Take a fresh look at your lifestyle.

నా జన్మ చరితార్థమయింది..!

  • ప్రాజెక్టు నిర్మాణంలో కూలీల కృషి మరువలేం
  • కేసీఆర్‌ ‌కృషితో ప్రజల చిరకాల స్వప్నాలు నెరవేరుతున్నాయి: మంత్రి హరీష్‌రావు
  • కోటి ఎకరాల మాగాణంగా చేయడమే సీఎం కేసీఆర్‌ ‌లక్ష్యం
With KCR agriculture, people's long-held dreams come true
‌ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సంతోషంలో
విక్టరీని చూపిస్తున్న మంత్రి హరీష్‌రావు

కాలేశ్వరం ప్రాజెక్టు మహోజ్వాల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్ధిపేటలో గోదారి జల సవ్వడి చేసింది. ఎట్టకేలకు రంగనాయకసాగర్‌లోకి కాలేశ్వరం నీళ్లొచ్చాయి. శుక్రవారం చంద్లాపూర్‌లోని రంగనాయకస్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌, ‌జిల్లా కలెక్టర్‌, ఇం‌జినీర్‌ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం సరిగ్గా 12గంటల 29నిమిషాలకు పంప్‌హౌజ్‌ను ప్రారంభించిన మోటార్‌ను ఆన్‌ ‌చేసి నీటని విడుదల చేశారు. గోదావరమ్మకు జల హారతి ఇచ్చారు. నీళ్లను చూసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపి, ఎమ్మెల్సీతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఉప్పొంగారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నో పనులు చేస్తాం. కానీ, నా హృదయంలో రంగనాయకసాగర్‌ ‌ప్రాజెక్టు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఒక ఇల్లు కూడా మునిగిపోకుండా 3టిఎంసిల సామర్ధ్యంతో రంగనాయకసాగర్‌ను నిర్మించడం నేడు ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకోవడంతో నా జన్మ చరతాత్మకమైందన్నారు. ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంతో సంతోషంగా ఉందో…ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్ధాలు కాదని మరోసారి సిఎం కేసీఆర్‌ ‌నిరూపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కూలీల కృషి మరువలేమనీ, సిద్ధిపేటకు గోదావరి జలాలు రావడం దశబ్ధాల కల. సిఎం కేసీఆర్‌ అవిశ్రాంతంగా శ్రమించి సిద్దిపేట వాసులు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో శ్రమించిన అందరికీ కృతజ్ఞతలన్నారు.

సమైక్యరాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో ఒక ఎకరానికి నీళ్లు రాలేదనీ, కాలమైతే తప్ప కడుపు నిండని పరిస్థితి ఉండే. లక్షలాది మంది మధ్య జరుపుకోవాల్సిన అపురూప ఘట్టాన్ని కొరోనా వల్ల నిరాడంబరంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మాదిరిగానే ఈ జల సాధన ఉద్యమం విజయవంతం అయింది. కేసీఆర్‌ ‌కల సాకారమైంది. ఒక్క ఇల్లు కూడా ముంపుకు గురికాకుండా 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో రంగనాయక సాగర్‌ ‌ప్రాజెక్టు నిర్మించుకోవడం ఒక అరుదైన ఘట్టం. ఇది సిఎం కేసీఆర్‌, ‌తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు గొప్ప నిదర్శనం. భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ త్యాగాలు మరువలేనివి. త్యాగాలు చేసిన రైతుల పేర్లు సువర్ణాక్షరాలతో లికించబడి ఉంటుంది. రంగనాయక సాగర్‌ ‌ప్రాజెక్టు తో సిద్దిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాలకు సాగునీరు అందుతుంది. చెరువులు, కుంటలు నిండుతాయని తెలిపారు. సిఎం కేసీఆర్‌ ఎప్పుడూ సిద్ధిపేటకు గోదావరి నీళ్లు, రైలు, సిద్ధిపేట జిల్లా కావాలని. ఈ మూడింటిలో సిద్ధిపేట జిల్లా కల నెరవేరింది. ఇప్పుడు గోదావరి నీళ్లొచ్చినయి. రానున్న రోజులలో రైలు కూడా రానున్నదన్నారు. అయితే, ఈ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు రావల్సి ఉందన్నారు. సిద్ధిపేట ప్రాంతంలో ఐటి హబ్‌ ఏర్పాటుకు కావల్సిన స్థలం ఉందనీ, సిద్ధిపేటకు ఐటి హబ్‌తో పాటు మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా కేటీఆర్‌ ‌సహకరించాలని మంత్రి హరీష్‌రావు కోరారు.

- Advertisement -

 Ministers serving the Goddess at Ranganayakasagar, KTR, Harish Rao, MP KTR
రంగనాయకసాగర్‌ ‌వద్ద గోదారికి జలహారతి ఇస్తున్న మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌రావు, ఎంపి కేపీఆర్‌

హరీష్‌రావు పనులు చూసి అసూయపడుతున్నారు…సిద్ధిపేటకు ఏ లోటు రానివ్వం: కేటీఆర్‌
‌సిద్ధిపేటలో మంత్రి తన్నీరు హరీష్‌రావు చేస్తున్న పనులు చూసి అందరూ అసూయపడుతున్నారనీ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కేటీఆర్‌ ‌మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి హరీష్‌రావు సమర్ధవంతమైన నాయకుడనీ, హరీష్‌రావు నాయకత్వంలో సిద్ధిపేట ప్రాంతమంతా అన్ని విధాలుగా పేరు ప్రఖ్యాతలను పొందుతుందన్నారు. ఈ ప్రాంతానికి ఏ లోటు ఉండదనీ, ఐటి, ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌వంటి పరిశ్రమలన్నీ వస్తాయన్నారు. అంతేకాకుండా, సిద్ధిపేట జిల్లాకు ఏ లోటు రానివ్వమనీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణకు ఏ లోటు రాదన్నారు. ఈరోజ చిరస్మరణీయమైన దృశ్యం ఆవిష్కృతమైందన్నారు. ఒక మాటలో చెప్పాలంటే నేను, మంత్రి హరీష్‌రావు ఇద్దరమూ అదృష్టవంతులమన్నారు. సిఎం కేసీఆర్‌ ‌సిద్ధిపేట అంటే ఎంత ప్రేమ, అభిమానమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదన్నారు. రంగనాయకసాగర్‌ ‌రిజర్వాయర్‌ ‌సిఎం కేసీఆర్‌ ‌చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండే. కానీ, మా చేతుల మీద ప్రారంభోత్సవం జరగడమంటే మేమిద్దరం అదృష్టవంతులమే కదా అని అన్నారు. అంతేకాదు, సిద్ధిపేట ప్రజలు ధన్యజీవులన్నారు. సిఎం కేసీఆర్‌ ‌తర్వాత అంతేస్థాయిలో అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడు మంత్రి హరీష్‌రావు అన్నారు. భగీరథుడు దివి నుంచి భువికి నీళ్తు తెస్తే..సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావు, ఇంజినీర్లు మాత్రం కింది నుంచి 618మీటర్ల ఎత్తులో ఉండే ప్రాంతానికి నీళ్లు తేవడమంటే సాధారణ విషయం కాదన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణమంటే దశబ్దాలకు దశబ్దాల సమయం పడుతుందన్న భావన ఉండేదన్నారు. కానీ, కాలేశ్వరం ప్రాజెక్టును మాత్రం నాలుగైదేండ్లలో కాలంతో పాటు పోటీ పడుతూ నిర్మించారన్నారు. కాలేశ్వరం నిర్మాణంలో సిఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా హరీష్‌రావు శ్రమించారనీ, కాళేశ్వరం నిర్మాణంలో శ్రమించిన హరీశ్‌రావుకు అభినందనలన్నారు. రాష్ట్రంలోని 46వేల చెరువులు, కుంటలు కూడా నిండు కుండలా ఉండాలన్నదే సిఎం కేసీఆర్‌ ఆశయమన్నారు. మెతుకు సీమ తెలంగాణకు బువ్వ పెట్టే జిల్లా కావాలని కోరుకుంటున్నానీ అన్నారు. ఈ ప్రాజెక్టు సిద్దిపేటకే కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా సస్యశ్యామలం చేస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు నియోజకవర్గాలకు శాశ్వతంగా సాగునీరు అందనుంది. సిఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో, మంత్రి హరీష్‌రావు శ్రమతో తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం కల త్వరలో సాకారమవుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గానూ సిఎం కేసీఆర్‌ ‌కృషి చేస్తున్నారనీ, రాబోయే రోజుల్లో తెలంగాణలో నాలుగు విప్లవాలు చూడబోతున్నామనీ… హరితవిప్లవం, మత్స్యసంపద పెరిగి నీలి విప్లవం, పాడి రైతులు క్షీర విప్లవం తీసుకువస్తారు, గొర్రెల పెంపకం ద్వారా గులాబి విప్లవం వస్తుందన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి శ్రమించిన కార్మికులకు, ఇంజినీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం వల్ల భూములు కోల్పోయే వారి బాధలు మాకు బాగా తెలుసుననీ, ప్రాజెక్టుల వల్ల అమ్మమ్మ, నాన్నమ్మకు చెందిన రెండు ఊర్లు మునిగిపోయిన నిర్వాసితులం మేమన్నారు. అయితే, ప్రాజెక్టుల నిర్మాణానికి భూములిచ్చిన వారి త్యాగాలను వెలకట్టలేమనీ, భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు చేస్తున్నానీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ మీడియా ప్రతినిధులు సమావేశంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, సోలిపేట రామలింగారెడ్డి, వొడితెల సతీష్‌కుమార్‌, ‌ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, ఫారుఖ్‌హుస్సేన్‌, ‌కూర రఘోత్తంరెడ్డి, జిల్లా పరిషత్‌ ‌ఛైర్మన్‌ ‌రోజాశర్మ, కలెక్టర్లు పరపతి వెంకట్రారెడ్డి , దేవరకొండ కృష్ణభాస్కర్‌, ‌కార్పొరేషన్‌ ‌ఛైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎస్సీ కమిషన్‌ ‌ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ఎ‌ర్రొళ్ల శ్రీనివాస్‌, ‌సిఎం ఒఎస్డి దేశపతి శ్రీనివాస్‌, ఈఎన్‌సి హరిరాం, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో పని చేసిన కూలీలు, ఇంజినీర్లు, స్థానిక తాజా, మాజీ ప్రతినిధులు, కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, కృష్ణభాస్కర్‌ను శాలువాలతో మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌రావు సన్మానించారు. కూలీలతో కలిసి మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌రావు సహపంక్తి భోజనం చేశారు.

 

Leave a Reply