Take a fresh look at your lifestyle.

రాజేందర్‌ ‌రాజీనామాతోనే దళితబంధు..

  • కెసీఆర్‌ ‌మాట మీద నిలబడే వ్యక్తికాదు..
  • అవినీతి కుటుంబపాలనకు చరమగీతం పాడాలి
  • ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌

ఈటల రాజేందర్‌ ‌రాజీనామాతోనే దళితబంధు వొచ్చిందని, కెసీఆర్‌ ‌మాటమీద నిలబడే వ్యక్తికాదని,  అవినీతి కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీమంత్రి, బిజేపి నేత ఈటల రాజేందర్‌లు అన్నారు. శుక్రవారం ఇల్లందకుంట మండలంలోని వంతడ్పుల, బూజునూరు, సీతంపేట, మర్రివానిపల్లి, సిరిసేడు, పాతర్లపల్లి గ్రామాలలో బిజేపి ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్రమంత్రి గంగారపు కిషన్‌రెడ్డితో పాటు బిజేపి పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌  ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. అడుగడున బిజేపి పార్టీకి, ఈటల రాజేందర్‌కు జై కొడుతూ ప్రజలు డప్పుచప్పుళ్ళ మధ్య ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..దళితబంధు ఆపాలని కెసీఆర్‌ ‌కొత్తనాటకాలకు తెరలేపారని, గత 70 రోజుల నుండి దళితబంధు డబ్బులు ఖాతాలో వేస్తామని దళితులను ఊరించారేగాని ఒక్క పైసా కూడా వేయకుండా దళితులను మోసంచేశారన్నారు. తెరాస నాయకులు ఓటమి భయంతో రాజేందర్‌ ‌దళితబంధును అడ్డుకుంటున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజేందర్‌ ‌రాజీనామాతోనే దళితబంధు పథకం వొచ్చిందని అన్నారు. చావుకు దగ్గరగా ఉన్న పేషెంట్లకు కొరోన కష్టకాలంలో ఆరోగ్యశాఖ మంత్రిగా విశేష సేవలందించి ప్రతిపక్ష పార్టీచే రాజేందర్‌  ‌మెప్పు పొందాడని గుర్తు చేశారు.

సీఎం కెసీఆర్‌ అబద్దాల పుట్ట అని అన్నారు.  దళితబంధు తెలంగాణ అంతటా అమలు చేయించడమే తన మొదటి యుద్ధమని 30వ తేది తరువాత అదే పనిలో కొనసాగుతానని కిషన్‌రెడ్డి అన్నారు. అనంతరం ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ..దళితబంధు ఆపాలని తాను లేఖ రాయలేదని, కావాలంటే తాను పోచమ్మ గుడికి తడి బట్టలతో వొస్తానని..దమ్ముంటే నీవుకూడా వొస్తే ఇద్దరం కలిసి ప్రమాణం చేద్దామని సవాల్‌ ‌విసిరారు. మంత్రిగా పని చేసినప్పుడు తనను  కనీసం మనిషిగా గుర్తించలేదని, తన పేరు మీద దొంగ ఉత్తరం సృష్టించి ఎన్నికల కమిషన్‌ ‌పేరుతో బూటకపు ప్రచారం చేశారని, తాను గెలిస్తే నియోజకవర్గ ప్రజల గౌరవం నిలబడుతుందని ఈటల అన్నారు.

అంతకుముందు మంత్రి  కిషన్‌రెడ్డిని,  ఈటల రాజేందర్‌ను అభిమానులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి చాడ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, మందాడి సత్యనారాయణరెడ్డి, నాయకులు ప్రేమేందర్‌రెడ్డి, గంగాడి కృష్ణారెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కంకణాల శ్రీలత సురేందర్‌రెడ్డి, మండల వైస్‌ ఎం‌పీపీ ఆరెల్లి జ్యోత్స్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply