న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఫ్రెషర్స్‌కు జీతం సగం తగ్గించుకోవాలని ఇచ్చిన సలహాపై ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ మండిపడుతోంది. మొదట ఆఫర్ చేసిన జీతంలో సగానికి పని చేయాలని కోరింది. విప్రో ఇచ్చిన సగం జీతం ఆఫర్‌పై నైట్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విప్రో తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమని.. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలని సూచించింది. విప్రో తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వేతనాన్ని సగానికి తగ్గించుకోమని చెప్పడం అనైతికం. ఆర్థిక కష్టాల భారాన్ని ఉద్యోగులపై మోపుతారా..? ఈ నిర్ణయంపై కంపెనీ పునరాలోచన చేయాలి’ అని నైట్స్ అధ్యక్షుడు హర్పీత్ సింగ్ సలౌజా అన్నారు.
తమ సభ్యుల హక్కులకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమన్నారు. విప్రో.. 2022-23 వెలాసిటీ గ్రాడ్యుయేషన్ కేటగిరీలో శిక్షణ పూర్తిచేసుకున్న ఫ్రెషర్లకు గతంలో రూ.6.5 లక్షల వేతన ప్యాకేజీని ఆఫర్ చేసింది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన వారిని 2023 మార్చి నుంచి రోల్స్‌లోకి తీసుకునే పక్రియ ప్రారంభించనుంది. అయితే వేతన ప్యాకేజీని మాత్రం రూ.6.50 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించుకుని విధుల్లో చేరాల్సిందిగా వాళ్లను కోరింది. ఈ మేరకు ఈ మెయిల్ ద్వారా తెలియజేసినట్లు ఓ ఆంగ్ల వెబ్‌సైట్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్‌లో విప్రో పేర్కొంది. ఈ ఆఫర్‌కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని, దీనికి ఓకే అంటే గత ఆఫర్ రద్దవుతుందని తెలిపింది. కాగా, శిక్షణ సమయంలోనే పనితీరు సరిగా లేదంటూ 425 మందిని విప్రో ఇంటికి పంపిన విషయం తెలిసిందే.