Take a fresh look at your lifestyle.

ఆదివాసుల ఆకాంక్షలు నెరవేరేనా..??

ప్రపంచదేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం. విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్నభాషలు, వేషధారణ, భిన్నమైన వాతావరణంతో వైవిధ్యాన్ని కలిగి ఉన్న దేశం. అందుకే భారతదేశాన్ని భారత ఉపఖండం అని కూడా సంభోదిస్తారు. అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగి, అలీన విధానాన్ని రూపకల్పన చేయడంలో ప్రపంచశాంతి కోసం ప్రముఖ పాత్ర వహించిన ప్రజాస్వామిక దేశం. అటువంటి ప్రజాస్వామిక దేశానికి అత్యున్నత పదవి అయిన భారత రాష్ట్రపతిగా  అణగారిన ఆదివాసి తెగ ఆడబిడ్డద్రౌపది ముర్ముఎన్నిక కావడం హర్ష దాయకం… స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి అమృత ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ అత్యంత వెనుకబడిన గిరిజన  సంతాల్‌ ‌తెగకు చెందిన  మహిళ భారతదేశ మొదటి పౌరురాలిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందడం దేశం మూలవాసులైన 10కోట్ల ఆదివాసి అడవి బిడ్డలందరికీ గర్వకారణం.. నీతి నిజాయితీలకు మారుపేరు, త్యాగాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌,  అటవికసంపద, వనరుల కాపలాదారులు,అభం శుభం తెలియని కొండమల్లెలు, మంచి మనసు,మానవీయ విలువలు కలిగిన ఆదివాసీల ప్రతినిధిగా భారత 15వ రాష్ట్రపతిగా పదవిని అధిరోహించడం శుభ పరిణామమే..ఈసందర్భంగా ఆదివాసుల కష్టాలు కడతేరుతాయని, అభివృద్ధి పథంలోకి  ముందుకు పయనించే అవకాశం ఉంటుందని  ఆదివాసుల లోను,  సామాన్య బడుగు బలహీన వర్గాలలో అనేక ఆశలు ఆకాంక్షలు  చిగురించనున్నాయి .ఎందుకనగా  స్వాతంత్రం రాక ముందు నుండి కూడా ఆదివాసులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. గత పాలక ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధికి చేపట్టిన చర్యలు, వారు సాధించిన ప్రగతి పరిశీలించడానికి  వారిజీవితాలలోకి తొంగి చూస్తే..  ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం,  నరజాతి చరిత్ర సమస్తం, పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ గారు అన్నట్టు  ఆనాడు పరాయి పాలనలో కావచ్చు, నేడు అజాదీ  అమృత ఉత్సవాల సమయం కావచ్చు ..ఆదివాసీల అభివృద్ధి అంతంత మాత్రమే.
