Take a fresh look at your lifestyle.

మద్య నిషేధం ప్రభావం నితీశ్‌ ‌విజయావకాశాలను దెబ్బతీస్తుందా?

బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌ ‌ప్రవేశపెట్టిన మద్యనిషేధం ఈసారి ఆయనకు పదవికి ఎసరు తేనున్నదా? ఆయన అన్ని రాష్ట్రాల కన్నా బీహార్‌ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి తీసుకున్న నిర్ణయం పట్ల నాలుగేళ్ళ క్రితం అన్ని వర్గాలవారూ హర్షం వ్యక్తం చేశారు. లోక్‌ ‌నాయక్‌ ‌జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌శిష్యునిగా రాజకీయాల్లో ప్రవేశించిన నితీశ్‌ ‌కుమార్‌ ‌జయప్రకాశ్‌ ఆశయాలను అమలు జేస్తున్నందుకు ఆయనను కీర్తించారు. అయితే, సంపూర్ణ మద్య నిషేధం ఒక ఆదర్శంగా మిగిలిపోయింది. ఏ రాష్ట్రంలోనూ అది విజయవంతం కాలేదు. ప్రభుత్వాలను నడిపిస్తున్నది మద్యం మాఫియాయేనని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌, ఆయన భార్య రబ్డీ దేవి ముఖ్యమంత్రులుగా వ్యవహరించినప్పుడు మద్యం అమ్మకాలు పెరిగి మాఫియా వర్గాల పట్టు పెరిగింది. ఆ వర్గాల పట్టును సడలించడం కోసమే నితీశ్‌ ‌కుమార్‌ ఈ ‌నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో దొంగ వోట్లు వేయించేందుకూ, నల్లధనాన్ని తెలుపుచేసుకునేందుకు మద్యం మాఫియా వర్గాలు ప్రయత్నిస్తుంటాయి. వారి మద్దతు ఉన్న పార్టీలకే విజయం లభిస్తుంది. ఈ పద్దతి పోవాలన్న ఆకాంక్ష అందరిలోనూ ఉన్నప్పటికీ, నిషేధం అమలు జరిపే యంత్రాంగం కూడా మామూళ్ళకు అలవాటు పడిపోవడం వల్ల ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. బీహార్‌ ఎన్నికలు దశలవారీ పోలింగ్‌ ‌సందర్భంగా మద్యం అమ్మకాల అంశం చర్చనీయాంశం అయింది.

చాలా చోట్ల మద్యం నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మహిళలు మద్య నిషేధం వల్ల తమ జీవితాల్లో వెలుగు ప్రసరిస్తుందని అనుకున్నామనీ, కానీ, నిషేధం వొచ్చిన తర్వాత తమ కుటుంబాల్లో చిచ్చు రగిలిందని వాపోతున్నారు. మద్యం ధరలను పెంచడం ద్వారా అమ్మకాలను నియంత్రించవొచ్చన్న ప్రయోగం కూడా విఫలమైంది. ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం మద్యం అమ్మకాలకు ముకుతాడు వేసేందుకు ధరలు పెంచింది. కానీ, దాని వల్ల విమర్శలు తప్ప ప్రయోజనం కనిపించకపోవడంతో ధరలను తగ్గించడం ప్రారంభించింది. మద్య నియంత్రణను తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు అమలు జేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించారు. ఆయనకు కూడా అది సాధ్యం కాలేదు. ఆయన తర్వాత అధికారాన్ని చేపట్టిన నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రంలో పర్మిట్ల పద్దతిని ప్రవేశపెట్టారు. వైద్యుల పర్మిట్లతో మద్యం అమ్మకాలు హాస్యాస్పదం అయింది. ఆ తర్వాత బార్లకు తలుపులు బార్లా తెరిచారు. బీహార్‌లో కల్లుపై కూడా నిషేధం కొనసాగుతుండటంతో సంప్రదాయకంగా కల్లుగీత వృత్తిపై జీవించేవారు ఉపాధి కోల్పోయారు. కల్లుపై నిషేధం వల్ల గీతపనివారు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వారంతా నితీశ్‌కి వ్యతిరేకంగా పని చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆర్‌ ‌జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌, ఆయన భార్య రబ్డీ దేవి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మద్యం మాఫియాలే రాష్ట్ర రాజకీయాలను నడిపించేవి. ఇప్పుడు ఆ వర్గాలన్నీ లాలూ కుమారుడు, ఆర్‌జెడి నాయకుడు తేజస్వి యాదవ్‌కి మద్దతు ఇస్తున్నారు. ఈ కారణంగానే తేజేస్వి యాదవ్‌ ఇటీవల ఎన్నికల ప్రచారంలో నితీశ్‌పై ధ్వజమెత్తుతూ ప్రసంగాలు చేశారు. నిజానికి నితీశ్‌ ‌సీనియారిటీ ముందు తేజస్వి ఏ విధంగానూ సరిపోలని వాడు. కేబినెట్‌ ఆం‌గ్ల పదం స్పెల్లింగ్‌ ‌కూడా పలకలేని తేజస్వి ఇంజనీరింగ్‌ ‌పట్టభద్రుడైన నితీశ్‌ని విమర్శించడం వింతగా ఉందని ఇటీవల జనతాదళ్‌ ‌యువ నాయకుడు చేసిన వ్యాఖ్యలో నిజమెంతో ఉంది. నితీశ్‌ ‌కుమార్‌ ‌తీసుకున్న నిర్ణయాలన్నీ ఆదర్శప్రాయమని అనలేం కానీ, జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌శిష్యరికం వల్ల ఆయన ఆదర్శవంతమైన పాలనను అందించేందుకు శాయశక్తులా కృషి చేశారు. చేస్తున్నారు. అయితే, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు సుశీల్‌ ‌కుమార్‌ ‌మోడీ వొత్తిడి కారణంగా నితీశ్‌ ఇష్టం లేకపోయినా కొన్ని నిర్ణయాలను తీసుకున్నట్టు వార్తలు వొచ్చాయి. నితీశ్‌ని గద్దె దింపేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా కూడా లోక్‌ ‌జనశక్తి పార్టీతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వొచ్చాయి. ఈ పార్టీని ఇటీవల కన్నుమూసిన కేంద్ర మంత్రి రామవిలాస్‌ ‌పాశ్వాన్‌ ‌స్థాపించారు.

