చాలాకాలంగా రాజ్‌భవన్-ప్రగతి భవన్ సంబంధాలు దూరమవుతున్న విషయం తెలియందికాదు. పాలనా విషయంలో అడుగడుగున ఎదురవుతున్న సమస్యలపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య ఉప్పు నిప్పులా తయారైంది. దానికి తోడు గవర్నర్- ముఖ్యమంత్రి మధ్య గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలిప్పుడు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఎవరి పరిధి ఏమిటన్న విషయాన్ని ఇప్పుడు రాజ్యాంగ నిపుణులు విశ్లేషించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిబంధనలను ఎవరు తోసిరాజంటున్నారన్న విషయం వివాదస్పదంగా విచారణాంశంగా మారింది. ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానాలు తేల్చాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి. అయితే కోర్టు జోక్యం లేకుండానే ఇరుపక్షాలు ఒక అంగీకారానికి రావడంతో తాజా బడ్జెట్ విషయంలో ఏర్పడిన ఉత్కంఠకు సోమవారం తెరపడింది. ఇది ఒక విధంగా పెద్ద సంక్షోభాన్ని నివారించినట్లైంది. రాజ్‌భన్- ప్రగతి భవన్ మధ్య ఏర్పడిన తగాదాలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం ఇటీవల ఇది రెండవసారి.
తాజాగా ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పడిన పరిస్థితిలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నామంటూనే పోలీస్ పరేడ్ తో సహా ఆనాటి కార్యక్రమాలన్నిటినీ రాజ్‌భవన్‌కే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసింది. దాంతో ఈసారి ఆ కార్యక్రమం లక్షలాది ప్రజల మధ్య వేడుకగా నిర్వహించకపోవడం గమనార్హం. గతంలో ఉగాది సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిపిన వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఆయన మంత్రి వర్గంగాని పాల్గొనకపోవడం గమనార్హం. ఇలా పరస్పరం కలహించుకోవడం పరిపాటిగా మారింది. దీంతో గతంలో గవర్నర్ పాల్గొన్న కార్యక్రమాలను ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్నా గవర్నర్‌ను పిలవకపోవడం ఒకటికాగా, ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలను గవర్నర్ నిర్వహిస్తుండడం ప్రభుత్వ ఆలకకు కారణంగా మారింది. దీనికితోడు కాంగ్రెస్‌నుండి టిఆర్‌ఎస్(బిఆర్‌ఎస్)లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి ఎంఎల్సీ పదవిని కట్టబెట్టే విషయాన్ని ప్రతిపాదిస్తూ పంపిన ఫైల్‌ను గవర్నర్ పక్కకు పెట్టినప్పటినుండి ప్రగతిభవన్- రాజభవన్ మధ్య మరింత గ్యాప్ పెరుగుతూవొచ్చింది.
అటు గవర్నర్, ఇటు ప్రభుత్వంలోని రాజకీయ పెద్దలమధ్య పరస్పర ఆరోపణ, ప్రత్యారోపణలు నిత్యం కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థపై వివిధ• వేదికలపై చర్చలు జరుగుతున్నాయి. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా బిజెపియేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్‌ల వల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కుంటున్న సమస్యలుకూడా ఈ సందర్భంగా చర్చకు వొస్తున్నాయి.ఇదిలాఉంటే తాజాగా బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి మూడవతేదీన ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం బడ్జెట్ సమావేశాలను రాష్ట్ర గవర్నర్ అనుమతితో ప్రవేశ పెట్టడమన్నది ఆనవాయితీగా వొస్తున్నది. దాంతో రాష్ట్రపతి అనుమతికోసం ఈ నెల 21న ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. అయితే వొచ్చిన చిక్కల్లా ఇక్కడే ఉంది. ఇంతవరకు దాదాపు అన్నిరాష్ట్రాల్లో కూడా బడ్జెట్ సమావేశాల్లో తప్పనిసరిగా గవర్నర్ ప్రసంగం ఉంటూ వొస్తున్నది. కాని, రాష్ట్ర ప్రభుత్వంతో విభేదాలు ఏర్పడడంతో అంతవరకూ ఆనవాయితీగా వొస్తున్న పరిస్తితుల్లో మార్పురావడం ప్రారంభమైంది. గత బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్రప్రభుత్వం పూర్తి చేసింది. అయితే ఆనాడు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి లభించింది.
ఈసారి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి మధ్యలో కేవలం మూడు రోజులు మాత్రమే వ్యవధి ఉన్నప్పటికీ గవర్నర్ ఇంతవరకు దానిమీద ఆమోదముద్ర వేయలేదు. పైగా ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రమేయం ఉందా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేయాల్సిందిగా రాజ్‌భవన్‌నుండి ప్రగతి భవన్‌కు లేఖ అందింది. దానిపై స్పందించకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానం తలుపు తట్టింది. ఇక్కడ ఒక విచిత్రకర విషయమేమంటే హైకోర్టు న్యాయాధిపతి పదవి చేపట్టేప్పుడు గవర్నర్ అతనితో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాంటిది ఇప్పుడు గవర్నర్ పరిధి గురించి చెప్పాల్సిన పరిస్థితి న్యాయాధిపతి పరిధిలోకి వొచ్చింది. కాని విచారణ జరుపకుండానే కథ సుఖాంతం కావడంతో పెద్ద సమస్యకు పరిష్కారం లభించినట్లైంది. కొంత ఇబ్బందికరమైన ఈ కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వ తరఫు న్యాయవాది, గవర్నర్ తరఫు న్యాయవాదిని పరస్పరం విచారించుకోవాలంటూ న్యాయాధిపతి చేసిన సూచన ఫలించింది. సుహృద్భావ వాతావరణంలో తామిద్దరం ఒక అంగీకారానికి వొచ్చినట్లు కోర్టుకు వారు విన్నవించుకున్నారు. గవర్నర్ బడ్జెట్ సమావేశాలకు అనుమతిస్తూ సంతకం చేసేట్లు, ప్రభుత్వాన్ని విమర్శించేవిధంగా గవర్నర్ ఉండకుండా, అలాగే గవర్నర్ లక్ష్యంగా మంత్రులు, అధికార పార్టీ నాయకులు విమర్శించడం మానుకునేవిధంగా ఇరుపక్షాలకు తగిన సూచనలు చేసేవిధంగా తామిద్దరం ఒక అంగీకారానికి వొచ్చామని ఇరువురు న్యాయవాదులు కోర్టుకు చెప్పడంతో బడ్జెట్ సమావేశాలపై కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరబడినట్లైంది. ఇప్పటికైనా రాజ్‌భవన్- ప్రగతి భవన్‌ల విభేదాలు సమసిపోతే రాష్ట్రం ప్రగతిపై దృష్టిపెట్టే అవకాశం ఏర్పడుతుంది.