Take a fresh look at your lifestyle.

బిల్లులు ఇస్తారా? పార్టీకి రాజీనామా చేసి వెళ్లి పొమ్మంటారా?

  • పలువురు సర్పంచుల రహస్య మీటింగ్‌?
  • ‌సముదాయించిన గడా ముత్యం రెడ్డి?
  • హాట్‌హాట్‌గా సర్పంచుల రాజీనామాల మీటింగ్‌?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గ పరిధిలోని మార్కుక్‌ ‌మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రెండు రోజుల కిందట మండలంలోని సుమారు 16 మంది సర్పంచు(వీరిలో ఒకరు కాంగ్రెస్‌ ‌సర్పంచ్‌)‌లు వ్యవసాయ క్షేత్రంలో రహాస్యంగా సమావేశమైనట్టు సమాచారం. మండలంలోని 16 మంది సర్పంచ్‌లు రాజీనామాలు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తెలుస్తున్న వివరాల ప్రకారం..గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ‌సొంత మండలమైన మర్కుక్‌లోని 16 మంది సర్పంచ్‌లు ఓ వ్యవసాయ క్షేత్రంలో రహస్యంగా సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించకుంటే రాజీనామా చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడంలేదు. దీనికితోడు ప్రభుత్వ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో సర్పంచ్‌లు వడ్డీకి డబ్బు తెచ్చి కార్మికులకు వేతనాలు ఇచ్చి పనులు పూర్తి చేస్తున్నారు.

అధికారులు మాత్రం బిల్లుల డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడంతో తాము వడ్డీ డబ్బులు కట్టలేక అప్పుల పాలవుతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా పనులన్నీ తాము చేస్తుంటే ఉప సర్పంచులకు జాయింట్‌ ‌చెక్‌ ‌పవర్‌ ఇవ్వడం తలనొప్పిగా మారిందని వాపోతున్నారు. గ్రామ సర్పంచులంటే చెత్త తొలగించడం, మొక్కల సంరక్షణ, వీధి దీపాల నిర్వహణ అన్నట్లుగా మారిపోయిందని బాధపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే తమ బిల్లులు క్లియర్‌ ‌చేయకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

రంగంలోకి గడా ముత్యం రెడ్డి?
కేసీఆర్‌ ‌వ్యవసాయ క్షేత్రం ఉన్న మార్కుక్‌ ‌మండలంలోని సర్పంచులు రహస్య ప్రాంతంలో సమావేశమై గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు ఇవ్వకుంటే రాజీనామా చేస్తామని ఏకాభిప్రాయానికి వొచ్చినట్లు బయటకు పొక్కడంతో గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి రంగములోకి దిగినట్లు సమాచారం. ఏ గ్రామంలో ఎన్ని పనులు చేశారు, బిల్లులు ఏ మేర పెండింగ్‌లో ఉన్నాయి అన్న సమాచారం తెలుసుకుని, వీలైనంత త్వరలో చేసిన అభివృద్ధి పనులకు రావాల్సిన పెండింగ్‌ ‌బిల్లులు ఇప్పించే ఏర్పాటు చేస్తామని సర్పంచులకు హామీ ఇచ్చారని తెలుస్తుంది.

గడా హామీ మేరకు సర్పంచులు రాజీనామా అస్త్రాన్ని ఉపసంహరణ చేసుకుంటారా? లేదా? అని సర్పంచులే చెప్పాలి. మొత్తంగా ఈ వ్యవహారం ఒక కుదుపు కదుపుతుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వ్యవసాయ క్షేత్రం ఉన్న మార్కుక్‌ ‌మండలంలోని సర్పంచులు రాజీనామా చేస్తామని మీటింగ్‌ ‌పెట్టుకోవడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్‌ ‌టాపిక్‌గా మారింది. గులాబీ బాస్‌ ఈ ‌బెదిరింపు అస్త్రానికి ఎలా శుభం కార్డు వేస్తారన్నది వేచి చూడాలి.

Leave a Reply