Take a fresh look at your lifestyle.

టిపిసిసి ఎంపిక కాంగ్రెస్‌లో చిచ్చులేపనుందా?

కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక దాదాపు ఖరారైపోయిందంటున్నారు. ఏ నిమిషంలోనైనా ఆ పార్టీ అధిష్టాన వర్గం పేరును ప్రకటించవొచ్చన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆలస్యంగానైనా అధ్యక్ష స్థానానికి ఎంపిక చేసిన వ్యక్తి పట్ల ఆ పార్టీ నాయకత్వమంతా ఒకతాటిపై ఉంటుందా అన్నదే ఇప్పుడు రాష్ట్రంలో అలజడిలేపుతున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో  అధ్యక్షుల నియామకాలు చేసిన ఏఐసిసికి తెలంగాణలో పార్టీ చీఫ్‌ను ఎంపిక చేయడం మాత్రం తలనొప్పిగా తయారైంది. కరవమంటే కప్పకు కోపం.. విడువ మంటే పాముకు కోపమన్న చందంగా అధ్యక్షుడి పేరు ప్రకటించిన వెంటనే ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వొస్తుందోనని అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నది. కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే ఏ విషయాన్ని అయినా తొందరగా తేల్చకుండా నానబెట్టడం అలవాటన్న పేరుపడ్డది.

ఈ విషయంలో కూడా అనేక పర్యాయాలు అధ్యక్షుడి ప్రకటన చేస్తున్నట్లే టెన్షన్‌ ‌క్రియేట్‌ ‌చేయడం, ఆతర్వాత వెనక్కు తగ్గుతూ వొస్తుండడం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పరాభవాలను మూటకట్టుకోవడంతో పార్టీ అధ్యక్షస్థానంలో ఉన్న కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి ఇక ఎంత మాత్రమూ తాను రాష్ట్ర పార్టీకి కెప్టన్‌గా వ్యవహరించలేనని చేతులు ఎత్తే•యడంతో ఏర్పడిన ఈ ఎంపిక ప్రక్రియ నెలల తరబడి సాగుతూపోతున్నది. ఈ స్థానం కోసం చాలాకాలంగా చాలామంది నాయకులు ఆశ పెట్టుకున్నారు.

రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఎన్నికలన్నీ పూర్తికావడం, ఇక 2023లో రానున్న శాసన సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కాంగ్రెస్‌కు పోయిన ప్రతిష్టను దక్కించుకోవాలన్నది ఏఐసిసి ఆలోచన. అందుకు రాష్ట్రంలోని అధికార టిఆర్‌ఎస్‌ను ఢీ కొనగల సత్తా ఉన్న నాయకుడికే పిసిసి పగ్గాలివ్వాలన్నది అధిష్టానవర్గం ఆలోచన. అయితే అందుకు తామంటే తాము అర్హులమంటూ ఢిల్లీలో మంత్రాంగాన్ని నడుపుతున్న నాయకుల వొత్తిడిని అధిష్టానం తట్టుకోలేకపోతున్నది. ఈ పదవిని ఆశిస్తున్నవారిలో  రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారెక్కువగా ఉండగా, ఎప్పుడూ ఆ వర్గాల వారికే పదవులు అప్పగిస్తే పార్టీని అంటిపెట్టుకుని ఇంతకాలంగా ఉన్న తమ పరిస్థితేమిటని బిసి నాయకులు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు.

రాష్ట్రంలో 64 శాతంమున్న తమకే ప్రాధాన్యత నివ్వాలని వారంటున్నారు. అలాగే ఎస్సీ, మైనార్టీ నాయకులతోపాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా తమ శక్తిసామర్థ్యాలను అధిష్టానం ముందు ఏకరువు పెట్టారు. ఇంకా పెడుతూనే ఉన్నారు. అయితే అధిష్టానం ఇప్పటికే ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వొచ్చినట్లు తెలుస్తున్నది. ఇక పేరు ప్రకటనే తరువాయి. ఎవరి పేరును ప్రకటించే అవకావాలున్నాయన్న విషయం కూడా పార్టీ వర్గాలు ఇంచుమించుగా అర్థం చేసుకుంటున్నాయి. అయినా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తమ పూర్వ సంప్రదాయం ప్రకారం సీల్డ్ ‌కవర్‌లో ఎవరి పేరును దాచి పంపిస్తారన్న విషయంలో ఇంకా కొంత చర్చ జరుగుతున్నది.

