Take a fresh look at your lifestyle.

ప్రపంచం మూడు కూటములుగా కానుందా..?

“వ్యాపారం కోసం దేశాలు ఇలా యుద్దానికి దిగటం అనేది చూసినప్పుడు ఒక్క రష్యానే కాదు, అమెరికా, చైనాలు కూడా దోషులే కదా..? సోవియట్‌ ‌యూనియన్‌ ‌పతనం తర్వాత ప్రపంచంకి పెద్దన్న నేనే అని అమెరికా అవకాశం వున్నా ప్రతి దేశంలోకి దూరి శాంతి పేరుతో ఆయుధాలు అమ్మి సొమ్ములు పోగు చేసుకుంది. అలాగే యుద్ధాల వలన అమెరికా ప్రజలు విసిగి వేసారిన పరిస్థితిని ఆ దేశం మూట గట్టుకుని వుంది. బహుశా ఈ నేపథ్యంలో అమెరికా పెత్తనానికి సవాలు విసిరే పరిస్థితి ప్రపంచం చూస్తున్నది. బహుశా ప్రపంచం రెండు లేదా మూడు కూటములుగా విడిపోటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏమో ఈ యుద్ధం ఈ పరిణామానికి మరింత తోడ్పడుతుందేమో…? కాలమే దీనికి సమాధానము ఇవ్వగలదు.”

aruna-journalist-delhi అమెరికా కూటమి లో ఇంగ్లాండ్‌, ‌జపాన్‌, ఆ‌స్ట్రేలియా..యూరప్‌ ‌నేతృత్వంలో జర్మనీ, ఫ్రాన్స్ ‌యూరోపియన్‌ ‌యూనియన్‌.. ‌మరోవైపు చైనా రష్యాలు.. కానున్నాయా…?
ది న్యూయార్క్ ‌టైమ్స్ ‌లో ఏప్రిల్‌ 3, 2008‌న స్టీవెన్‌ ఎర్లాంగర్‌..‌స్టీవెన్‌ ‌లీ మైయర్స్ అనే ఇద్దరు జర్నలిస్టులు ‘‘జార్జియా..ఉక్రెయిన్‌లకు నాటో సభ్యత్వం’’ ఇప్పించాలి అనుకున్న అమెరికా అధ్యక్షుడు బుష్‌కు నాటో సమ్మిట్‌ ‌సమావేశంలో ఎదురుదెబ్బ తగిలింది. కనీసంగా ఏడు మిత్రదేశాలు అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించాయి అంటూ ఒక రిపోర్ట్ ‌రాసారు. ‘‘బుష్‌, అధ్యక్షుడిగా తన చివరి నాటో సమ్మిట్‌ ‌సమావేశంలో పాల్గొని అమెరికా యూరోపియన్‌ ‌యూనియన్‌ (ఈయూ) సంబంధాలలో తన మార్కర్‌ ‌వేయాలని ప్రయత్నించారు. అయితే అతను కోరుకుంటున్నట్లు ఈయూ చేస్తే ఉక్రేనియన్‌.. ‌జార్జియన్‌ ‌ప్రజలలో ఇతర మాజీ సోవియట్‌ ‌రిపబ్లిక్‌ల ప్రజలలో యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌మీద వున్నా విశ్వాసం కోల్పోవటం జరుగురుంది. ఇది యూరోపియన్‌ ‌యునియన్‌ ఇష్టపడటం లేదు. అమెరికా అధ్యక్షుడు బుష్‌ ‌ప్రతిపాదించినట్టు ఈయూ చేస్తే రష్యా.. యూరోపియన్ల మధ్య సమస్యలకి దౌత్యపరమైన పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు మరింత సంక్లిష్టం అవుతాయి. అందుకే అమెరికా మిత్రపక్షాలు అయినా కూడా ఏడు దేశాలు అమెరికాను వ్యతిరేకించాయి’’ అని ఒక జర్మన్‌ ‌ప్రభుత్వ అధికారి నిజాయితీగా చెప్పినట్టు ఈ రిపోర్టులో వుంది.

