Take a fresh look at your lifestyle.

1.48 లక్షల కోట్లతో స్వచ్ఛ్ భారత్ రెండవ దశకు శ్రీకారం ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనే ప్రధాన లక్ష్యం

[bs-quote quote=”‘స్వఛ్ భారత్ మిషన్ (ఎస్.బి.ఎం) పథకం ప్రారంభించి 2020 అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆరేళ్లు పూర్తి అవుతాయి. దేశంలో ప్రజలందరికీ టాయిలెట్స్, పరిశుభ్రమైన త్రాగు నీరు అందించాలనే మహోన్నత ల్లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గాంధీ మహాత్ముని జయంతి రోజున 2014 అక్టోబర్ 2వ తేదీన ఈ బృహత్తర పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ సంకల్పానికి, ప్రజల సహకారం తోడవటంతో ఈ పథకం అద్భుత విజయం సాధించింది. ఆరేళ్ల కిందట ఎస్.బి.ఎం ప్రారంభంలో కేవలం 38.7 శాతం మందికే మరుగు దొడ్డి సౌకర్యం ఉండగా, ప్రస్తుతం దేశంలో 130 కోట్ల ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆరేళ్ల కాలంలో 2020 సెప్టెంబర్ 27వ తేదీ నాటికి మొత్తం 10,67,34,336 టాయిలెట్స్ నిర్మించారు. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 706 జిల్లాలు, 6,03,177 గ్రామాలు బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా మారాయి..'” style=”style-13″ align=”center”][/bs-quote]

“స్వచ్ఛ్ భారత్ మిషన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా”

దేశం లో ప్రజలందరికీ టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలనే స్వఛ్ భారత్ మిషన్ (ఎస్.బి.ఎం) తొలి దశ లక్ష్యం నెరవేరటంతో కేంద్ర ప్రభుత్వం ద్వితీయ దశ కార్యక్రమానికి ఈ ఏడాది శ్రీకారం చుట్టింది. ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనకు ఈ రెండవ దశ కార్యక్రమంలో సమర శంఖం పూరించింది. గత ఏడాది ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై నుంచి ప్రసంగిస్తూ మన దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చేందుకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూనే ఎస్.బి.ఎం ద్వితీయ దశ కార్యక్రమాన్ని ప్రకటించారు. మరుగుదొడ్లు అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చిన స్పూర్తితో గ్రామాలలో గుట్టలు గుట్టలగా పేరుకు పోతున్న ఘన, ద్రవ్య వ్యర్ధాలను (చెత్తను) శాస్త్రీయ పద్దతిలో నిర్వీర్యం చేయటం, మానవాళి మనుగడకే పెను ముప్పుగా పరిణమించిన ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా మాన్పించటమే ప్రధాన లక్ష్యాలు గా స్వఛ్ భారత్ మిషన్ రెండవ దశ కార్యక్రమాన్ని ఈ ఏడాది (2020) ఫిబ్రవరి లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ద్వితీయ దశ కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, తడి, పొడి చెత్తల సేకరణ, నిర్వహణ, మురుగు నీటి శుద్ది, మానవ వ్యర్ధాల శుద్ది ప్లాంట్స్ ఏర్పాటు ద్వారా దేశంలో అన్ని గ్రామాలు స్వచ్ఛతకు, పరిశుభ్రతకు మారు పేరు గా (ఒడిఎఫ్ ప్లస్) అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) నుంచి రానున్న ఐదేళ్లలో (2020-21 నుంచి 2024-25 వరకు) రూ. 1,40,881 కోట్ల వ్యయంతో జల్ శక్తి మంత్రిత్వ శాఖ లోని గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుధ్య విభాగం (డిడిడబ్ల్యుఎస్) మిషన్ మోడ్ పద్దతిలో ఎస్.బి.ఏం రెండవ దశ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.

ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ వ్యర్ధాలను శాస్త్రీయ పద్దతిలో నిర్వీర్యం చేయటం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఎస్.బి.ఎం రెండవ దశ మార్గదర్శకాలలో పభుత్వం పేర్కొంది. ప్రతి సంవత్సరం మన దేశంలో 94 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉత్పత్తి అవుతుండగా, అందులో 34.31 లక్షల టన్నులు సేకరణే జరగటం లేదు. వీటిలో ఎక్కువ భాగం ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులే ఉంటాయి. వీటిని బహిరంగ ప్రదేశాలలో ఎక్కడ పడితే అక్కడ పారేయటం వలన ఇవి మట్టి కుప్పలలో చేరి, వర్షపు నీటిలో కొట్టుకు పోయి చెరువులు, నదులు, సముద్రాలలో కలిసి మన జల వనరులు అన్నీ కలుషితం అవుతున్నాయి. వీటిలో ఉండే చేపలు, ఇతర జీవ చరాల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. అంతేకాదు, వీటిని ఆహారంగా తీసుకునే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు పలు పరిశోధనల ద్వారా తెలిసింది. గ్రామాలలో కొన్నిసార్లు జంతువులు వీటిని తినటం వలన మృత్యువాతకు గురవుతున్నాయి. ఒక సారి వాడి పారేసే (మంచి నీళ్ళ సీసాలు, గ్లాసులు, టీ కప్స్, క్యారీ బ్యాగ్ లు మొదలైనవి) ప్లాస్టిక్ వ్యర్ధాల వలన మన నేల, నీరు, గాలి, ఆహారం అన్నీ కలుషితం అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది. అందుకే ప్రభుత్వం ఈ ఎస్.బి.ఏం రెండవ దశ లో ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనకు ప్రజలను జాగృతం చేసే మరో ప్రజా ఉద్యమానికి పిలుపు ఇచ్చింది. ముఖ్యంగానాలుగు ‘ఆర్’ లపై (రెడ్యూస్, రీ యూజ్, రిఫ్యూజ్, రీసైకిల్) ప్రజలకు అవగాహన కల్పించాలని సంకల్పించారు. గ్రామ పంచాయితీలు ప్రతి గ్రామంలో ఇంటి నుంచే ప్లాస్టిక్ వ్యర్ధాలను విడివిడి గా సేకరించేందుకు, సేకరించిన వాటిని నిల్వ చేసేందుకు, మండల జిల్లా స్థాయి లో ఏర్పాటు చేసే రీ సైక్లింగ్ ప్లాంట్స్ కు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణకు మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్.హెచ్.జి లు) సేవలను పెద్ద ఎత్తున ఉపయోగించుకోనున్నారు.

ఇంకా ఎస్.బి.ఏం మొదటి దశలో భాగంగా నిర్మించిన మరుగుదొడ్లు ప్రజలు ప్రతి ఒక్కరూ వాడుకునేలా ప్రోత్సహించటంతో పాటు వాటిని పరిశుభ్రంగా ఉంచుకునేలా నిరంతరంగా అవగాహన కార్యక్రమాలను ఈ రెండవ దశలో చేపట్టనున్నారు. అలాగే, గ్రామాలలో ఘన, ద్రవ్య వ్యర్ధ పదార్ధాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేయటం (సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) అతి పెద్ద సమస్య. చెత్త గుట్టలు గుట్టలు గా పేరుకు పోయి గ్రామాలు మురికి కూపాలుగా తయారై ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. అందుకే ఈసారి కార్యక్రమంలో స్టానిక గ్రామ పంచాయతీల ద్వారా ప్రజలకు తడి, పొడి చెత్తను విడివిడి గా డబ్బాలలో వేసేటట్లు చైతన్య పరచనున్నారు. చెత్త సేకరణలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. భూమిలోనే కలిసిపోయే పశువులు, వ్యవసాయ పంటల ద్వారా వచ్చే వ్యర్ధాలను గ్రామంలోనే కమ్యూనిటీ కంపోస్ట్ పిట్స్ ఏర్పాటు చేసుకుని వాటిలోకి మళ్లించే విధంగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే, వంట, స్నానాల గదుల నుంచి వచ్చే మురుగు నీరు, వర్షపు నీటిని రహదారుల పై ప్రవహించకుండా ఇంకుడు గుంతలు నిర్మించి పైపు లైన్ల ద్వారావాటిలోకి మళ్లించే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇంకా మురుగు నీరు, మానవ వ్యర్ధాల శుద్దికి కూడా జనాభాని బట్టి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఆర్ధిక సహాయం చేస్తారు. ఇందుకు గాను గ్రామ, మండల, జిల్లా స్థాయిలో స్థానిక అవసరాలకు అనుగుణంగా చేపట్టే వివిధ స్వచ్చత, పారిశుధ్య కార్యక్రమాలకు అవసరమైన నిధులు, సాంకేతిక సహకారం తదితర అంశాలతో వార్షిక కార్యాచరణ ప్ర్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించి నిధులు విడుదల చేస్తుంది. ఈ పారిశుధ్య కార్యక్రమాలకు అయ్యే వ్యయంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఈ నిధులతో పాటు 15వ ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులు, నరేగా ఎంపీ లాడ్స్, శాసన సభ్యులకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ది నిధులు, కార్పొరేట్ సంస్థల నుంచి సి.ఎస్.ఆర్ నిధులను కూడా చేపట్టే పనులను అనుసరించి ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు.

ఆరేళ్లలో అద్బుత విజయం

స్వఛ్ భారత్ మిషన్ (ఎస్.బి.ఎం) పథకం ప్రారంభించి 2020 అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆరేళ్లు పూర్తి అవుతాయి. దేశంలో ప్రజలందరికీ టాయిలెట్స్, పరిశుభ్రమైన త్రాగు నీరు అందించాలనే మహోన్నత ల్లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గాంధీ మహాత్ముని జయంతి రోజున 2014 అక్టోబర్ 2వ తేదీన ఈ బృహత్తర పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ సంకల్పానికి, ప్రజల సహకారం తోడవటంతో ఈ పథకం అద్భుత విజయం సాధించింది. ఆరేళ్ల కిందట ఎస్.బి.ఎం ప్రారంభంలో కేవలం 38.7 శాతం మందికే మరుగు దొడ్డి సౌకర్యం ఉండగా, ప్రస్తుతం దేశంలో 130 కోట్ల ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆరేళ్ల కాలంలో 2020 సెప్టెంబర్ 27వ తేదీ నాటికి మొత్తం 10,67,34,336 టాయిలెట్స్ నిర్మించారు. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 706 జిల్లాలు, 6,03,177 గ్రామాలు బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా మారాయి. మన దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా గర్వంగా ప్రకటించుకున్నాం. ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకం అమలుకు నిధుల కేటాయింపులను భారీగా పెంచింది. గత ఆరేళ్ల లో మొత్తం రూ. 72,545 కోట్లు (గ్రామీణ ప్రాంతాలలో అమలుకు రూ. 61,454 కోట్లు, పట్టణాలు, నగరాలలో అమలుకు రూ. 11,091 కోట్లు) ఎస్.బి.ఎం అమలుకు వ్యయం చేశారు. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు, పలు అంతర్జాతీయ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు (సిఎస్ఆర్ లో భాగంగా) కూడా భారీగా నిధులు సమకూర్చాయి. నిధుల లభ్యత, పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక, ప్రజా సహకారం మూలంగా ఆరేళ్ల కిందట దుర్గంధ పూరితంగా ఉన్న పల్లె సీమలలో ఇపుడు పరిశుభ్రత తాండవిస్తోంది. ప్రజల అలవాట్లు, ఆలోచన, ప్రవర్తనలో గుణాత్మక మార్పు స్పష్టంగా కనబడుతోందని డీడీడబ్ల్యుఎస్ నిర్వహించిన జాతీయ గ్రామీణ పారిశుధ్య సర్వే (ఎన్ఆర్ఎస్ఎస్) నివేదిక లో తెలిపింది. టాయిలెట్ సౌకర్యం వలన గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల అనారోగ్య సమస్యలు గణనీయంగా తగ్గాయని కూడా ఆ నివేదిక వెల్లడించింది. నిర్మించిన మరుగుదొడ్లను అధిక శాతం ప్రజలు వినియోగించుకోవటం గ్రామీణ ప్రజల అలవాట్లలో వచ్చిన అతి పెద్ద మార్పునకు నిదర్శనమని ఆ సర్వే లో పేర్కొన్నారు. ఇంకా ఇంటి వద్దే మరుగుదొడ్డి సౌకర్యం ఉండటం వలన ఎంతో సౌకర్యం గా ఉందని, తమ ఆత్మ గౌరవం పెరిగిందని, ముఖ్యంగా అల్లరి మూకల, ఆకతాయిల వేధింపుల నుంచి విముక్తి లభించిందని ఇటీవల యునిసెఫ్ నిర్వహించిన సర్వే లో 93 శాతం మహిళలు పేర్కొన్నారు.