వారి జీవితాలలో ఇసుమంతయినా మార్పులేదు. బ్రిటిష్‌ ‌పాలనలో తెల్లవారి ఆగడాలకు, వారు దోచుకుపోతున్న సహజ వనరులకుఅడ్డుపడి దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి సీతారామరాజు లాంటి మన్యం వీరులు లెందరో… నేటి పాలనలో అన్యాయం అక్రమాలకు  అడ్డు నిలిచి అక్రమంగా కేసులు  బనాయించబడి జైళ్లలో మగ్గిన మ్రగ్గుతున్న  వారెందరో.. న్యాయం పక్షాన నిలబడి సహకరించినందుకు  ధన ,మాన,ప్రాణాలను  దోచిన,చిత్రహింసల పాలవుతూ ప్రాణాల ర్పించడం అడవి బిడ్డలకు అలవాటే…భారత రాజ్యాంగంలో ఆదివాసుల కుస్వయంప్రతిపత్తినికల్పిస్తూ 5వ షెడ్యూల్ను  పొందుప రిచారు.దాని ప్రకారం అడవిపై సర్వాధికారాలు ఆదివాసులకే కలవు. వాటిని  అమలు పరిచేందుకు గ్రామసభ ఏర్పాటు, గ్రామ సభ అనుమతితోనే షెడ్యూలు ప్రాంతాలలోఏ అభివృద్ధి కార్యక్రమానికైనా భూసేకరణ, ఖనిజాల వెలికితీత, అటవీ వనరుల సేకరణ లాంటివి చేయవచ్చు. కానీ గ్రామ సభ అనుమతి లేకుండా  ఏది చేయకూడదు. ఇంకనూ వారి హక్కులను కాపాడేందుకు, అడవిని రక్షించేందుకుపంచాయతీ  విస్తరణ( పీసా )చట్టం, అటవీ సంరక్షణ చట్టం 1980, అటవీ హక్కుల చట్టం 2006 వంటి ముఖ్యమైన చట్టాలతో పాటు అనేక నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఆచరణలో అవి అమలు కాకపోవడం, ఆ చట్టాలను ప్రభుత్వాలే ఉల్లంఘిస్తూ ఉండటం వల్ల  ఆదివాసులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తరతరాలుగా తాత ముత్తాతల కాలం నుండి అడవిలో పుట్టి అడవిని నమ్ముకుని, అడవినే జీవనాధారంగా ఏర్పరచుకొని అడవిలో లభించే  కందమూలాలు తింటూ స్వేచ్ఛగా నాగరికపు సమాజానికి దూరంగాజీవిస్తున్న గిరిపుత్రులను అడవి నుండి దూరం చేయాలని, అడవి నుండి  తరిమివేసి అటవీ సంపదను కార్పొరేటు బడాబాబులకు, ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారులకు  దోచి పెట్టాలని తహ తహ లాడుతూ అమాయకపు ఆదివాసీ గిరిజనుల జీవితాలను ఛిద్రం  చేయడం, భౌతిక దాడులు చేయడం, జైలుపాలు చేయడం నిత్యకృత్యమైంది. 50,60 సంవత్సరాల నుండి బ్రతక డానికి తిండి గింజల కోసం పోడు భూములలో వ్యవసాయం చేస్తున్న ఆదివాసి రైతుల నుండి భూములను లాక్కోవడం, అడ్డు పడిన  వారు మహిళలు,బాలింతలు,గర్భిణీ స్త్రీలు అని చూడకుండా అమానవీయంగా బట్టలూడదీసి కొట్టి  పాలిచ్చే తల్లులను సైతం జైలుపాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం.
అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పాలకులు హక్కుదారులైన గిరిజనులకు హక్కు పత్రాలు అందజేస్తామని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అమాయకపు గిరిజనులను సమస్యల సుడిగుండంలో కి తోచి వేస్తూ, ఖనిజాల త్రవ్వకం,విద్యుత్తు, పర్యాటకం, వన్యమృగాల  రక్షణ పేరుతో చట్టాలను సవరించి సహజ వనరులను, ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టి చర్యలు చేపడుతు0డటం విచారకరం.. ఎండవాన,చలి నుండి కాపాడుకోవడానికి గూడు లేని, ఒంటినిండా కప్పుకోవడానికి గుడ్డలు లేని, తినడానికి తిండి గింజలు లేకుండా  పస్తులు ఉంటున్న ఆదివాసులు ఎందరో ఆకలితో అలమటిస్తున్న హృదయ విదారక సంఘటనలు కోకొల్లలుగా ఆదివాసి గూడెంలలో కళ్ళముందు కదలాడుతాయి. వారి గ్రామాలనుండి మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి కనీసరోడ్డు సౌకర్యం కూడా లేదు,ఇంకనూ ఎర్ర బస్సు  ఎరుగని గ్రామాలు ఎన్నో కలవు. అనారోగ్యం పాలైనప్పుడు  అత్యవసర పరిస్థితులలో వైద్య సదుపాయం కోసం  పట్టణాలకు చేరుకోవడానికి పదుల మైళ్ళు నడవాల్సిందే..  అనారోగ్యానికి గురైన వారిని  వంచె గట్టి కావడిద్వార  మోయ వలసిందే. ఇక వర్షాకాలం వానల జోరుకు వాగులు వంకలు నదులు  పొంగిపొర్లి  రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఇటీవల పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మాతృమూర్తిని ఆసుపత్రికి తరలిం చడానికి 108 వాహనం రాలేకపోవడంతో, ఆ మాతృమూర్తి రోడ్డు మీదేప్రసవించడం జరిగింది.
  అంతెందుకు రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్ము గారి  గ్రామంలో కూడా ఇటీవలే విద్యుత్‌ ‌శక్తి సౌకర్యంకల్పించడం గమనార్హం. ఇంతటి దయనీ యమైన పరిస్థితిలోఆదివాసులు తమ జీవనాన్ని కొనసాగి స్తున్నారు.ఎక్కడో ఉన్న చంద్రమండలానికి పరిగెత్తి అక్కడ నివసించాలని పరిశో ధనలు చేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ప్రభుత్వాలు, ఆరోగ్య ప్రదమైన జీవితాన్ని గడపడానికి, గౌరవంగా జీవించడానికి కనీస మౌలిక వసతులు కల్పించడానికి నిధులు కేటాయించకుండా ఆదివాసీల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబించడం అభ్యంతరకరం.క్రిమికీటకాల వల్ల, త్రాగునీరు సరిగ్గా లేకపోవడం మూలంగా అంటు వ్యాధులు ప్రబలడం,  డెంగ్యూ, టైఫాయిడ్‌ ‌మరియు వైరల్‌ ‌విష జ్వరాలు  సోకి ప్రాణాలు కోల్పోవడం సహజంగా మారింది.  అయినప్పటికీ పాలకులు ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత లేకుండా గాలికి వదిలేయడం తగనిది. గిరిజన  గ్రామాలలో విద్యా సౌకర్యాలు కల్పించక, నాణ్యతతో కూడిన విద్యనుఅందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించకపోవడం,శాశ్వత ప్రాతిపాదికన ఉపాధ్యాయ నియా మకాలు చేపట్టక కాంట్రాక్టు వ్యవస్థ, అవుట్సోర్సింగ్‌ ‌విధానాలతో తాత్కాలిక నియామకాలు చేపట్టడంతో అక్కడికి వెళ్లే ఉపాధ్యాయులు కరువై సుదూర ప్రాంతాలలో , కొండ ప్రాంతాలలో గల గిరిజన గూడెంలలో విద్యా వికాసం జరగడం లేదు. గతంలో గిరిజనుల విద్యాభివృద్ధికి ఆశ్రమ పాఠశాలలు ఎంతగానో తోడ్పడేవి. వాటిని సరైన విధంగా నిర్వహించకపోవడం, నాణ్యమైన భోజనం వసతులు కల్పించకుండా నిర్వీర్యం చేయడం జరిగింది. దీంతో గిరిజన విద్యార్థులు డ్రాపవుట్లు గా మారి విద్యా గంధానికి ఆమడ దూరంలో ఉన్నారు. గిరిజన విద్యార్థులకు ,గిరిజన  విద్యావంతులే విద్య నేర్పే విధంగా గతంలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేవారు.ఇటీవల గిరిజనేతరుల అభ్యంతరంతో జీవో 3 సుప్రీం కోర్టు కొట్టివేయడంతో, ఆ అవకాశం లేకుండా పోయి గిరిజనులలో విద్య   కుంటూ పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఇతర విద్యార్థులతో గిరిజన విద్యార్థులు పోటీకి తట్టుకోలేకపోతున్నారని  ఉన్నత విద్యను,  యూనివర్సిటీ విద్యను, పరిశోధనా రంగంలో ప్రోత్సహిం చడానికి ప్రత్యేకంగా