ఇంచుమించుగా ఆ పార్టీ ఎంపి, పిసిసి వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌  ‌రేవంత్‌రెడ్డికే అధిష్టానం పట్టం కట్టబోతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతున్నది. వొస్తున్న వార్తల ప్రకారం మంగళవారం నాడే రేవంత్‌రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటన రావాల్సి ఉంది. అయితే రేవంత్‌రెడ్డికి ఆ పదివినివ్వడాన్ని పార్టీలోని మరికొందరు మొదటి నుండీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇతర పార్టీల నుండి వొచ్చిన వారిని అందలం మీద కూర్చోబెట్టడమంటే పార్టీని దశాబ్దాలుగా అంటిబెట్టుకుని ఉన్నవారిని అవమానించినట్లేనని కొందరు సీనియర్‌లు అధిష్టానంపై అలుగుతున్నారు.

వాస్తవంగా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, ఇప్పుడు రాహుల్‌గాంధీ నాయకత్వాల్లో పార్టీ వీడకుండా పార్టీకి లాయల్టీగా ఉంటున్నవారున్నారు. వారిలో ఎవరి సమర్థతనైనా పరిగణనలోకి తీసుకుని వారికి పార్టీ పగ్గాలు అప్పగించకుండా ఇతర పార్టీల నుండి వొచ్చినవారిని బాస్‌గా నియమించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. వీరిలో వి. హన్మంతరావు ముందువరుసలో ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పిసిసి అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఎంపిగా పార్టీకి సేవచేసిన వ్యక్తి. అన్నిటికన్నా ఇందిరాగాంధీ కుటుంబానికి మొదటినుండీ లాయల్‌గా ఉంటూ వొస్తున్న వ్యక్తి. ఆయన రేవంత్‌ ‌రెడ్డి పేరు వినిపించినప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టిఆర్‌ఎస్‌ ‌నుండి ఈటల రాజేందర్‌ను పంపించినప్పుడు ఆయన ఆత్మగౌరవం అంశాన్ని లేవనెత్తినట్లు, హన్మంతరావు కూడా రేవంత్‌రెడ్డికి ఆ పదవి అప్పగిస్తే సీనియర్‌ల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లేనని చెబుతున్నారు.

కేసుల్లో ఉన్న వ్యక్తికి ఈ పదవిస్తే రేపు జైలుకు వెళ్ళినప్పుడు పార్టీ పరిస్థితేమిటంటూ ఆయన అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. తానిలా ప్రశ్నిస్తున్నందుకు తనను పార్టీనుండి బయటికి పంపాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాగా ఈ పదవికోసం పోటీ పడుతున్న వారిలో కొందరిని పార్టీ ఎదోవిధంగా బుజ్జగించినా, కొందరు ఇంటికే పరిమితమయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు జ్యోసం చెబుతున్నారు. కాగా ఇంకొందరు ఎన్నాళ్ళయినా తమ పరిస్థితి ఇంతేనని పక్కదారి పట్టకపోరంటున్నారు.

ఇప్పటికే చాలామంది కాంగ్రెస్‌ ‌నుండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌లోకి, దేశంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలోకి మారిపోయారు. అదిష్టానం రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించడంతోనే తెలంగాణలో కూడా ఏపి మాదిరిగా కాంగ్రెస్‌ ‌పరిస్థితి మారే అవకాశం లేకపోలేదని వారు విశ్లేషిస్తున్నారు. ఈ ఉపద్రవాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం ఎలా తట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply