Take a fresh look at your lifestyle.

ఎటిఎం ల నుంచి కార్డు లేకుండా నగదు విత్‌‌డ్రా

  • బ్యాంకు మోసాలను అరికట్టే యత్నం
  • కార్డ్ ‌స్కిమ్మింగ్‌, ‌కార్డ్ ‌క్లోనింగ్‌ ‌లాంటి చర్యల నిరోధం
  • ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెరుగుదల తప్పదు
  • ఆర్‌బిఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌వెల్లడి
  • కీలక వడ్డీ రేట్లు… రెపో రేటు యథాతథం: ఆర్‌బిఐ కీలక నిర్ణయం

ముంబై, ఏప్రిల్‌ 8 : ‌కార్డు లేకుండానే ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునేలా..అన్ని బ్యాంకులను అనుమతించాలని ప్రతిపాదిస్తూ బ్యాంకు మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ ‌బ్యాంక్‌ఆఫ్‌ ఇం‌డియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కార్డు రహిత నగదు ఉపసంహరణ కొన్ని బ్యాంకుల్లోనే అందుబాటులో ఉంది. ఇకనుంచి అన్ని బ్యాంకుల్లో, ఏటీఎం నెట్‌వర్క్‌ల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సులభతర లావాదేవీలతో పాటు..కార్డు లేకపోవడం వల్ల క్లోనింగ్‌, ‌స్కిమ్మింగ్‌ ‌వంటి మోసాలు తగ్గుతాయని ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత దాస్‌ అన్నారు. దీని కోసం యూనిఫైడ్‌ ‌పేమెంట్స్ ఇం‌టర్‌ఫేస్‌ను ఉపయోగిస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఏటీఎం నెట్‌వర్క్‌లు, బ్యాంకులకు త్వరలోనే మార్గదర్శకాలు జారీచేయనున్నట్లు తెలిపారు. నాన్‌ ‌బ్యాకింగ్‌ ఆపరేటింగ్‌ ‌యూనిట్స్‌లో కూడా భారత్‌ ‌బిల్‌ ‌పేమెంట్‌ ‌సిస్టమ్‌ను ప్రోత్సహించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌వెల్లడించారు. ఇందుకు అవసరమైన సవరణలు చేయనున్నట్లు చెప్పారు.

డిజిటల్‌ ‌పేమెంట్‌ ‌మోడ్‌ను అభివృద్ధి చేయడంతో పాటు సైబర్‌ ‌మోసాలు జరగకుండా చూడాలన్నారు. సైబర్‌ ‌భద్రతపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య పరపతి విధాన ప్రకటనను ఆయన ప్రకటించారు. కార్డ్ ‌లెస్‌ ‌విత్‌‌డ్రా ద్వారా వినియోగదారుడు తన వద్ద డెబిట్‌ ‌లేదా క్రెడిట్‌ ‌కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదును విత్‌‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా కార్డ్ ‌స్కిమ్మింగ్‌, ‌కార్డ్ ‌క్లోనింగ్‌ ‌లాంటి చర్యలను కూడా అడ్డుకోవచ్చని ఆయన అన్నారు. క్రెడిట్‌ ‌లేదా డెబిట్‌ ‌కార్డుల జారీని ఆపేది లేదని ఆర్బీఐ గరవ్నర్‌ ‌తెలిపారు. ఆ కార్డులను కేవలం క్యాష్‌ ‌విత్‌‌డ్రాల కోసమే కాదు అని, వాటిని రెస్టారెంట్లు, షాపులు, విదేశీ టూర్ల సమయంలో వాడుకునే వీలుందన్నారు. ఆ కార్డులను ఎప్పటికీ కంటిన్యూ చేస్తామన్నారు. కార్డు మోసాలు పెరుగుతున్న క్రమంలో అన్ని బ్యాంకులు దీనిని పాటించాలని సూచించింది.

కీలక వడ్డీ రేట్లు…రెపో రేటు యథాతథం: ఆర్‌బిఐ కీలక నిర్ణయం
ఇక నిపుణుల అంచనాలను నిజం చేస్తూ..కీలక వడ్డీ రేట్లను వరుసగా 11వ సారి యథాతథంగా ఉంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. రెపోరేటు 4 శాతంగా ఉంచగా రివర్స్ ‌రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించనున్నట్లు శక్తికాంత దాస్‌ ‌తెలిపారు. మార్జినల్‌ ‌స్టాండింగ్‌ ‌ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనుంది. 2020 మే 22న చివరిసారిగా వడ్డీ రేట్లలో మార్పులు చేసింది ఫలితంగా రెపో రేటు చరిత్రలో కనిష్ఠమైన 4శాతానికి దిగొచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త, పెను సవాలును ఎదుర్కుంటుందని రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్దాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు శక్తికాంత దాస్‌.

ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కునడం వల్ల కలిగిన లాభాలను..భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా కోల్పోవాల్సి వొచ్చిందని వివరించారు. అయితే..విదేశీ మారక నిల్వలు పుష్కలంగా ఉన్నాయని..ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఆర్‌బీఐ సర్వసన్నద్ధమై ఉందని స్పష్టం చేశారు. భారత దేశ ఆర్థిక వృద్ధిపై యుద్ధం ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.పెట్రో మంటతో ద్రవ్యోల్బణం మరింత(4.5శాతం నుంచి 5.7శాతానికి) పెరుగుతుందని, వంట నూనెల ధరలు కొంతకాలం అధికంగానే ఉంటాయని ఆయన చెప్పారు.

Leave a Reply