ఎస్.బి.ఎం తొలి దశలో అందరికీ టాయిలెట్స్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం రెండవ దశ కార్యక్రమంలో గ్రామ పరిసరాలు పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరించింది. పట్టణాలు, నగరాలలో మాదిరిగా గ్రామాల మధ్య ఘన, ద్రవ్య వ్యర్ధాల నిర్వహణలో ఆరోగ్యకరమైన పోటీకి ఒడిఎఫ్ ప్లస్ గ్రామాల ఎంపిక పద్దతిని ప్రవేశపెట్టారు. ఆయా గ్రామం లో చేపట్టిన పారిశుధ్య, స్వచ్ఛత కార్యక్రమాలు, ప్రజలు పాటించే పరిశుభ్రత పద్దతులు, గ్రామ పరిసరాలలో నెలకున్న పరిశుభ్రత తదితర అంశాల ప్రాతిపదికన వీటిని ప్రకటిస్తారు. ఒక గ్రామాన్ని ఒడిఎఫ్ ప్లస్ గా ప్రకటించాలంటే గ్రామంలో అన్నీ స్కూల్స్, అంగన్ వాడి కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలలో పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండాలి. గ్రామంలో ఎక్కడా చెత్త వేయకూడదు. మురుగు నీరు బహిరంగ ప్రదేశాలలో నిల్వ ఉండకూడదు. ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కడా కుప్పలుగా కనబడకూడదు ప్రతి గ్రామం లో కనీసం 80 శాతం కుటుంబాలకు తడి, పొడి చెత్తలను విడి, విడి డబ్బాలలో వేయటం, వాటిని సక్రమంగా ప్రాసెస్ చేయటం పై అవగాహన ఉండాలి. గ్రామంలో ఉన్న స్కూల్, పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం తదితర ప్రభుత్వ కార్యాలయాలలో తడి, పొడి చెత్తలను నిర్వీర్యం చేసేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి.

అలాగే, రోజూ టాయిలెట్స్ వినియోగించటం, సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవటం, తడి చెత్తను వేయటానికి కంపోస్ట్ పిట్స్ వినియోగించటం, ప్లాస్టిక్ వ్యర్ధాల రీసైక్లింగ్, మురుగు నీటి శుద్ది అంశాలపై వాల్ పెయింటింగ్, బిల్ బోర్డ్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించే ఏర్పాటు చేయాలి. ఈ విధంగా గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు చేపట్టిన చర్యలు, గ్రామంలో నెలకున్న పరిశుభ్రమైన వాతావరణం, ప్రజల ప్రవర్తనలో వచ్చిన మార్పులను బట్టి ఒడిఎఫ్ ప్లస్ గ్రామాలను ఎంపిక చేసి ప్రకటిస్తారు. అలాగే, ఈ విధంగా ప్రకటించిన గ్రామాల్లో కల్పించిన సౌకర్యాల పరిశీలన, పర్యవేక్షణకు, ప్రజా స్పందన ను తెలుసుకునేందుకు పట్టణాల, నగరాలలో మాదిరిగా ‘‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్’’ ను కూడా ఈ ద్వితీయ దశ ఎస్.బి.ఎ లో చేపట్టనున్నారు. ఈ సర్వే ద్వారా ఒడిఎఫ్ ప్లస్ ప్రమాణాలను పాటించటంలో ప్రతిభ కనబరిచిన జిల్లాలను, రాష్ట్రాలను ఎంపికచేసి అవార్డులు అందజేస్తారు. టాయిలెట్స్ ఉపయోగిస్తూ స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుకు వేసిన ప్రజలు ఘన, ద్రవ్య, వ్యర్ధ పదార్ధాలను సక్రమంగా నిర్వీర్యం చేసేందుకు కూడా చేయి చేయి కలపాలి. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం పూర్తిగా మానేయాలి. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనకు నడుం బిగించాలి. గాంధీ మహాత్ముడు కలలు కన్నట్లు మన గ్రామాలు ఎల్లపుడూ పరిశుభ్రత, పచ్చదనంతో కళ కళలాడేలా అందరూ స్వచ్ఛ్ భారత్ మిషన్ ద్వితీయ దశ లక్ష్యాల సాధనకు సహకరిస్తారని ఆశిద్దాం.

ఇనుముల హరిబాబు
అసిస్టెంట్ డైరెక్టర్
రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో
భారత ప్రభుత్వం

Leave a Reply