవ్వు ముఖంతో అందంగా ఉంటారు. నవ్వుల వల్ల వ్యాధి నిరోధకశక్తిని పెంచే టి-కణాలు ఉత్తేజితం అవుతాయి. నవ్వడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె, ఊపిరితిత్తులకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. నవ్వడం వల్ల కండరాలకు వ్యాయామం కలుగుతుంది. శరీరంలోని స్ట్రెస్‌ ‌హార్మోన్స్ ‌మోతాదు తగ్గుతుంది. అధిక రక్తపోటును తగ్గించడానికి నవ్వడమనే ఔషధాన్ని వాడాలి. నవ్వటం వల్ల ఎండార్ఫిన్‌ ఉత్తేజితం కావడంతో నొప్పులకు తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. ప్రతి రోజు 10 – 15 నిమిషాలు నవ్వటంతో దాదాపు 40  కాలరీలు ఖర్చు అవుతుంది. కోపం, ఉద్రేకం, ఆందోళన, ఒళ్లు నొప్పులు తగ్గుతూ జీవితకాలం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, సృజనశీలత, మానవ సంబంధాలు, ప్రాణవాయువు సరఫరాలను పటిష్ట పరిచే సహజ వ్యాయామంగా నవ్వులు ఉపయోగపడతాయి. కాన్సర్‌ ‌థెరపీకి లాఫింగ్‌ ‌సహకరిస్తుంది.
మానసిక ధృడత్వానికి చిరునామా :
మానసిక ధృఢత్వానికి నవ్వులతో స్నేహం చేయడం ఉత్తమం. మనం నవ్వితే మన చుట్టు ఉన్న సమాజం కూడా నవ్వుతుంది. నవ్వటంతో మనలో శారీరక వాంఛనీయ మార్పులు జరగడమే కాకుండా మన తోటి ప్రపంచంలో సానుకూల మార్పులు వస్తాయి. నవ్వుకు సమాధానం నవ్వే అని గుర్తుంచుకోవాలి. ‘కరోనా పాండెమిక్‌’‌కు సరైన సమాధానం ‘హాపీ-డెమిక్‌’ అని నమ్మాం. నవ్వుల పుష్కల పంటలు లేని జీవితం కరువుకాటకాలతో సమానమని అర్థం చేసుకోవాలి. నవ్వుల సంపదలు లేని జీవితం నరక సమానం. నవ్వటం నాలుగు విధాల చేటు కాదని, పలు విధాల మేలని గుర్తుంచుకుంటూ, సదా నవ్వుతూ, నవ్వులను పంచుదాం. నవ్వటం ఓ యోగం, నవ్వకపోవడం ఓ రోగం అని మరువరాదు.

image.png

డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply