Take a fresh look at your lifestyle.

రాష్ట్ర రాజకీయాలకు ‘మునుగోడు’ ఎన్నిక దిక్సూచీ కానుందా?

మునుగోడు ఉప ఎన్నిక భవిష్యత్‌లో రాష్ట్ర రాజకీయాలను శాసించేదిగా కనిపిస్తున్నది. రాష్ట్ర రాజకీయాలిప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతున్నా, జాతీయ రాజకీయ పార్టీల దృష్టి అంతా ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఈ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్‌ ‌విడుదల కాకముందే ఇక్కడి రాజకీయాలు వేడందుకున్నాయి. ఎవరిని కదిలించినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్‌, ‌బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీల మధ్యనే పోటీ తీవ్రతరం కానుంది. తమ సిట్టింగ్‌ ‌స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ ‌తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రాన్నే తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనుకుంటున్న బిజెపి ఏ ఒక్క అవకాశాన్ని వొదులు కోవద్దన్నట్లుగా తన సైన్యాన్నంతా ఇక్కడికి తరలిస్తోంది.

ఇక అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఈ స్థానం గెలువటమన్నది సంఖ్యాపరంగా అంతగా అవసరంలేనప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ స్థానాన్ని ఇప్పుడు గెలుచుకోలేకపోతే దాని ప్రభావం త్వరలో రానున్న శాసనసభ ఎన్నికలపైన పడుతుందన్న భయం లేకపోలేదు. అందుకు ఆరునూరైనా ఈ స్థానం గెలిచి తీరాల్చిందేనన్న పట్టుదలతో ఉంది. దీంతో గతంలో ఈ స్థానాన్ని గెలిచుకున్న కాంగ్రెస్‌ ‌నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి, బిజెపిలో చేరింది మొదలు ఈ మూడు పార్టీలు ఇక్కడ పోటా పోటీగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ప్రణాళికలను రచిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీకన్నా బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతోపాటు ప్రచారంలో ముందుకు దూసుకు పోతున్నాయి. అనేక తర్జనబర్జనల తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీ పాల్వాయి స్రవంతిని అభ్యర్థినిగా ఎంపిక చేసింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కుమార్తె స్రవంతి, తండ్రి కాలంనుండే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.. ఆమెను అభ్యర్థిగా నిలపాలని పార్టీ సీనియర్‌ ‌నాయకులుకూడా మద్దతు పలుకడంతో అధిష్టానం ఆమెను అభ్యర్థినిగా నిలబెడుతోంది.

ఇప్పటికే ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నది. ప్రతీ గ్రామం, ప్రతీ ఇల్లు తిరుగుతూ ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి చూడండని అభ్యర్థిస్తోంది. దానికి తగినట్లుగా రాష్ట్ర పార్టీ కూడా తమ స్థానాన్ని గెలుచుకోవాలన్న లక్ష్యంగా పథకాలను రచిస్తోంది. ప్రతీ రెండు మండలాలకు ఒక రాష్ట్రస్థాయి నాయకుడిని ఏర్పాటుచేసిన పిసిసి, మరో నాయకుడిని వారికి సహకరించేందుకు ఏర్పాటు చేసింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి, ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, వి. హనుమంతరావు, షబ్బీర్‌ అలీ, దామోదర రాజనర్సింహలు మండలాలకు ఇన్‌ఛార్జీలుకాగా, మొత్తం నియోజవర్గ ఇన్‌ఛార్జిగా మాజీ ఎంపి, టిపిసిసి ప్రచార కమిటి చైర్మన్‌• ‌మధుయాస్కీగౌడ్‌ ‌నియమించారు. అలాగే స్టార్‌ ‌క్యాంపెయినర్‌ ‌కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు కె. జానారెడ్డి, జీవన్‌రెడ్డిలకు స్రవంతిని గెలిపించే బాధ్యతను అప్పగించారు. ఈ విషయంలో బిజెపికూడా స్పీడ్‌ ‌పెంచింది. ఉప ఎన్నిక కీలక బాధ్యతను మాజీ ఎంపి వివేక్‌ ‌వెంకటస్వామికి అప్పగించింది. వివేక్‌ ‌చైర్మన్‌గా పద్నాలుగు మందితో ఆ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎంఎల్‌ఏలు ఈటల రాజేందర్‌, ‌రఘనందన్‌రావు, మాజీ ఎంపిలు విజయశాంతి, గరికపాటు మోహన్‌రావు, జితేందర్‌రెడ్డిలాంటివారున్నారు.

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ ‌గెలుపు విషయంలో కేవలం ఒకరికే ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించిన బిజెపి, మునుగోడుకు పెద్దగా స్టీరింగ్‌ ‌కమిటీనే రూపొందించిందంటేనే ఈ ఎన్నికను ఆ పార్టీ ఎంత ప్రతిష్టగా తీసుకుందన్నది స్పష్టమవుతున్నది. వీరితోపాటు స్థానిక నాయకుడు గంగిడి మనోహర్‌రెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించింది. వీరితోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దాని అనుబంధ సంస్థలకు చెందిన సుమారు వెయ్యి మంది స్వచ్ఛంద సేవకులను ఇప్పటికే రంగంలోకి దింపింది. వీరంతా ప్రతీ మండలం, గ్రామాల్లోని ప్రతీ ఇంటింటికి తిరిగుతూ బిజెపికి వోటు వేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థించే పనిలో ఉన్నారు. ఒక్కో వ్యక్తి కనీసం నలభైనుండి యాభైమందిని ప్రభావితం చేయాలన్నది ఆ పార్టీ లక్ష్యం. తెలంగాణ ప్రాంత ఇన్‌ఛార్జిగా కేంద్రంనుండి వొచ్చిన సునీల్‌ ‌బన్సల్‌, ‌నాగపూర్‌కు చెందిన అయిదుగురు సీనియర్‌ ‌నాయకులు ప్రచార కార్యక్రమంలో పాత పార్టీల్లోని ముఖ్యనాయకులకు కాషాయ కండువలను కప్పుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌లనుండి పలువురు బిజెపిలో చేరడంతో ఆయా పార్టీలకు పెద్ద షాక్‌నిస్తోంది. ఇది ఉప ఎన్నికే అయినప్పటికీ ప్రధానంగా ఈ మూడు పార్టీలు తమ బలాబలాను బేరీజు వేసుకునే అవకాశం దీనితో ఏర్పడింది. ఈ ఎన్నిక ఫలితాల ప్రభావం రానున్న శాసనసభ ఎన్నికలపైన తప్ప పడుతుందంటున్నారు.

Leave a Reply