Take a fresh look at your lifestyle.

‘‌నీటి ఒత్తిడి’ అంచున ప్రపంచ మానవాళి..!

ప్రపంచవ్యాప్తంగా కేప్‌ ‌టౌన్‌ ‌నుంచి చెన్నై వరకు నగర ప్రజలు, గ్రామీణ భారతం, నగర మురికవాడలు తీవ్ర నీటి ఒత్తిడి(వాటర్‌ ‌స్ట్రెస్‌)‌కి లోనవుతుండడం భవిష్యత్తు హెచ్చరికగా తీసుకోవాలని జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి ఎద్దడితో ప్రజారోగ్యం, జీవనశైలి, వర్తక వ్యాపారాలు ప్రభావితం అవుతాయని గమనించాలి. ప్రపంచ వనరుల సంస్థ (వరల్డ్ ‌రిసోర్సేస్‌ ఇనిస్టిట్యూట్‌) ‌విడుదల చేసే ‘అక్వెడక్ట్ ‌వాటర్‌ ‌రిస్క్ అట్లాస్‌’ ‌వివరాల ప్రకారం ప్రపంచంలోని నాలుగవ వంతు జనాభా కలిగిన 17 దేశాలు (ఇండియా, పాకిస్థాన్‌, ‌సౌదీ, తుర్కమెనిస్థాన్‌, ‌ఖతార్‌, ఇ‌జ్రాయిల్‌, ‌లెబనాన్‌, ఇరాన్‌, ‌జోర్డాన్‌, ‌లిబియా, కువైట్‌, ఇరిత్రియా, యూఏఈ, సాన్‌ ‌మరీనో, బెహరేన్‌, ఓమన్‌ ‌మరియు బోత్సవానా) తీవ్ర నీటి ఒత్తిడికి గురి అవుతున్నాయని, అందులో ఇండియా 13వ ర్యాంకులో ఉందని తెలుస్తున్నది. ఈ 17 దేశాల్లోంచి 12 దేశాలు మిడిల్‌ ఈస్ట్, ‌నార్థ్ ఆ‌ఫ్రికా ప్రాంతాల్లోనే ఉండడం గమనించారు. నీటి కొరత కలిగిన 17 ముఖ్య దేశాలతో పాటు మరో 44 దేశాలు కూడా నేడు నీటి ఎద్దడిని అనుభవిస్తున్నాయి. ప్రపంచ వనరుల సంస్థ 189 దేశాల్లో సర్వే నిర్వహించడం జరిగింది. తీవ్ర నీటి కొరత కలిగిన 17 దేశాల్లో 80 శాతం ఉపరితల, భూగర్భ జలాలు వ్యవసాయం, పరిశ్రమలు, మునిసిపాలిటీల త్రాగు నీటి వినియోగానికి మాత్రమే సరిపోతున్నది. నీటి ఎద్దడితో వాతావరణ ప్రతికూల మార్పులు ఏర్పడి కరువు పరిస్థితులు విషమంగా మారడం జరుగుతుంది. ప్రపంచ నీటి ఒత్తిడి సమస్యకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో భవిష్యత్తులో గొంతులు తడవడం కష్టంగా మారి, ఆహార అభద్రత, వలసలు, జీవవైవిధ్యం దెబ్బతినడం, పలు సంక్షోభాలకు దారి తీయడానికి మరెంతో సమయం పట్టదు. నీటి ఒత్తిడికి ఆధునిక పరిష్కారాలు అన్వేషించని ఎడల ప్రపంచ జనుల సుఖజీవనం కష్టతరం, ఖరీదైనదిగా మారనుంది. ఇప్పటికే లీటర్‌ ‌నీటికి కనీసం 20/- రూ?లు వెచ్చించాల్సిన దుస్థితి వస్తున్నది.

