Take a fresh look at your lifestyle.

చైర్మన్‌ ‌పదవిని నోట్ల కట్టలే శాసించనున్నాయా..!

 

chairman seat, money rules, huzurnagar results

అనుకున్నట్లే జరుగుతోంది. హుజూరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌పదవిని నోట్ల కట్టలే శాసిస్తున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ‌రాకముందు నుండే ఛైర్మన్‌ ‌పదవి దక్కించుకునేందుకు కొందరు లాబీయింగ్‌ ‌మొదలు పెట్టారు. ఎన్నికల ఫలితాలు రాకముందే ఓ అభ్యర్థి భర్త తన భార్యను ఛైర్మన్‌ ‌చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బు ఆశను గెలిచే అభ్యర్థులకు చూపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నోట్ల కట్టలతో రాయబారాలకు తెరలేపడం విస్మయాన్ని కలిగిస్తోంది. గత పాలక వర్గంలో ఛైర్మన్‌ ఎన్నిక సమయంలో కౌన్సిలర్లుగా గెలిచిన వారు పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారని, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. మరోసారి అవిశ్వాసం సమయంలో కౌన్సిలర్లు డబ్బులకు అమ్మడుపోయారనే ప్రచారం జరిగింది. గత పాఠాల నుండి గుణపాఠాలు ఏమీ నేర్చుకోనట్లుగానే మరోసారి కొందరు డబ్బులకు అమ్మడుపోయి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఛైర్మన్‌ ‌పీఠం దక్కించుకునేందుకు తెరలేపడం ఇటు పార్టీ వర్గాల్ని, మరోవైపు ప్రజల్ని ఆయోమయానికి గురి చేస్తోంది.

ఎన్నికల ముందు నుండే… వ్యూహం
మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌పదవిని ఆశిస్తున్న అభ్యర్థి భర్త పదవిని దక్కించుకునేందుకు ముందస్తుగా అమలు చేస్తూ వస్తున్నారు. అధికార పార్టీలో కీలక భూమిక పోషిస్తున్న ఓ నాయకునికి పెద్ద ఎత్తున డబ్బు ముట్టజెప్పి అతని అండతో అధిష్టానం వద్ద రాయబారం నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వివిధ పార్టీలో పనిచేసి, మరోసారి పార్టీ మారి టిఆర్‌ఎస్‌ ‌నుండి బిజెపిలో చేరిన ఓ నాయకుని అనుచరుడైన ఇతను, ప్రస్తుతం బిజెపిలో ఉన్న నాయకుని సహాయంతో తమ వార్డులో నామినేషన్‌ ‌వేసిన ఇద్దరిని విత్‌ ‌డ్రా చేయించి ఏకగ్రీవం చేయించారు. దీనికి తోడు కొంత మంది గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకు కూడా పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పినట్లు తెలిసింది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఛైర్మన్‌ అభ్యర్థి విషయంలో ఆ ఆభ్యర్థి భర్త ముందడుగు వేసి తమకు తాము ఛైర్మన్‌ అభ్యర్థి అని ప్రచారం చేసుకోవడం, గెలిచే కౌన్సిలర్లను ప్రలోభాలకు లోను చేయడం, అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని మభ్యపెట్టడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇతను గతంలో ఓ మహిళతో అక్రమ సంబంధం వ్యవహారం పెట్టుకుని ఆమె భర్తను కనిపించకుండా మాయం చేసాడనే ప్రచారం జరుగుతోంది. గతంలో అక్రమ బియ్యం దందాలో వాటాదారుడైన ఇతను ఓ బిజెపి నాయకునితో తమ స్నేహబంధాన్ని కొనసాగించడం, ఆతని చెప్పుచేతల్లో నడవడం, అతని కనుసన్నల్లో పనిచేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టి ఆర్‌ ఎస్‌తో బిజెపి నాయకుడు మైండ్‌ ‌గేమ్‌ ఆడడాన్ని, తన చెప్పుచేతల్లో గులాబీ నాయకులను పెట్టుకోవడాన్ని మొదటినుండి పార్టీ కోసం కట్టుబడి ఉన్న నాయుకులు సహించలేకపోతున్నారు.

అమ్యాత్యుని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
కాగా, హుజూరాబాద్‌ ‌నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ఎన్నిక సవాల్‌లా మారింది. గతంలో డబ్బుల దందా జరిగినప్పుడు మౌనంగా ఉన్నట్లే ప్రస్తుతం కూడా మౌనంగా ఉంటారా? నోట్ల కట్టల రాజకీయాన్ని అడ్డుకుంటారా? లేక ఒక మంచి అభ్యర్థి పేరు సూచించి అందరి మెప్పు పొందుతారా? లేదా? అభ్యర్థుల ఇష్టానికే వదలివేస్తారా? అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని మంత్రి ఒక పేరును సూచిస్తే వివాదాలకు తెరపడుతుందని, నోట్ల రాజకీయం చెల్లదన్న సిగ్నల్స్ ‌రాజకీయ వర్గాలకు అందుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ అభ్యర్థి ఎన్నికపై, అమాత్యుని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags: chairman seat, money rules, huzurnagar results

Leave a Reply