Take a fresh look at your lifestyle.

దుబ్బాకలో మహిళా వోటర్లే కీలకం!

మొత్తం వోటర్లు : 1,98,756
పురుష వోటర్ల సంఖ్య : 97,978
మహిళా వోటర్లు : 1,00, 778
పురుషుల కంటే 2,800 మంది మహిళా వోటర్లు ఎక్కువ
మహిళల ప్రసన్నం కోసం నేతల తంటాలు
20వేలకు పై చిలుకు మహిళా బీడీ కార్మికుల వోట్ల కోసం అన్ని పార్టీల నేతల ప్రయత్నాలు
స్వయం సహాయక బృందాలపైనా ఫోకస్‌
‌కీలకం కానున్న బీడీ కార్మికుల వోట్లు, స్వయం సహాయక బృందాలు
అందుకే బీడీ కార్మికుల పింఛన్‌ ‌డబ్బుల చూట్టూ రాజకీయాలు

దుబ్బాక అసెంబ్లీకి ఉప ఎన్నిక  పోలింగ్‌కు గడువు దగ్గరపడుతున్నకొద్దీ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. వొచ్చే నెల 3న దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్‌ ‌జరగనున్నది. దీంతో అన్ని పార్టీల నాయకులు జోరుగా ప్రచారంలో స్పీడ్‌ ‌పెంచారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. పండుగ పూట కూడా క్షణం తీరిక లేకుండా అన్ని గ్రామాలు కలియ తిరుగుతూ వోటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. ఈ నియోజకవర్గంలో పురుషులకంటే మహిళల వోట్లు అధికంగా ఉండటంతో అన్ని పార్టీల నేతలు మహిళా వోటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం వోటర్ల సంఖ్య ఒక లక్షా 98వేల 756మంది. వీరిలో పురుష వోటర్ల సంఖ్య 97వేల 978 కాగా, మహిళా వోటర్ల సంఖ్య  ఒక లక్షా 778. అంటే, పురుష వోటర్ల కంటే మహిళా వోటర్లు 2వేల 800మంది ఎక్కువగా ఉన్నారు. పురుష వోటర్ల కంటే మహిళా వోటర్లు ఎక్కువగా ఉండటమే కాకుండా, ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 20వేలకు పైగా బీడీ కార్మిక వోటర్లు ఉన్నారు.

ఈ ఉప ఎన్నికల్లో బీడీ కార్మికులు ఎటు వైపు మొగ్గు చూపిస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలుపు తథ్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎన్నికల్లో మహిళా వోటర్లు కీలకం కావడంతో అందులోనూ మహిళా బీడీ కార్మికులు 20వేలకు పైగా ఉండటంతో వీరిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. మహిళా బీడీ కార్మికులను తమవైపు ఆకట్టుకోవడానికి నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు. బీడీ కార్మికుల వోట్లను గంపగుత్తగా వేయించుకోవడానికి ఆయా పార్టీల నేతలు తమ ఎన్నికల ప్రచారంలో బీడీ కార్మికుల పింఛన్‌ ‌డబ్బుల ప్రస్తావనను తీసుకువచ్చారు. గత పదిహేను రోజుల నుంచి దుబ్బాక రాజకీయం ఎన్నికల ప్రచారమంత కూడా బీడీ కార్మికులు, బీడీ కార్మికులకు ఇచ్చే పింఛన్‌ ‌డబ్బుల చుట్టే నడుస్తుంది. ఈ ఉప ఎన్నిక బరిలో 23మంది అభ్యర్థుల ఉన్నారు. వీరిలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున సోలిపేట సుజాత-రామలింగారెడ్డి, ఆల్‌ ఇం‌డియా ఫార్వర్డ్ ‌బ్లాక్‌ అభ్యర్థిగా యాంకర్‌ ‌కత్తి కార్తీక పోటీ పడుతున్నారు. మహిళా వోటర్లు అధికంగా ఉండటంతో ఈ ఉప ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన నేతలు అభ్యర్థులకు మద్దతుగా మహిళా నేతలతో ప్రచారాన్ని చేయిస్తున్నారు.  మహిళా వోటరు స్థావరాన్ని, బీడీ కార్మికులను పట్టుకోవటానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రచారానికి నాయకత్వం వహించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఈ నెల 21న నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సుజాతకు సంఘీభావంగా 10వేలకు పైగా మహిళలతో ర్యాలీని, సభను నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపును మహిళా గెలుపుగా అభివర్ణించడమే కాకుండా, భారీగా హాజరైన మహిళల ఉత్సాహం చూస్తుంటే ఈ ఎన్నికలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సుజాతక్కకు మహిళలందరి వోటింగ్‌ ‌వన్‌సైడ్‌గా ఉండ•మే కాకుండా దుబ్బాక నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యే సుజాతక్క భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమైందన్నారు. అంతేకాకుండా బీడీ కార్మికుల పింఛన్‌ ‌డబ్బు విషయాన్ని పదే పదే గుర్తు చేశారు.

