”ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో ఐదు కోట్లమందికిపైగా మానసికంగా కుంగిపోతున్నారు. ప్రపంచ జనాభాలో 12 శాతానికి మానసిక రుగ్మతలున్నాయి. యువతకు శారీరక దృఢత్వంపై శ్రద్ధ, మానసిక దృఢత్వంపై లేక పోవడం విచారకరం. యుక్తవయసు ప్రారంభంలో భౌతిక, మానసిక మార్పులు చోటుచేసుకుంటాయి.”
ఆలోచనలు, ఆచరణలూ అన్నీ మెదడుపైనే ఆధారపడి వుంటాయి. మెదడే లేకుంటే మొదటికే మోసం. బతుకే దారం లేని గాలిపటం అవుతుంది. మనషి ఆనందంగా జీవించేందుకు శారీరక అవయవాలతోబాటు మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం లక్ష్యం ఆ విషయం వివరించడమే. సంతోషంగా జీవించడానికి, ఆనందంగా గడపడానికి మానసిక దృఢత్వం ఏర్పరచు కునేందుకు ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలి పించడానికి 1992 అక్టోబరు 10న వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ స్థాపించారు. అందుకే ప్రపంచ మానసిక ఆరోగ్య దినో త్సవం అక్టోబరు 10న జరుపుకుంటాం.
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసిక సమస్యలుండి, శరీరం ఆరోగ్యంగా ఉన్నా ఆ వ్యక్తిని ఆరోగ్యవంతు డనరు. శారీరక అనారోగ్యాలను బయటకు చెప్పుకున్నట్టు మానసిక సమస్యలను సామాన్యంగా బయట పెట్టరు. శారీరక సమస్యలు మాదిరే మానసిక సమస్యలు ఉత్పన్నమైతే నిపుణులను సంప్రదించి వాటి నుండి బయట పడవచ్చనే స్పృహ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ. ఇక పూర్తిగా మానసిక అంగవైకల్యానికి గురయిన వారి సంగతి చెప్పాల్సిన పనిలేదు. వారిని ఆ స్థితి నుండి బయటకు తెచ్చే ప్రయత్నాలు జరగటం లేదు. మానసిక వైకల్యం ఉన్నవారికి సమాజం, కుటుంబం, ప్రభుత్వం పరంగా అందాల్సిన అండ లభించడం లేదనిన్నది నిజం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో ఐదు కోట్లమందికిపైగా మానసికంగా కుంగిపోతున్నారు. ప్రపంచ జనాభాలో 12 శాతానికి మానసిక రుగ్మతలున్నాయి. యువతకు శారీరక దృఢత్వంపై శ్రద్ధ, మానసిక దృఢత్వంపై లేక పోవడం విచారకరం. యుక్తవయసు ప్రారంభంలో భౌతిక, మానసిక మార్పులు చోటుచేసుకుంటాయి. విద్యాభ్యాసంలో ఇంటినుండి దూరంగా కాలేజీ హాస్టళ్లు, యూనివర్శిటీ నివాసంలో అడుగు పెడతారు. కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులు, కొత్త వాతావరణం అనుగుణంగా మానసిక ఒత్తిడి, భయం సాధారణంగా ఏర్పడుతాయి. టెక్నాలజీ వినియోగం, రోజువారీ కార్యక్రమాల రాత్రి నిద్రా సమయాలలో మార్పు వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారుతూ, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటేనే పోటీ ప్రపంచంలో ఉనికిని నిలుపుకోగలం, లేదంటే కొన్ని సందర్భాలలో ఇతరులతో పోల్చుకుని అల్పుల మనే భావనకు గురై ఒత్తిడికి గురవుతాృ. కొన్ని సాధించాలంటే కొంత ఒత్తిడి అవసరమే. ఈ సమయంలోగా ఈ పని పూర్తవ్వాలి అనే లక్ష ఉంటేనే సాధనకు శాయశక్తులా కృషి చేస్తారు. మానసిక ఒత్తిడి తగ్గాలంటే ముందుగా చేసే పనిపై ఇష్టం పెంచుకోవాలి. ఇష్టమైన పని ఎంచు కోవాలి. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, రచయితలు రోజులో ఎన్ని గంటలు శ్రమించినా ఉత్సాహంగా కనబడతారు. వారికి శ్రమించడంలో ఆనందం ఉంటుంది. అలాగే వృత్తిలో మెలకువలు తెలుసుకోగలిగితే తక్కువ సమయంలో విజయం సాధించి ఎక్కువ ఆనందం పొందుతాము.
వైద్య పరిభాషలో డిప్రెషన్, యాంగ్జయిటీ, యాంగ్జయిటీ న్యూరోసిస్, బైపోలార్ డిజార్డర్, సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఫోబియా, మానియా, స్కిజోఫ్రీనియా, డిల్యూషనల్ డిజార్డర్, స్లీప్ డిజార్డర్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇల్యూషన్, అడిక్షన్ లాంటి మానసిక వైకల్యాలు అనేకం ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే మానసిక ఉద్రేకాలను నిగ్రహించుకోలేక పోవడమే రుగ్మతను తెచ్చిపెడ్తుంది. కష్ట సమయాలు, క్లిష్ట పరిస్థితుల్లో కుంగిపోకుండా ఉంటే మెదడు సక్రమంగా పని చేస్తుంది. మెడిటేషన్ వల్ల ఎంతటి స్ట్రెయినైనా, ఎలాంటి స్ట్రెస్సయినా మటుమాయ మౌతుందని వైద్యులు కూడా చెబుతున్నారు.
ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ ఇంప్రూవ్మెంట్ టీమ్లు ప్రపంచ మానసిక ఆరోగ్య దినానికి తమవంతు సహకారం అందిస్తున్నాయి. ఆందోళన, ఒత్తిడి మనిషిని కృంగతీస్తాయి కనుక ముందుగా వాటిని నియంత్రించాలని చెబుతున్నారు. నిద్రలేమి కూడా ఒక రకమైన మానసిక వ్యాధే. . ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. లేకుంటే శారీరక బడలిక తీరదు, మానసిక ప్రశాంతత లభించదు. కలతపరిచే ఆలోచనలు, చేటుచేసే చేష్టలు మానుకుంటే మానసిక రుగ్మతలేవీ దరిచేరవు అంటున్నారు సైకియాట్రిస్ట్ పెర్కిన్. ఇన్ని మాట లెందుకు.. క్లిష్టసమస్య లెదురైనా తలమునక లవకుండా ధైర్యంగా పరిష్కరించుకో గల్గితే, అందనివాటికి అర్రులు చాచకుండా మనసు పదిలంగా ఉంచుకుంటే మానసిక వైకల్యానికి తావే లేదు.

ప్రొఫెసర్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, 9492791387