Take a fresh look at your lifestyle.

రక్షణరంగంలోకి మహిళలు

ఎన్‌డిఎ ద్వారా ఎంపికకు రక్షణశాఖ ఆమోదం
త్రివిధ దళాలు అంగీకరించినట్లు సుప్రీమ్‌ ‌కోర్టుకు వివరణ
దేశంలోని మహిళా రక్షణ సిబ్బందికి ఇదొక చారిత్రక సందర్భం. మహిళలకు నేషనల్‌ ‌డిఫెన్స్ అకాడమి(ఎన్డీయే)లోకి ఎంట్రీ ఇవ్వడంతోపాటు పర్మనెంట్‌ ‌కమిషన్‌ ఇవ్వడానికి త్రివిధ దళాల అధిపతులు అంగీకరించినట్లు బుధవారం సుప్రీమ్‌ ‌కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎన్డీయే, నేవల్‌ అకాడమి ద్వారా మహిళలకు పర్మనెంట్‌ ‌కమిషన్‌ ఇవ్వడానికి త్రివిధ దళాధిపతులు, ప్రభుత్వం అంగీకరించాయి. మంగళవారం రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని అడిషనల్‌ ‌సొలిసిటర్‌ ‌జనరల్‌ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. ఇటీవల ఎన్డీఏలో మహిళలకు అవకాశం ఇవ్వాలని సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశించింది. ఆ దిశగా విధాన రూపకల్పన పక్రియను రూపొందించనున్నట్లు చెప్పారు. తాము కూడా చాలా రోజులుగా చెబుతున్నది ఇదే అని ఈ సందర్భంగా జస్టిస్‌ ఎస్కే కౌల్‌ అన్నారు. ‘లింగ సమానత్వం కోసం సాయుధ బలగాలు మరింత చేరువ చేయాల్సి ఉంది. త్రివిధ దళాధిపతులు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

వాళ్లను ఒప్పించిన ఘనత మికే దక్కుతుంది’ అని జస్టిస్‌ ‌కౌల్‌ అన్నారు. అసలు గత విచారణ సందర్భంగానే ఈ విషయాన్ని చెప్పి ఉంటే తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదని చెప్పారు. అయితే మహిళలకు పర్మనెంట్‌ ‌కమిషన్‌పై ఓ నిర్దిష్ట కాల వ్యవధి ఇవ్వాలని సుప్రీమ్‌ ‌కోర్టు ఈ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. మహిళలు రక్షణ సర్వీసుల్లో కమిషన్‌ ‌పొందేందుకు నేషనల్‌ ‌డిఫెన్స్ అకాడమి ఎంట్రన్స్ ఎగ్జామ్‌ ‌రాసే వీలు కల్పించాలని గత నెల 18న సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహిళలను తాత్కాలిక కమిషన్‌ ఆఫీసర్లుగానే తీసుకుంటున్నారు. అయితే పురుషులకు ఇచ్చినట్లే వీళ్లకు కూడా పర్మనెంట్‌ ‌కమిషన్‌ ఇవ్వాలని సుప్రీమ్‌ ‌కోర్టు గతంలోనూ ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply