Take a fresh look at your lifestyle.

సింగరేణిలో కేంద్రం వాటాను రాష్ట్రం కొనుగోలు చేస్తుందా ?

బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు, ఉద్యోగులు మూడు రోజులపాటుచేపట్టిన సమ్మెలో దాదాపు ఎనభై శాతం మంది పాల్గొనడంతో విజయవంతమైందంటున్నాయి కార్మిక సంఘాలు. ఒప్పంద కార్మికులతోపాటు, సివిల్‌పనులు నిర్వహించే కార్మికులు కూడా సంఘీభావం తెలపడంతో సమ్మె వంద శాతం విజయవంతమైనట్లు కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో కోల్‌ ఇం‌డియా, సింగరేణి పరిధిలోని సుమారు 50 బొగ్గు గనులను ప్రైవేటికరించే ఉద్దేశ్యంగా వేలం వేస్తున్న దరిమిలా దాన్ని నిలిపివేయాలంటూ జాతీయ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకిస్తున్న వాటిలో ఏఐటియుసీ, ఐఎన్‌టియూసి, హెచ్‌ఎంఎస్‌, ‌సిఐటియు, బిఎంఎస్‌, ఇఫ్టూ తదితర సంఘాలున్నాయి. ఈ సంఘాల పిలపుమేరకు కార్మికులంతా గత మూడు రోజులుగా సమ్మెబాట పట్టడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. తెలంగాణ విషయానికొస్తే సింగరేణి పరిధిలోని ఆరు జిల్లాల్లోని పన్నెండు ఏరియాల్లో సమ్మె విజయవంతంగా కొనసాగింది. అయితే రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన టిఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం, టిబిజికేఎస్‌ ‌సంఘాలకు చెందిన కార్మికులు మాత్రం ఒక్క రోజు సమ్మెతో ముగించారు. కాగా సింగరేణిని ప్రేవేటీకరించాలనుకోవడం చాలా అన్యాయమైన విషయమని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. దేశంలోని చాలా బొగ్గుగనులు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయే గాని, వాటివల్ల ప్రభుత్వాలకు ఎలాంటి నష్టంలేకపోయినా వాటిని ప్రైవేటీకరించాలను కోవడం అవివేకమంటున్నాయి రాజకీయ పార్టీలు. తెలంగాణ విషయానికి వొస్తే స్వాతంత్య్రం రాకముందు నుండి కూడా సింగరేణి ప్రభుత్వ నియంత్రణలో ఉంటూ వొచ్చింది. వాస్తవంగా బ్రిటీషు కాలంలో దీని నిర్మాణం జరిగినా, తెలంగాణ ప్రాంతంలోమాత్రం హైదరాబాద్‌ ‌రాష్ట్రాన్ని పాలించిన నిజాం ప్రభువుల ఆధీనంలోనే ఉండింది. భారత దేశంలోని మిగతా బొగ్గుగనులు ప్రైవేటు చేతుల్లో కొనసాగుతున్నా ఇక్కడ మాత్రం నేటికీ ప్రభుత్వ పరిధి లోనే ఈ సంస్థ కొనసాగుతున్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేటుచేతులకు అప్పగిస్తే ఒక విధంగా ఇటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని, ప్రజాస్వామ్యాన్ని ప్రైవేటు శక్తులు శాసించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది భారత్‌ ‌లాంటి ప్రజాస్వామ్య దేశానికి అత్యంత ప్రమాదకరమైందంటున్నాయి ప్రతిపక్షాలు. ప్రభుత్వరంగ సంస్థలను క్రమేణ నిర్వీర్యంచేయడానికే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నదని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఒకానొక దశలో సింగరేణిని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ సంస్థకు ఎక్కడలేని ప్రాధాన్యమొచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంస్థ లాభాలబాట పట్టి, దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థగా విలసిల్లుతోంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను చేపట్టడంద్వారా కోల్‌ఇం‌డియాకన్నా సమర్థవంతమైన సంస్థగా రూపుదిద్దుకుంటున్నది.. ఈ సంస్థ పనితీరుకు మెచ్చి సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నిర్ణయంతీసుకున్న దరిమిలా బోనస్‌ ‌రూపంలో సంస్థలోని కార్మికుల ఖాతాల్లో లక్షలాది రూపాయలు చేరిపోయాయి. ఇదిలాఉంటే ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొరోనాను ఎదుర్కునే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందరివేతనాల్లో కోత విధించినా సింగరేణి కార్మికులకు మాత్రం మొత్తం వేతనాలను చెల్లించిందంటేనే ప్రభుత్వం దృష్టిలో ఆ సంస్థకున్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతున్నది. అలాగే కొరోనా బాదితులకోసం కార్మికులు, యాజమాన్యం కలిసి సుమారు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నిధికి అందజేశారంటే ఆ సంస్థ ఆర్థిక పటిష్టతనుకూడా అర్థంచేసుకోవచ్చు. విద్యుత్‌ ఉత్పాదక రంగంలోకి కూడా అడుగు పెట్టిన ఈ సంస్థ సిమెంట్‌, ‌హెవీ వాటర్‌ ‌ప్లాంట్‌, ‌స్పాంజ్‌ ఐరన్‌, ‌నేషనల్‌ ‌మినరల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పోరేషన్‌ ‌యూనిట్లకు బొగ్గు సరఫరా చేస్తున్నది.. ఇక్కడ లభిస్తున్న నాణ్యమైన బొగ్గుకు డిమాండ్ ‌కూడా బాగా పెరిగింది. ప్రభుత్వరంగ సంస్థగా ఇంత చరిత్ర ఉన్న ఈ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానిది 51 శాతం వాటాకాగా, కేంద్ర ప్రభుత్వానిది 49 శాతం వాటా ఉంది. సింగరేణి వాణిజ్య కార్యకలాపాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారే పర్యవేక్షిస్తుంటారు. కాని బొగ్గు కేటాయింపులను మాత్రం కేంద్రం చేస్తుంది. అయితే 2014 లో కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థల్లోఉన్న తన వాటాలను ఉపసంహరించుకుంటున్నట్లు చేసిన ప్రకటనపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సింగరేణి ఉనికిపై ఆనాడు స్పందిస్తూ అవసరమైతే కేంద్రం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలుచేస్తుందని, దానివల్ల సింగరేణి ఉత్పత్తిచేసే బొగ్గుపై రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అజమాయిషి ఉంటుందన్నారు. ఆమేరకు అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఆనాడే సంబంధిత అధికారులను సిఎం ఆదేశించారుకూడా. ఇప్పుడు కేంద్రం ప్రైవేటు వారికి అప్పగించాలనుకున్నప్పుడు ఆ వాటాను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలుచేయకూడదని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Leave a Reply