ఇటువంటి రిపోర్టస్ ఇం‌టర్‌ ‌నెట్‌ ‌లో చాలా దొరుకుతాయి. ఈ రిపోర్టస్ ‌చెప్పే సారం ఒకటే. రష్యా… యూరోపియన్‌ ‌యూనియన్స్ ‌మధ్య వ్యాపార పరమైన వర్కింగ్‌ ‌సంభందాలు మెరుగ్గా వున్నాయి. దీన్ని సహించే పరిస్థితిలో అమెరికా లేదు. అందుకే నాటో అస్త్రంతో ఈ సంబంధాలు దెబ్బతీయాలి అనుకున్నది అమెరికా. ఇందుకు బిన్నంగా జర్మనీ రష్యాతో వాణిజ్య సంబంధాలు నెరపాలి అనుకోవటం కూడా స్పష్టం. దీనికి సంబందించిన బలమైన సాక్షం నార్డ్ ‌స్ట్రీమ్‌ 2 ఇస్తున్నది. ఇది 11 బిలియన్‌ ‌డాలర్ల ప్రాజెక్ట్. ఇది ప్రారంభం కాగానే దీని ద్వారా రష్యా గ్యాస్‌ ‌నేరుగా జర్మనీకి చేరిపోతుంది. ఈ ప్రాజెక్ట్ ‌పై అమెరికాకి..జర్మనీకి ఒకే విధమైన ఆలోచనలు లేవు. ఈ ప్రాజెక్ట్ ‌కి అమెరికా వ్యతిరేకం. అందుకే 2019లో అమెరికా ఈ ప్రాజెక్ట్ ‌ను నిర్మించడంలో నిమగ్నం అయిన కొన్ని కంపెనీలపై వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఈ ప్రాజెక్ట్ ‌కి అనుకూలం అయిన జర్మనీ అమెరికాకి కౌంటర్‌ ఇచ్చింది.

ఒక జర్మన్‌ ‌రాజకీయ నాయకుడు (గత సంవత్సరం) రష్యన్‌ ఎనర్జీ కంపెనీ గాజ్‌‌ప్రోమ్‌తో ప్రభుత్వ-మద్దతుగల ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి రష్యా గ్యాస్‌ను యూరప్‌కు తీసుకువెళ్లడం కోసం జరుగుతున్నా ప్రయత్నాలకు సహాయం చేసాడు. ఈ ప్రాజెక్ట్ ‌నిర్మాణంపై అమెరికా విధించే ఆంక్షలను నివారించడంలో మాస్కోకు సహాయం చేయడానికి ఓ జర్మన్‌ ‌రాజకీయ నాయకుడు చేసిన కృషి ఇది. ఈ మొత్తం చుస్తే ప్రస్తుత యుద్ధం వెనుక వున్నా మూలాలు మనకి స్పష్టంగా అర్ధం అవుతున్నది. ఇక పుతిన్‌ ‌విషయానికి వస్తే గత సోవియట్‌ ‌స్థాపన ఇతని లక్ష్యం అన్నటు జరుగుతున్నా ప్రచారాన్ని చూడాల్సి ఉంటుంది. దీని డొల్ల తనాన్ని అర్ధం చేసుకోవలసి ఉంటుంది. అసలు గత సోవియట్‌ ‌యూనియన్‌ అం‌టే తెలిసిన వాళ్ళు ఈ పోలికను తేకూడదు. ఎందుకంటే ఆనాటి నాయకుడు లెనిన్‌ ఒక పెద్ద దేశ స్థాపన కోరుకోవటం వెనుక ఒక మహత్తర లక్ష్యం వుంది. ఆ లక్ష్యం మనందరికీ తెలిసిందే భూమి మీద ఒక పెద్ద యెర్ర జెండా దేశాన్ని నిలపటం. ఇలా చేయటం ద్వారా ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వ వ్యవస్థ నమూనాను ప్రపంచ కార్మిక ప్రజల ముందు పెట్టాలి అనేది ఆనాటి లెనిన్‌ ‌లక్ష్యం. ప్రపంచ దేశాల శ్రామిక ప్రజల దృష్టిని ఆనాటి సోవియట్‌ ‌యూనియన్‌ ‌ద్వారా ఆకర్షించి, యెర్ర జెండాల దేశాల నిర్మాణం చేపట్టాలి అనే ఆకాంక్షను ప్రపంచ కార్మికులలో రగిలించాలి అనేది ఆనాటి మార్క్సిస్టు నాయకుడు లెనిన్‌ ‌లక్ష్యం. ఈ లక్ష్యానికి దరిదాపుల్లో కూడా పుతిన్‌ ‌నిలవలేడు అనేది స్పష్టం కదా.

ఈ విషయం పుతిన్‌ ‌నే ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నాడు. ఆయనే స్వయంగా లెనిన్‌ ‌ను విమర్శిస్తూ ఎన్నో వ్యాఖ్యానాలు చేసారు. నిరంకుశుడు అయిన రష్యా చివరి చక్రవర్తిని లెనిన్‌ ‌హయాంలో ప్రజలు మట్టు పెడితే ఈ చర్యను పుతిన్‌ ‌తప్పుపడతారు. ఒక నిరంకుశ పాలకుడు అయిన పుతిన్‌…‌లెనిన్‌ ‌కాలం గురుంచి ఇలా మాట్లాడటం షరామామూలే కదా. లెనిన్‌ ‌స్టాలిన్లు దూర దృష్టి లేకుండా రిపబ్లికన్లు విడిపోయే అవకాశం ఇవ్వడం వల్లనే ఈ రోజు రష్యా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నది అని గతాన్ని విమర్శించే పని పుతిన్‌ ‌నిరంతరాయంగా చేస్తున్నాడు. ఇలా చేయటం అంటే రష్యా ప్రజలు ధైర్య సాహసాలు ప్రదర్శించి తమ రక్తంతో రాసిన రష్యా గత చరిత్ర మీద పుతిన్‌ ‌దాడి చేస్తున్నారు.

అంటే సోవియట్‌ ‌యూనియన్‌ ‌రాజకీయ చరిత్ర మీద పుతిన్‌ ‌దాడి చేస్తున్నారు. నిజానికి నేటి రష్యాలో ఉన్న కాపిటలిజం ఆనాటి సోవియట్‌ ‌రష్యా ఘన చరిత్ర మీద దాడి చేస్తున్నది. కాపిటలిజం చేసే ఓ షరా మాములు సిగ్గులేని చరిత్ర వక్రీకరణ ఇది కదా. అయితే ఇక్కడ మనం గమనించాల్సినది మరోటి వుంది. అది పుతిన్‌ అతనితో వున్నా పెట్టుబడిదారులు చేసిన ఓ ప్రయత్నాన్ని చూడాల్సి ఉంటుంది. అదే ‘‘నాటో రష్యన్‌ ‌కౌన్సిల్‌’’ ఏర్పాటు. రష్యా ఎదుగుదలను నిలువరించేందుకు ఏర్పాటు అయిన నాటోలో రష్యా చేరాలి అనుకుకోవటం. ఈ ప్రయత్నం ఎందుకంటే రష్యాలోని పెట్టుబడిదారులు ఈ రూపంలో పాత యూరోప్‌ ‌దేశాలతో శాంతియుత ప్రయత్నం ద్వారా వ్యాపారం చేసుకునే ఓ ప్రయత్నం చేసారు దీనికి పుతిన్‌ ‌మద్దత్తు వుంది. ఈ ప్రయత్నం వలన పని జరగదు అని తేలిపోయాకనే క్రిమియాను రష్యా ఆక్రమించింది. అటుపై నేటి యుద్ధానికి తెర లేపింది.

ఆనాడు లెనిన్‌ ‌యూరోప్‌ ‌దేశాలను కలుపుకోవడం వెనుక మార్క్సిస్టు ఆలోచన ఉంది.ప్రపంచంలో సోషలిస్టు ప్రభుత్వం వున్నా పెద్ద దేశం స్థాపన అనే లక్ష్యం ఉంది ఆనాడు. మరి నేడో..? పుతిన్‌ ‌ముందు వున్నా లక్ష్యం ఏమిటి..? నేడు రష్యా పెట్టుబడిదారులకు కావలసింది ఆనాటి పాత సోవియట్‌ ‌దేశాల మార్కెట్లు అక్కడి ముడిసరుకులు. ఈ లక్ష్యం కోసం పుతిన్‌ ఆనాటి పాత సోవియట్‌ ‌యూనియన్‌ ‌పునః నిర్మాణం చేయాలి అనుకుంటున్నారు. లెనిన్‌ ‌నిర్మించిన సోవియట్‌ ‌యూనియన్‌ ‌కి పుతిన్‌ ‌నిర్మిచాలి అనుకుంటున్నా సోవియట్‌ ‌యూనియన్‌ ‌కి అసలు పోలిక ఉందా..? ఈ రెంటికి పోలిక తేవటం అంటే లెనిన్‌ ‌ను అవమానించటం కదా..? పుతిన్‌ అం‌తిమ లక్ష్యం ఏమిటన్నది ఇంకా తేలటం లేదు అన్న ప్రచారంలో వాస్తవం ఉందా..? పుతిన్‌ అమెరికా ఎన్నికలలో ట్రాంప్‌ ‌కి సహాయం చేయటం ద్వారా ట్రాంప్‌ ‌గెలిచారు అనే మాట అంతర్జాతీయ సమాజంలో వుంది.

ఇలా చేయటం ద్వారా పుతిన్‌ అమెరికా కాన్సంట్రేషన్‌ ‌యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌మీద తగ్గించే ప్రయతం చేసి రష్యన్‌ ‌పెట్టుబడిదారులకు వెన్ను దన్నుగా నిలిచారని అంతర్జాతీయ వార్తాసంస్థలు కోడై కూశాయి. అప్పుడు అలా ప్రయత్నం చేసి పుతిన్‌ ‌రష్యా పెట్టుబడిదారులను దిల్‌ ‌కుష్‌ ‌చేసారు. ఇప్పుడు బైడాన్‌ ‌గెలుపు తర్వాత పరిస్థితి తారుమారు అయినది. మళ్ళీ అమెరికా యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌మీద పట్టు పెంచుతూ ఉక్రేన్‌ ‌కి పెద్ద ఎత్తున ఆర్ధిక సహాయం అందించింది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ ‌ను నిలబెట్టేందుకు, ×వీఖీ ఉక్రెయిన్‌ ‌కి మద్దతుగా నిలిచింది. వరల్డ్ ‌బ్యాంకు, అమెరికా నుంచి వందల కోట్ల డాలర్లు ఉక్రెయిన్‌ ‌కు అందాయి. ఉక్రెయిన్‌ ‌కి అమెరికా భారీగా రుణ పూచీకత్తులు, సైనిక సహాయం అందించింది. ఇదంతా యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌మీద అమెరికా పట్టు పెంచుకోవటనికి జరిగిన ప్రయత్నాలు.

ఇదంతా ఎందుకు..? రష్యా నుంచి బాల్టిక్‌ ‌సముద్ర గర్భం ద్వారా జర్మనీ వరకు వేసిన 750 మైళ్ళ పైప్‌ ‌లైన్‌ ‌నిర్మాణం గత సెప్టెంబర్‌ ‌లోనే పూర్తయింది. దీని ద్వారా జర్మనీ నాలుగోవంతు ఇంధన అవసరాలు తీరుతాయి. అంటే జర్మనీకి కావలసిన సగం గ్యాస్‌ ‌రష్యా నుంచి అందుతుంది. అందుకుగాను ఈ పైప్‌ ‌లైన్‌ ఉపయోగ పడుతుంది. దీనికి జర్మనీ పూర్తిగా అనుకూలం అయినా ఉక్రెయిన్‌ ‌రష్యా యుద్ధం వలన జర్మన్‌ ‌పార్లమెంటు దీనికి పచ్చ జెండా ఊపకుండా ఆగిపోవలసి వచ్చింది. దీనితో అమెరికా కడుపు నిండింది. ఇదంతా గమనించిన పుతిన్‌, ‌రష్యాకి చైనాకి మంచి సంబంధాలు నెలకొని వున్నా పరిస్థితిని ఉపయోగించుకోవాలి అనుకున్నట్టు కనిపిస్తున్నది. చైనా అమెరికాకి గ్లోబల్‌ ‌స్థాయిలో పోటీ ఇవ్వగలదు.. రష్యా ఒక రీజినల్‌ ‌పవర్‌ ‌గా ఉన్నది. రష్యా ఈ పరిస్థితిని అనుకులమైనదిగా భావించి, యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌లో వున్నా పెట్టుబడిదారులకు యుద్ధం ద్వారా మీరు అమెరికాని వదిలి ఇటు రావచ్చు అనే సంకేతాలు రష్యా పంపింది. పుతిన్‌ ‌లక్ష్యం ఇది అని మనం ఎందుకు భావించకూడదు..?

వ్యాపారం కోసం దేశాలు ఇలా యుద్దానికి దిగటం అనేది చూసినప్పుడు ఒక్క రష్యానే కాదు, అమెరికా, చైనాలు కూడా దోషులే కదా..? సోవియట్‌ ‌యూనియన్‌ ‌పతనం తర్వాత ప్రపంచంకి పెద్దన్న నేనే అని అమెరికా అవకాశం వున్నా ప్రతి దేశంలోకి దూరి శాంతి పేరుతో ఆయుధాలు అమ్మి సొమ్ములు పోగు చేసుకుంది. అలాగే యుద్ధాల వలన అమెరికా ప్రజలు విసిగి వేసారిన పరిస్థితిని ఆ దేశం మూట గట్టుకుని వుంది. బహుశా ఈ నేపథ్యంలో అమెరికా పెత్తనానికి సవాలు విసిరే పరిస్థితి ప్రపంచం చూస్తున్నది. బహుశా ప్రపంచం రెండు లేదా మూడు కూటములుగా విడిపోటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏమో ఈ యుద్ధం ఈ పరిణామానికి మరింత తోడ్పడుతుందేమో…? కాలమే దీనికి సమాధానము ఇవ్వగలదు.

Leave a Reply