గిరిజన యూనివర్సిటీని నెలకొల్పుతామని ప్రకటించి సంవత్సరాలు గడిచిననుఇంతవరకు దాని ఊసే లేదు,ఈ వర్షాకాలపు పార్లమెంట్‌ ‌సమావేశాలలో గిరిజన యూని వర్సిటీ బిల్లును పెడుతున్నట్లు తెలుస్తుంది. అనేక రాష్ట్రాలలో అటవీ సంపదను కొల్లగొట్టడానికి కార్పొరేటు సంస్థలు జిందాల్‌, ‌వేదాంత లాంటి  బహుళజాతి జాతి సంస్థలు, అంబానీ  ఆదానీల సంస్థలు బొగ్గు గనుల తవ్వకం, బాక్సైట్‌, ‌యురేనియం లాంటి ఖనిజాల వెలికితీత కు పోటీపడుతూ గిరిజన జీవితాలను అత లాకుతలం చేస్తున్నాయి. ఇవన్నీ పాలకులకు తెలియని కావు, తెలిసిన నిర్లక్ష్య వైఖరితో పట్టించుకోకుండా, చట్టాలు సరిగా అమలు చేయకపోవడంతో ఆదివాసీల అభివృద్ధి  ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో     రాజ్యాంగ పరిరక్షణకు,  విశిష్టమైన ప్రత్యేక అధికారాలు   మరియు 5వ షెడ్యూల్‌ ‌ప్రకారం ఆదివాసీ ప్రాంతాల రక్షణ బాధ్యత కూడా కలిగి ఉన్న అత్యున్నత రాష్ట్రపతి  పదవిని ఆ వర్గానికి  చెందిన ద్రౌపది ముర్ము  చేపట్టి ఆదివాసి మహిళగా  చరిత్ర సృష్టిస్తున్న తరుణంలో గిరిజన, సామాన్య పేద ప్రజలలో అనేక ఆశలు, ఆకాంక్షలుచిగురించడం సహజమే.. గత రాష్ట్రపతి రామ్నాథ్‌ ‌కోవింద్‌ ‌కూడా దళిత వర్గాల ప్రతినిధిగా సామాజిక సమాన త్వంలో భాగంగా దేశ అత్యున్నత పదవిలో కొనసాగినప్పటికీ ఆ వర్గాల జీవితాల్లో అభివృద్ధిలో ఎటువంటి మార్పు కనబడలేదు, పోగా కులం పేరిట, మతం పేరిట పరువు హత్యలు జరిగాయి.
దళితులపై, పేద ప్రజలపై  దౌర్జన్యాలు, హింస పెరిగింది. దళిత మహిళలపై కూడా ఎన్నో అత్యాచార సంఘటనలు జరిగాయి.  అలా కాకుండా రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యతనిచ్చి ఆదివాసీల అభివృద్ధికి రాజ్యాంగం కల్పించిన చట్టాలను  అమలు చేస్తే చాలు, వారి ఆకాంక్షలు నెరవేరుతాయి.  సామాన్యులకు, ఆదివాసీలకుసామాజిక న్యాయం, సాంఘిక సమాన త్వం అందించబడుతుంది.అప్పుడు మాత్రమే ఆమె నియామకానికి సార్థకత లభిస్తుంది.రాజ్యాంగ పరిరక్షణకి పాటుపడి ఆ పదవికివన్నెతేస్తారో లేక గతంలో వలె సామాన్యులను బలిపీఠం ఎక్కిస్తున్నపాలక విధానాలకు మద్దతునిచ్చి రబ్బర్‌ ‌స్టాంప్‌ అన్న పదానికి సార్థకత అయ్యేలా కాలం వెళ్లదిస్తారో వేచి చూడాల్సిందే…
image.png
తండ సదానందం, టి పి టి ఎఫ్‌ ‌రాష్ట్ర కౌన్సిలర్‌, ‌మహబూబాబాద్‌, 9989584665.

Leave a Reply