మహిళల ప్రసన్నం కోసం నేతల ప్రయత్నాలు...
దుబ్బాక నియోజకవర్గంలో మహిళా వోట్లు అధికంగా ఉన్నాయి. ఉప ఎన్నికలో వారి వోట్లే కీలకం. నియోజకవర్గంలో మొత్తంలో పురుషుల కంటే మహిళల వోట్లు అధికంగా ఉండటంతో పాటు దీనికి తోడుగా మహిళా బీడీ కార్మికుల 20వేలకు పైగా మంది ఉండటంతో మహిళల వోట్ల కోసం అన్ని రాజకీయ పార్టీల సర్వశక్తులొడ్డుతున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు ప్రచార వ్యూహా, ప్రతి వ్యూహాలపై దృష్టిసారించాయి. బీడీ కార్మికులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా స్వయం సహాయక గ్రూపు సభ్యులపై కూడా ఆయా పార్టీల నేతలు ఫోకస్‌ ‌పెట్టాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందానికి చెందిన మహిళల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో గ్రామంలో ఒక్కో గ్రూపుల పదుల సంఖ్యలో కలిపి గ్రామమంతా కలిపి రెండు మూడు వందల మంది వరకు మహిళా సభ్యులుంటారు. గ్రామాలలో గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్న  గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృంద మహిళలతో మాట్లాడటానికి అన్ని పార్టీలు మహిళా నాయకులను నియమించాయి. నాయకులు తమ అభ్యర్థులకు మద్దతు కోరుతూ స్వయం సహాయక సంఘం మహిళా నాయకులతో క్రమం తప్పకుండా సమావేశమవుతున్నారనీ అత్యంత విశ్వసనీయ వర్గాలు శనివారం ఇక్కడ ‘ప్రజాతంత్ర’ ప్రతినిధికి వివరించాయి. శనివారం తెలంగాణలో ఆడపడుచులకు ఇష్టమైన సద్దుల బతుకమ్మ పండుగ. సద్దుల బతుకమ్మ పండుగ అయినప్పటికీ కూడా ఆయా రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు మాత్రం ప్రచారాన్ని బంద్‌ ‌చేయలేదు. పండుగ పూట కూడా సభలు, సమావేశాలు నిర్వహించి వోటర్లను తమవైపు ఆకట్టుకునే పని చేశారు. ఈ ఉప ఎన్నికల్లో మహిళా వోటర్లు ఎంత కీలకమని చెప్పడానికి శనివారం నాటి నేతల ప్రచారం చక్కటి ఉదాహరణంగా చెప్పొచ్చు.

మహిళా నేతలతో అన్ని పార్టీలు ప్రచారం...
దుబ్బాకలో మహిళా వోటర్ల తీర్పు కీలకం కానుండటంతో అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు మహిళా వోటర్లపై ప్రత్యేక దృష్టిని పెట్టాయి. ఎలాగైనా మహిళా వోటర్లు తమకు గంపగుత్తగా వేయించుకోవడానికి చేయని ప్రయత్నాలంటూ లేవు. మహిళా వోటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు ఆయా పార్టీలకు చెందిన మహిళా నేతలతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అభ్యర్థులకు మద్దతుగా మహిళా నేతలను ప్రచారంలోకి దించాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సుజాతకు మద్దతుగా మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీమంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, సిద్ధిపేట జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజాశర్మతో పాటు స్థానికంగా ఉండే మహిళా మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌, ‌మండల పరిషత్‌ అధ్యక్షురాలు, మార్కెట్‌ ‌కమిటీ ఛైర్‌పర్సన్‌, ‌సర్పంచులు, ఎంపిటిసిలు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి జెట్టి గీతారెడ్డి, ఎమ్మెల్యే ధనసిరి అనసూయ అలియాస్‌ ‌సీతక్క, కొండా సురేఖ, ఇందిరా, నిర్మల జయప్రకాష్‌రెడ్డి తదితరులు ప్రచారాన్ని చేస్తుండగా…బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు తరపున మాజీమంత్రి, బిజెపి అల్‌ ఇం‌డియా వైస్‌ ‌ప్రెసిడెంటు డికె.అరుణతో పలువురు మహిళా నేతలు ప్రచారంలో పాల్గొంటున్నాయి. మహిళా వోటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీల మహిళా నేతలు వారి వారి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