ఉత్తర భారతంలో, ముఖ్యంగా ఛండీఘర్‌, ‌హర్యానా, రాజస్థాన్‌, ‌పంజాబ్‌, ‌ఢిల్లీ, యూపీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడం, 2019లో చెన్నై నగరం రైళ్ల ద్వారా నీటిని అందించే ప్రయత్నాలు చేయడం మనం ఇంకా మరువలేదు. 1990 – 2014 మధ్య ప్రతి ఏటా భూగర్భ జలాలు 8 సెంటీమీటర్లు లోతుల్లోకి వెళ్ళడం గమనించారు. నీటి ఒత్తిడి పెరిగితే సురక్షిత నీటికి కొరత, అనారోగ్యాలు, వాతావరణంలో ప్రతికూల మార్పులు, ప్రభుత్వ పాలనకు సవాళ్ళు, ఆర్థిక-సామాజిక మందగమనం, వలసదారుల సమస్య, పారిశ్రామిక తిరోగమనం, సాగు నీటి ఎద్దడి లాంటి అవలక్షణాలు కలుగుతాయి. గ్రామీణ భారతంలో భూగర్భ జలాలు తీవ్ర దోపిడికి గురి అవుతుండటంతో పర్యావరణవేత్తలు, భాద్యతగల పౌరులు భయాందోళనలకు లోనవుతున్నారు. విచక్షణారహిత నీటి వినియోగం, కరువులు, వాతావరణ మార్పులతో నీటి డిమాండ్‌, ‌సప్లైల మధ్య అగాధం పెరుగుతోంది. 71 శాతం వ్యర్థపు నీటిని తిరిగి శుద్ధి చేసి సాగు, భూగర్భజలాలు పెరగడానికి ఉపయోగించడంలో అరబ్‌ ‌ప్రాంతాలు ముందున్నాయి. నీటి ఒత్తిడి కలిగిన దేశాల జాబితాలో 16వ స్థానంలో ఉన్న ఓమన్‌ ‌దేశంలో 100 శాతం వ్యర్థ నీటిని శుద్ధి చేయడం, 78 శాతం తిరిగి వాడడం జరుగుతున్నది. కరువులు, వరదలు, నీటి ఒత్తిడి సమస్యలతో భూగర్భ జలాల లభ్యత ఆధారపడి ఉంటాయి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-6 ప్రకారం 2030 నాటికి సురక్షిత నీరు అందరికీ అందేలా   ప్రణాళికలు కూడా వేయడం మనకు తెలుసు.

ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, నాసిక్‌, ‌హైదరాబాద్‌?, ‌జైపూర్‌, అహ్మదాబాద్‌?, ఇం‌డోర్‌ ‌లాంటి అనేక భారత మహానగరాలు నేడు తీవ్ర నీటి కొరతతో సతమతం అవుతున్నాయని మనకు విధితమే. సూరత్‌, ‌గ్వాలియర్‌, ‌జబల్‌పూర్‌ ‌లాంటి నగరాల్లో ‘రెయిన్‌ ‌వాటర్‌ ‌హార్వెస్టింగ్‌’ ‌వ్యవస్థ కలిగి ఉండే గృహాలకు ఇంటి పన్నులో అధిక రాయితీ ఇవ్వబడం జరుగుతున్నది. నీటి ఒత్తిడి సమస్య గంభీరతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘జల శక్తి మంత్రిత్వశాఖ’ను కూడా ఏర్పాటు చేయడం ముదావహం. దేశంలోని 17.87 కోట్ల గ్రామీణ గృహాల్లో 3.27 గృహాలకు (18 శాతం) మాత్రమే సురక్షిత నల్లా నీరు లభిస్తున్నది. ఢిల్లీలో ప్రతి ఇంటికి నెలకు 20,000 లీటర్ల నీటిని ఉచితంగా, అదనంగా వాడుకున్న నీటికి మాసానికి రూ: 28/- వసూలు చేయడం జరుగుతున్నది. బాత్‌ ‌టబ్‌ ‌స్నానానికి ప్రతి సారి 370 లీటర్లు, షవర్‌ ‌బాత్‌ ‌స్నానానికి 70 లీటర్ల నీరు అవసరం అవుతుంది. వర్షపు నీరు, ఉపరితల జలం, భూగర్భ జలాలను ప్రణాళికాబద్దంగా పరిరక్షించుకుంటూ నీటి ఒత్తిడిని జయించే కృషి చేయాలి. నీటి పరిరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, జీవనశైలిని మార్చు కోవడం, వ్యర్థాల్ని తగ్గిస్తూ నీటిని మితంగా వాడటం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం, రీసైకిల్‌ ‌చేయడం, ఆధునిక సాగు పద్దతులను వాడడం, వాటర్‌షెడ్‌ల నిర్మాణాలు చేపట్టడం, నవ్య విధానాలను అన్వేషించడం, బకెట్‌ ‌మగ్గుతోనే స్నానం చేయడం, కాలుష్యాలను తగ్గించడం, జనాభా నియంత్రణ లాంటి చర్యలతో నీటి ఒత్తిడిని జయించే ప్రయత్నాలు చేయాలి. ప్రపంచ దేశాల్లో నీటి ఒత్తిడితో మానవ మనుగడ ప్రమాదంలోకి నెట్టబడినపుడు ‘నీటి కోసం యుద్ధాలు’ జరిగే అవకాశాలు రావచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సకల జీవరాసుల ఉనికికి ప్రాణ వాయువుతో పాటు నీరు కనీస ప్రాణాధార అవసరాలు అయినాయి. ఇలాంటి నీటి మూల్యాన్ని గమనిస్తూ, ప్రతి ఒక్కరు నీటి పరిరక్షణ యజ్ఞంతో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి కంకణబద్దులం కావాలని కోరుకుందాం.

Leave a Reply