Take a fresh look at your lifestyle.

నేటి మహిళలు సాధికారత గలవారు

మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై నిర్భీతితో వెళ్ళగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని జాతిపిత మహాత్మాగాంధీ అన్న మాటను ఢిల్లీలో ఆదివారంనాడు జాతీయ మహిళా కమిషన్‌ ‌రుజువు చేసింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పవర్‌ ‌వాక్‌ ఎన్నో విధాల విజయవంతం అయింది. మహిళలను ఇళ్ళకే పరిమితం చేయకుండా వారికి బాల్యం నుంచి ధైర్యాన్ని నూరిపోయాలని సరోజినీనాయుడు వంటి మహిళామణులు దశాబ్దాల క్రితమే ఉద్బోధించారు. మహిళలకు భద్రత లేదని అన్నవారే అవాక్కు అయ్యే రీతిలో ఢిల్లీలో ప్రదర్శన సాగింది. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుని వెళ్తున్న మహిళల్లో బెదురు, భయం కలిగించే రీతిలో పెద్దలు మాట్లాడటం ఎంతమాత్రం క్షమార్హం కాదని మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌రేఖాశర్మ సహా పలువురు వక్తలు స్పష్టం చేశారు. ఆడవాళ్ళు ధైర్యంగా ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్ళగలిగేలా పెద్దలు వారిని తయారు చేయాలి. బ్యాంకు ఉద్యోగాల్లోనే కాకుండా సాఫ్ట్ ‌వేర్‌ ‌రంగంలో మహిళలు బాగా రాణిస్తున్నారు. మహిళలకు ఉద్యోగాలిస్తే తమ సంస్థల్లో ఉత్పత్తి పెరుగుతుందని కార్పొరేట్‌ ‌రంగం దిగ్గజాలు స్పష్టం చేస్తున్నాయి. న్యూస్‌ ‌చానల్ స్ , ‌వార్తా పత్రికల్లో పని చేసే మహిళలు రాత్రి పొద్దు పోయేవరకూ పని చేయాల్సి వస్తుంది. అంతమాత్రాన వారిపై ఆంక్షలు విధిస్తే ఎలా.. ఇళ్ళల్లో పనులు ఆడవారే చేయాలనేది పాతకాలపు ఆచారం. ఇప్పుడు అలాంటి ఆచారాలన్నీ మారిపోయాయి. శ్రమ విభజన ద్వారానే సమాజం ముందుకు పోతుందనే వాస్తవాన్ని అందరూ గ్రహిస్తున్నారు. మహిళలను సమర్థించే వారు ఫెమినిస్టులని గతంలో అనే వారు. కానీ, ఇప్పుడు అందరూ మహిళలను సమర్థిస్తున్నారు. ఆధునిక జీవనంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ కష్టపడనిదే సంసారాలు సాగడం లేదు.

అందువల్ల ఒకరి సంపాదన పైనే జీవనం సాగించాలనే పాతకాలపు పద్ధతులకు అందరూ స్వస్తి చెబుతున్నారు. ఇంటి భారాన్ని మోసే మహిళకే ప్రభుత్వాలు రుణాలు, సంక్షేమ పథకాల సబ్సిడీలను అందిస్తున్నాయి. అలాగే, ఇళ్ళ స్థలాల పట్టాలను మహిళల పేరుమీదే ఇస్తున్నాయి. ఇది ఆధునిక కాలంలో వచ్చిన మార్పు. పవర్‌ ‌వాక్‌ అనే మాటలో ఎంతో అర్థం నిబిడీకృతం అయి ఉంది. మహిళలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి పవర్‌ ‌టాక్‌ అనవచ్చు. అలాగే, పార్లమెంటులో రిజర్వేషన్లను సాధించలేకపోయినా, మహిళలు రాష్ట్రాల్లో పదవులను సంపాదించి అవినీతి రహితమైన రీతిలో ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మహిళలు రాత్రి వేళల్లో విధులను నిర్వహించడం సిగ్గు పడే విషయం కాదనీ, అది ఒక అవసరంగా మారిందని మహిళా ఉద్యమ నాయకురాళ్ళు పేర్కొంటున్నారు. గతంలో మహిళలకు పొద్దు పోయేవరకూ విధులు నిర్వహించే వీలు ఉండేది కాదు. ఇప్పుడు గృహిణులు అలాంటి ఉద్యోగాల్లో పని చేస్తున్నప్పుడు వారి భర్తలే వచ్చి ఇళ్ళకు తీసుకుని వెళ్తున్నారు. ఢిల్లీలో జరిగిన పవర్‌వాక్‌లో భిన్న రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌రేఖాశర్మ ముందుండి మహిళల మార్చ్‌ని నడిపించారు. యువతీ యవకులు పవర్‌ ‌వాక్‌ అని రాసి ఉన్న టీ షర్ట్ ‌లు ధరించారు. మహిళల ఆత్మరక్షణకు కరాటే వంటి విద్యలను నేర్పించాల్సిన అవసరాన్ని గురించి ఈ పవర్‌ ‌టాక్‌ ‌లో పాల్గొన్న పలువురు సూచించారు. చదువుతోనే మహిళలకు ఆత్మవిశ్వాసం వస్తుంది .ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలంతా విద్యావంతులే కావడం యాదృచ్ఛికం కాదు. చదువుకున్న మహిళలు ప్రతీ అంశాన్ని సునిశిత దృష్టితో పరిశీలిస్తారు.

హేతువాద దృక్పథంతో ఆలోచిస్తారు. తామెవరికీ తక్కువ కామని వాదిస్తారు. తమ వాదనలను గెలిపించుకునేందుకు చివరి వరకూ పాటు పడతారు. మహిళలకు ఇలాంటి అవకాశం ఇవ్వడం కోసమే అలనాడు కందుకూరి వీరేశలింగం పంతులుగారు ఆంధ్రప్రాంతంలోనూ, వెంకట్రామరెడ్డి వంటి వారు తెలంగాణలోను కృషి చేశారు. హేతువాద ఉద్యమ నాయకుడు గోరాగారు ఆయన సంతానం అంతా మహిళాభ్యున్నతి కోసం ఈరోజూకీ పాటు పడుతున్నారు. గోరాగారి సతీమణి సరస్వతి గోరా జీవితాంతం మహిళల సాధికారత కోసం కృషి చేశారు. ఫలితంగానే గోరాగారి కుటుంబంలో మహిళలు ఒక్కొక్కరూ ఒక వీరనారిగా తయారయ్యారు. ఆధునిక సమాజంలో మహిళలు ఏ వృత్తినైనా అవలీలగా, సమర్థవంతంగా నిర్వహించగలరని వారు రుజువు చేస్తున్నారు. ఇంకా ఇలాంటి కుటుంబాలు తెలుగునాట చాలా ఉన్నాయి. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేయడానికి పవర్‌వాక్‌ ‌వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. మహిళలపై లైంగిక దాడులు జరిగినప్పుడు ఇప్పటికే మహిళాసంఘాలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. హక్కుల సాధన కోసం మహిళా సంఘాలు ఇదే మాదిరిగా కలిసికట్టుగా ఉద్యమించిననాడు ప్రభుత్వాల సాయం కోసం దేబిరించాల్సిన అవసరం ఉండదు. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం జరుగుతున్న వేళ మహిళా చైతన్యానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయి.

Leave A Reply

Your email address will not be published.