అన్ని మండలాల్లో వారే ఎక్కువ..
దుబ్బాక శాసనసభ పరిధిలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్‌, ‌రాయపోల్‌, ‌నార్సింగి, చేగుంట, గజ్వేల్‌ ‌మండలాలన్నింటిలో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఉన్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే.. దుబ్బాకలో 55,208 వోటర్లకుగానూ 27,725 పురుష వోటర్లుండగా, 27,983 మంది మహిళా వోటర్లు ఉన్నారు. మిరుదొడ్డిలో 31,762 వోటర్లకుగానూ 15,586 పురుషులు, 16,176 మంది మహిళా వోటర్లు ఉన్నారు.  తొగుటలో 26,751 వోటర్లకుగానూ 13,268 పురుషులు, 13,483 మంది మహిళా వోటర్లు ఉండగా, దౌల్తాబాద్‌లో 23,032 మంది వోటర్లకుగానూ 11,466 పురుష వోటర్లు, 11,566 మహిళా వోటర్లున్నారు. రాయపోల్‌ ‌మండలంలో 20,513 మంది వోటర్లకుగానూ 10,229 పురుషులు, 10,284 మంది మహిళా వోటర్లు ఉంటే, చేగుంట మండలంలో 32,829 మంది వోటర్లుండగా 15,956 పురుషులు, 16,873 మంది మహిళా వోటర్లు ఉన్నారు. నార్సింగిలో 8,215 వోటర్లకుగానూ 4,031 పురుషులు, 4,184 మహిళా వోటర్లు ఉండగా..గజ్వేల్‌ ‌మండలం చిన్న ఆరెపల్లి గ్రామంలో 446 వోటర్లకుగానూ 217 పురుషులు, 229 మహిళా వోటర్లు ఉన్నారు.

తొలిసారిగా ఇద్దరు మహిళా అభ్యర్థులు..
దుబ్బాక నియోజకవర్గం 1957లో ఏర్పడిన నాటి నుండి మహిళా అభ్యర్థులెవరూ బరిలో నిల్చోలేదు. కానీ, సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఏర్పడిన ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 23 మంది బరిలో నిలిస్తే అందులో 21 మంది పురుష అభ్యర్థులు కాగా, ఇద్దరు మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నుండి సోలిపేట సుజాత కాగా, ఆలిండియా ఫార్వర్డ్ ‌బ్లాక్‌ ‌పార్టీ నుండి కత్తి కార్తీక పోటీ చేస్తున్నారు. దొమ్మాట నియోజకవర్గంగా ఉన్న దుబ్బాక, శాసనసభ స్థానాల పునర్విభజనలో భాగంగా 2009లోదుబ్బాక నియోజక వర్గం ఏర్పడింది. 1957లో తొలి ఎన్నిక జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఐదు సార్లు కాంగ్రెస్‌, ‌నాలుగు సార్లు టిఆర్‌ఎస్‌, ‌నాలుగు సార్లు టిడిపి,  ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. వీరందరూ పురుషులు కాగా మహిళలు ఎవరూ బరిలో నిలవలేదు. ఈ సారి మాత్రం ఇద్దరు మహిళలు ఎన్నికల బరిలో నిలబడి పురుష అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందితే కూడా తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు ఉంటుంది.

మహిళా ర్యాలీ సక్సెస్‌తో టిఆర్‌ఎస్‌లో ధీమా..

దుబ్బాక ఉప పోరులో అతివల వోట్లే కీలకం కానున్నాయి. మహిళా బీడీ కార్మికులతో పాటు డ్వాక్రా సంఘాల్లోని మహిళల వోట్లకూ బాగానే డిమాండ్‌ ‌పెరిగింది. దుబ్బాక సిట్టింగ్‌ ‌స్థానాన్ని భారీ ఆధిక్యంతో సాధించుకోవాలని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ చూస్తుండగా, ఎలాగైనా నియోజకవర్గంలో పాగా వేయాలని కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీల ఆశలకు ప్రాణం పోసేది మహిళలే కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల మహిళా ప్రజాప్రతినిధులు, నాయకురాళ్లు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే, దుబ్బాక నియోజకవర్గంలో అధికంగా బీడీ కార్మికులు ఉన్నారు. వీరిలో 20 వేల మందికి ప్రభుత్వం జీవనభృతిగా రూ. 2116  పింఛన్‌ ఇస్తున్నది. వీరితోపాటు వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. ఆయా వర్గాలకు లబ్ధి జరుగుతున్నందుకు వీరంతా అధికార టిఆర్‌ఎస్‌ ‌వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ‌నుంచి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో నిలిచారు. ప్రజలతో సన్నిహితంగా ఉంటారనే పేరు ఉంది. ‘పుట్టెడు దుఃఖంతో మీముందుకు వొచ్చాను’.. నన్ను ఆశీర్వదించండి అని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆమెకు కలిసి వొచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మహిళా అభ్యర్థి కావడం కూడా అనుకూలం. దీనికి తోడు మహిళాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో మహిళల వోట్లు తమకు కలిసి వొస్తాయనీ, అంతేకాకుండా, ఈ నెల 21న పార్టీ అభ్యర్థి సుజాతకు సంఘీభావంగా దుబ్బాకలో నిర్వహించిన మహిళల ర్యాలీ, సభ సక్సెస్‌ ‌కావడంతో మహిళా వోట్లు కలిసి వస్తాయని టిఆర్‌ఎస్‌లో పూర్తి  ధీమా అగుపిస్తున్నది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply