- సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు
- సబ్‌కమిటీ పరిశీలనలో ఆన్లైన్ తరగతులన్న ప్రభుత్వం
విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు నిర్వహిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేగాక ఆన్లైన్ క్లాసుల వల్ల ఆర్థికంగా వెనుకబడిన వారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో ఈ నెల 13వ తేదీలోగా లిఖితపూర్వకంగా నిర్థిష్ట ప్రణాళికను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఆన్లైన్ క్లాసుల నిర్వహణ పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం దీనిపై ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించకపోవడంతో హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని ఇంకా ప్రారంభించలేదని క్యాబినెట్ సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అదే విధంగా ఆన్లైన్ క్లాసెస్‌పై ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోషియేషన్ ఇంప్లీడ్(ఇస్మా) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఎస్ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు నెలల క్రితమే విద్యా సంవత్సరం ప్రారంభించిందని ఇస్మా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం లేదని, ఇది వారికి ఆప్షన్ మాత్రమేనని ఇస్మా పిటిషన్లో పేర్కొంది. సీబీఎస్ఈపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని ఇస్మా న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఇస్మాకు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. ఆన్లైన్ తరగతులపై కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుందని తెలిపిన ప్రభుత్వం ఈ నెల 31వరకు విద్యా సంస్థలు తెరవద్దని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ నెల తర్వాతే విద్యా సంవత్సరంపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పిన ప్రభుత్వం విద్యా సంవత్సరం మొదలు కాక ముందే ఆన్ లైన్ తరగతులను ఎలా అనుమతిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.
ఆన్ లైన్ తరగతులకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం తెలిపింది. అయితే ఓవైపు అనుమతి ఇవ్వలేదంటునే..మరోవైపు అడ్డుకోవడం లేదని ప్రభుత్వం ధ్వంద్వ వైఖరితో దాగుడు మూతలు ఆడకూడదని, మహారాష్ట్ర మాదిరిగా స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే తరగతులు జరగకపోతే విద్యార్థుల కెరీర్ స్థంభించిపోతుందని తెలిపిన విద్యా సంస్థల న్యాయవాది వారి కెరీర్ కోసం నెల రోజులుగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆన్ లైన్ తరగతుల కోసం ఒక్కో ఇంట్లో రెండు మూడు ల్యాప్ టాప్‌లు కొనే పరిస్థితి ఉందా అని ప్రశ్నించిన హైకోర్టు ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం కాదు గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నీ తెలిపింది. కొరోనా కారణంగా కార్మికులు, న్యాయవ్యవస్థతో పాటు ప్రపంచ మానవాళి జీవితమే స్తంభించిందని తెలిపిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ, ఎన్సిటీఈని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.