Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ ఎత్తివేస్తారా…కొనసాగిస్తారా..?

ఏప్రిల్‌ ‌పద్నాల్గవ తేదీతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ ‌డౌన్‌ ‌సమయం పూర్తికానుంది. అయితే మరికొంతకాలం దీన్ని కొనసాగిస్తారా లేక ఎత్తివేస్తారా అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. ఏప్రిల్‌ 14 ‌తర్వాత దేశమంతా పూర్వ స్థితిలో కొనసాగుతుందా, ఇన్ని రోజులుగా ప్రభుత్వం విధించిన నిబంధనలను సడలిస్తారా? విమానాలు, రైళ్ళు, బస్సులు యథావిధిగా నడుస్తాయా? లాంటి పలు సందేహాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండువందల దేశా)కు విస్తరించిన కొరోనా వైరస్‌ను అరికట్టడంలో భాగంగా భారత ప్రభుత్వం మార్చ్ 25 ‌నుండి దేశ వ్యాప్తంగా లాక్‌ ‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంతర్జాతీయ వాయుమార్గంతో పాటు, దేశంలోని విమానయానాన్ని, ఉత్తర, దక్షిణ రైళ్ళ రాకపోకలను పూర్తిగా స్థంబింపచేశారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు నిజంగానే ఈ నిబంధనలు అమలులోకి తీసుకువచ్చేముందు దేశ ప్రజలకు కేవలం నాలుగైదు గంటల సమయమే ఉండింది. దాని పరిణామాన్ని తెలుసుకునే సమయం దేశప్రజలకు లేకుండాపోయింది. దీంతో ఎక్కడి ప్రజలు అక్కడే హౌజ్‌ అరెస్ట్ అయినట్లైంది. ఎవో పనులమీద తమ గ్రామం, తమ నగరాన్ని విడిచి వెళ్ళినవారు తిరిగి తమ ఇంటికి చేరుకునే సమయం లేకుండాపోయింది. ఉపాధికోసం వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలకు వెళ్ళినవారికి యావత్‌దేశం ఇంతగా స్థంభించి పోతుందని ఊహించలేకపోయారు. ఉండేందుకు నీడ, తినేందుకు తిండిలేకుండా పోయింది. బయట అడుగుపెడితే పోలీసు లాఠీలు ప్రళయతాండవం చేస్తున్నాయి. పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, అయినవారికి దూరంగా మరికొంతమంది ఇలా ప్రజలు గడచిన పద్నాలుగురోజులుగా అనేక అవస్థలకు గురి అవుతున్నారు. కొరోనా వారిని ఒక విధంగా కారాగారవాసం చేయిస్తున్నదన్న భావనలోఉన్నారు. ప్రచార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వింటుంటే ఏం ముట్టుకుంటే ఏమవుతుందో, ఎవరితో మాట్లాడితే ఎం ఆంటుకుంటుందోనని ప్రజలు భయంభయంతో ఇంతకాలం ఇళ్ళలోనే గడుపుతున్నారు. అయితే లాక్‌ ‌డౌన్‌ ‌గడువు మరో ఆరు రోజుల్లో పూర్తికానుండడంతో..హమ్మయ్య.. ఏదో విధంగా ఈ ఆరు రోజులు గడిపితేచాలు.

ఇక తమ కష్టాలు తీరిపోనున్నాయని, తమతమ ఇండ్లకు చేరుకోవచ్చని లక్షలాది జనం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌గడువు ముగిసిన తెల్లవారి నుండే రైళ్ళు, విమాన రాకపోకలు మొదలవుతాయని అదుర్దాపడుతున్నారు. తమ టికట్లను రిజర్వేషన్‌ ‌చేయించుకునేందుకు ఇప్పటినుండే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ ‌డౌన్‌ ‌గడువు నిజంగానే ఏప్రిల్‌ 14‌తోనే ముగుస్తుందా ? మరికొంతకాలం కొనసాగుతుందా అన్న మీమాంస ఇప్పుడు వారిని వేధిస్తున్నది. దేశంలో తాజా పరిస్థితులను పరిశీలిస్తే లాక్‌ ‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించాల్సిన అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాని, కేంద్ర ప్రభుత్వం నుండి ఈ విషయంలో ఎలాంటి స్పందనలేదు. తాజాగా జరిగిన కేంద్ర క్యాబినెట్‌ ‌సమావేశం కూడా దీనిపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఒకవేళ రైళ్ళ రాకపోకలను పునరుద్ధరించినా దేశవ్యాప్తంగా నిలిపివేయబడిన 13523 రైళ్ళను ఒకసారే ప్రారంభించకపోవచ్చనుకుంటున్నారు. ఎందుకంటే దేశంలో నేటికి కొరోనా బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతూ ఉండడమే. ఒకేసారి రైళ్ళన్నిటినీ ప్రారంభిస్తే ప్రయాణీకులతో రైళ్ళన్ని కిటకిటలాడుతాయి. అందులో ఎవరికి కొరోనా వైరస్‌ ‌సోకిందన్నది గుర్తించడం కష్టం. అందుకు అంచల వారీగా రైళ్ళను పురనరుద్ధరించడంతోపాటు ప్రయాణీకులదరికీ థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ‌చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే కొరోనా వైరస్‌ ‌మహమ్మారిని అడ్డుకోవాంటే లాక్‌ ‌డౌన్‌ ఒక్కటే మందని ప్రపంచమంతా ప్రజలను ఇండ్లకే పరిమితం చేసినప్పటికీ ఇటీవల పలు కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థను పునరుద్ధరించడం తీవ్రతప్పిదమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భయంకరమైన కొరోనా మరణాలను తగ్గించడంలో పడిన కష్టమంతా లాక్‌ ‌డౌన్‌ ఎత్తివేయడం ద్వారా విఫలమవుతుందన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అదే అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తపర్చారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్లు చెప్పుకొచ్చారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని బట్టి మరికొంతకాలం కొనసాగించడమే శ్రేయస్కరమంటూ ఆయన ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు కూడా. లాక్‌డౌన్‌ ఎత్తివేయడమన్నది చిన్న విషయమేమీ కాదు. ఒకసారి ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తే ప్రజలను కంట్రోల్‌ ‌చేయడం సాధ్యం కాదు. అప్పుడు జరిగే నష్టం ఊహించరానిదిగా ఉంటుందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తపర్చారు. మహారాష్ట్ర కూడా మరికొంతకాలం లాక్‌ ‌డౌన్‌ను పొడిగించాలన్న ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తున్నది. దేశంలో ఇప్పుడు అత్యధికంగా కొరోనా బారిన పడిన వారి సంఖ్య అక్కడ ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. అలాగే మరికొన్ని రాష్ట్రాలు కూడా డైలమాలో ఉన్నాయి. ఒకవేళ కేంద్రం ప్రమేయం లేకుండా రాష్ట్రాలే పొడిగింపును అమలు చేస్తే ఎంతవరకు అమలవుతుందన్నది కూడా సందేహమే. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే ఎత్తివేయడమా, కొనసాగించడమా అన్నది ఆధారపడి ఉంది. అయితే ఏప్రిల్‌ 12‌వ తేదీనాటికి దేశంలో కొరోనా ప్రభావంపై ఒక అవగాహన వచ్చే అవకాశం ఉండడంతో అప్పుడే కేంద్రం ఏదో ఒక ప్రకటన చేయవచ్చని తెలుస్తున్నది.

Leave a Reply