వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

January 14, 2020

  • అన్ని పార్టీలకూ తప్పని రెబల్స్ ‌బెడద
  • టీఆర్‌ఎస్‌లో తారాస్థాయికి విభేదాలు, బుజ్జగింపులకు లొంగని నేతలు
  • తమ అభ్యర్థులపై అధికారపక్షం బెదిరింపులకు దిగిందన్న విపక్షాలు 

nomination Withdrawal date ended
మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఈనెల 22న జరుగనున్న పోలింగ్‌కు సంబంధించి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల ఉపసంహరణకు గుడువు ముగియడంతో ఇక ప్రచారం హోరెత్తనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం రెబల్స్‌గా బరిలోకి దిగిన నేతల నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. బుజ్జగింపులు, చివరి నిమిషం వరకూ బేరసారాలకు దిగారు. అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు తమ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా బెదిరింపులకు దిగారనీ, లొంగని చోట ప్రలోభాలకు గురిచేశారని కాంగ్రెస్‌, ‌బీజేపీ నాయకులు ఆరోపించారు. పోలీసుల అండతో టీఆర్‌ఎస్‌ ‌నేతలు తమ పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవం చేయడానికి కుట్రలు పన్నారని విమర్శించారు. మరోవైపు, టీఆర్‌ఎస్‌లోనూ విభేదాలు భగ్గుమన్నాయి. బీ ఫారాలు దక్కని నేతలు రెబల్స్‌గా ఎన్నికల బరిలో నిలిచారు. టికెట్లు దక్కని నేతలకు నామినేటెడ్‌ ‌పదవులు ఇస్తామని ఆశ చూపినప్పటికీ వినకుండా అధికార పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని సవాల్‌ ‌విసిరారు. మరికొన్ని చోట్ల ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యతాన్వినికి, పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టికెట్ల కేటాయింపులో తమ వర్గానికి అన్యాయం జరిగిందన్న కారణంతో అలంపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత తిరుమల్‌ ‌రెడ్డి ఫార్వర్డ్ ‌బ్లాక్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈయన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. ఆదిలాబాద్‌ ‌మున్సిపాలిటీలో చైర్మన్‌ అభ్యర్థిగా బరిలో నిలవాలని భావించిన ఆ పార్టీ సీనియర్‌ ‌నేత మాజీ చైర్మన్‌ ‌మనీషా ఎమ్మెల్యే జోగు రామన్న వ్యవహారంపై మండిపడ్డారు. తన కొడుకు భవిష్యత్తు కోసం తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు.

పక్కా ప్లాన్‌ ‌ప్రకారం తన నామినేషన్‌ ఉపసంహరించుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను విమర్శించినందుకు తనను పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. జనగామ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌తరఫున పోటీ చేసే అవకాశం దక్కనందుకు ఆ పార్టీకి చెందిన మహిళా నేత ఎమ్మెల్యే క్యాంప్‌ ‌కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. టికెట్ల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని గంగాభవాని అనే మహిళా నేత ఏకంగా పార్టీ కండువాతో ఉరివేసుకునే ప్రయత్నం చేశారు. మేడ్చల్‌లో టీఆర్‌ఎస్‌ ‌బీ ఫారం ఇవ్వలేదని విజయ్‌ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సూర్యాపేటలో టికెట్‌ ‌దక్కలేదనే ఆవేదనతో టీఆర్‌ఎస్‌ ‌నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. అధిష్టానం టికెట్‌ ఇస్తుందన్న నమ్మకంతో ప్రచారం ప్రారంభించిన రహీం అనే నేత •సుధారాణికి అవకాశం దక్కడంతో తీవ్ర మనస్థాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇక కాంగ్రెస్‌ ‌పార్టీకీ రెబల్స్ ‌బెడద తప్పలేదు. కామారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిలర్‌ ‌టికెట్లను మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆయన అనుచరులు అమ్ముకుంటున్నారని ఆశావహులు ఆ పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు కాకుండా డబ్బులిచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. మెదక్‌ ‌మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రకళ అనే మహిళకు ముందుగా బీ ఫారం ఇచ్చిన కాంగ్రెస్‌ ఆ ‌తరువాత టీఆర్‌ఎస్‌ ‌రెబల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అక్కడ రెండు పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. బరిలో 19,673 మంది అభ్యర్థులు మున్సిపల్‌ ఎన్నికల బరిలో మొత్తం 19,673 మంది అభ్యర్థులు కొనసాగుతున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి మొత్తం 3,052 వార్డులు, డివిజన్లలో 25,768 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపింది. వీటిలో 432 నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురి కాగా, 25,336 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయని ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Tags: nomination, Withdrawal, date ended, telangana municipal, elections 2020