ఆయన బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏలో నితీశ్‌ ‌మాదిరిగా సహ భాగస్వామి అయినప్పటికీ, జనతాదళ్‌(‌యు) వోట్లను గండికొట్టేందుకు ప్రయత్నించేవారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆయన కుమారుడు చిరాగ్‌ ‌పాశ్వాన్‌ ‌బహిరంగంగానే నితీశ్‌పై నిప్పులు కురిపిస్తున్నారు. నితీశ్‌ ‌కారణంగానే తాను ఎన్‌డిఏ నుంచి బయటకు వొచ్చాననీ, ఈ ఎన్నికల్లో నితీశ్‌ని గద్దె దించడమే తన లక్ష్యమని చిరాగ్‌ ‌బహిరంగంగానే ప్రకటించారు. చిరాగ్‌కు అమిత్‌ ‌షా ఆశీస్సులున్నాయని జనం బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అయితే, అవన్నీ కట్టుకథలనీ, బీజేపీ నితీశ్‌నే సమర్థిస్తోందని అమిత్‌ ‌షా పదే పదే వివరణ ఇవ్వాల్సి వొచ్చింది. ఈ నేపథ్యంలో నితీశ్‌ని దెబ్బతీసేందుకు బీహార్‌ ‌బీజేపీలో ఒక వర్గం తీవ్రంగా యత్నిస్తోందని ఆ వర్గానికి బీజేపీ అగ్రనాయకుల అండదండలున్నాయని కథనాలు వెలువడ్డాయి. నితీశ్‌ని ఇరుకున పెట్టేందుకు చిరాగ్‌ ‌పాశ్వాన్‌, ‌సుశీల్‌ ‌మోడీ, అటు తేజస్వీ ప్రతి సందర్భాన్నీ వినియోగించుకుంటున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్‌ ‌సింగ్‌ ‌రాజ్‌ ‌పుట్‌ ‌కేసును సీబీఐకి అప్పగించాలన్న ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధ్వజమెత్తారు. ఇప్పుడు మద్య నిషేధాన్ని ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వినియోగించుకున్నారు. ఇది ఆయన విజయావకాశాలను ఎంత వరకూ దెబ్బతీస్తుందో ఫలితాలు తేల్చనున్నాయి. బీజేపీ తనకు వ్యతిరేకంగా పని చేసిందన్న అనుమానం నితీశ్‌కి ఉంది. అందుకే, మళ్ళీసారి పోటీ చేయనని ఆయన చెప్పుకోవల్సి వొచ్చింది.

Leave a Reply