జవహర్‌నగర్ చెత్తకు పరిష్కారం
ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
గ్రేటర్ హైదరాబాద్ నగర చరిత్రలో మరో కలికితురాయి చేరింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే
ప్లాంట్ మంగళవారం ప్రారంభమయింది. దక్షిణ భారతదేశంలోనే చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తొలి ప్లాంట్ ఇదే. జవహర్‌నగర్‌లోని ఈ ప్లాంట్ మొదటి దశ పనులు ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభం కాగా, మునిసిపల్ మంత్రి కెటిఆర్ లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. జవహర్ నగర్, దమ్మాయిగూడ ప్రజలకు దుర్గంధం నుంచి శాశ్వత విముక్తి కల్పించేందుకు వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని జవహర్‌నగర్‌లో జీహెచ్ఎంసీ, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ సంయుక్తాధ్వర్యంలో మున్సిపల్ వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్లాంటును నిర్మించారు.
19.8మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును మంగళవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అయితే దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తిచేసే మొదటి ప్లాంటు ఇది కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యుత్ ప్లాంట్‌ను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినట్లు తెలిపారు. దీని ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. నగరంలో ప్రతి రోజు 5వేల నుంచి 6 వేల టన్నుల చెత్తను సేకరించి..దాన్ని జవహర్‌నగర్‌లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. దీనివల్ల స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, ఈ సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేశారని అన్నారు. జవహర్‌నగర్, దమ్మాయిగూడ ప్రజలకు శాశ్వతంగా విముక్తి కల్పించేందుకు వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారన్నారు. ప్లాంట్‌లోని రెండు బాయిలర్లకు గాను ప్రస్తుతం ఒకదాని ద్వారా రోజుకు 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్‌గా వ్యవహరిస్తున్న దీని ద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్ టన్నుల ఆర్డీఎఫ్ చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. మలిదశలో మరో 28.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా చర్యలు ప్రారంభమయ్యాయి. రెండు దశలు పూర్తయితే జవహర్‌నగర్‌కు తరలిస్తున్న చెత్తనుంచి 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ ప్లాంట్‌లో పర్యావరణహిత థర్మల్ కంబషన్ టెక్నాలజీతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటివి ఢిల్లీ, జబల్పూర్లలో మాత్రమే ఉన్నాయి. ఈ ప్లాంట్ వల్ల చెత్త నుంచి విద్యుత్‌తో చెత్త సమస్యకు పరిష్కారంతోపాటు పరిసరాల్లోని ప్రజలకు కాలుష్యం తగ్గుతుంది. చెత్త నుంచి ఆదాయం లభిస్తుంది. ఇప్పటి వరకు 1.34 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. రోజుకు సగటున 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది. జవహర్‌నగర్‌లో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను రూ. 147 కోట్లతో క్యాపింగ్ చేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి దుర్గంధం, మురికి వాసన లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు.
ఇప్పుడున్న విద్యుత్ ప్లాంట్‌కు అదనంగా మరో 28 మెగావాట్ల ప్లాంట్‌కు శిలాఫలకం వేశామన్నారు. ఈ ప్లాంట్‌ను 18 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతమున్న జవహర్‌నగర్ డంప్ యార్డును వికేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. మరో రెండు ప్రాంతాల్లో సంగారెడ్డి జిల్లా లక్డారంలో, మెదక్ జిల్లా ప్యారేనగర్‌లో స్థలాలను ఎంపిక చేశాం. జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయబోతున్నాం. శాస్త్రీయమైన పద్ధతిలో వీటిని పూర్తి చేస్తాం. త్వరలోనే ఈ డంప్‌యార్డులకు శంకుస్థాపన చేస్తామని కేటీఆర్ తెలిపారు. కార్మిక శాఖ మంత్రి చామకర మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కషనర్ లోకేశ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.