Take a fresh look at your lifestyle.

రాఘవా ఇక మారవా..?

  • పరువు తీస్తున్న వసూళ్ళ పర్వం
  • ఇంటి గుట్టు రచ్చకీడ్చిందెవరు ?
  • మరోసారి వివాదాల్లో వనమా కుటుంబం
  • హల్‌చల్‌ అవుతున్న ఆడియో రికార్డింగ్‌…‌కొత్తగూడెంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్గాల్లో చర్చ
కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుటున్న ముద్దాయి వనమా రాఘవ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాఘవ వసూళ్ళ పర్వం ఆ కుటుంబం పరువు మరోసారి బజారుకు ఇడ్చింది. ఇటీవల సిఎం కెసిఆర్‌ ‌పర్యటన సందర్భంగా ఏర్పాట్లకు భారీగా వసూళ్ళకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వసూళ్ళపై తమ ఇంట్లో ఎమ్మెల్యే వనమా, కుమారుడు రాఘతోపాటు వ్యక్తిగత పిఎ రిషితో కలిసి చర్చించుకుంటున్న ఓ ఆడియో ఇప్పుడు కలకలం రేపుతుంది. సబ్‌ ‌రిజిస్టారు వద్ద నుండి రాఘవ రూ 3 లక్షలు వసూలు చేసినట్లు మంగళవారం లీక్‌ అయిన ఆడియోలో సారాంశం. ఈ ఆడియో అంతా కాంపెల్లి కనకేష్‌, ‌సబ్‌రిజిస్టార్‌ల ప్రస్తావన ఉంది. సిఎం పరర్యటన సందర్భంగా సుమారు 70లక్షలకుపైగా ఖర్చు చేశామని, కనకేష్‌  ‌సిఫార్సు చేశారని ముందే హింట్‌ ఇచ్చి ఉంటే అసలు ఈ డబ్బులు తీసుకునే వాళ్ళము కాదు, ఇంత బదనామ్‌ అయ్యేవాళ్ళం కాదంటూ రాఘవ వ్యక్తిగత పిఎ రిషి మీద ఒంటికాలిపై లేచినట్లు ఈ ఆడియోలో ఉంది. అయితే పిఎ డబ్బుల వ్యహారంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.
రాఘవను పార్టీ నుండి సస్పెండ్‌ ‌చేసినప్పటికీ  షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ రాజకీయ వ్యవహారాలలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనితో సస్పెండ్‌ ‌వ్యవహారాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకున్నట్లు లేదని ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత రాకుండా కంటి తుడుపు చర్యగా  ప్రజలు భావిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యే వనమా కుటుంబానికి, బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి రానున్న రోజుల్లో తీరని నష్టం వాటిల్లుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఏందీ కర్మ : చేరదీసి పాలుపోస్తే పెరిగి పెద్దయ్యాక తిరిగి యజమానినే విష సర్పం కాటేసిందన్నట్లు తయారైంది ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంబ పరిస్థితి. వనమాకు ముఖ్య అనుచరుడిగా ఉన్న రియల్‌ ‌వ్యాపారి కాంపెల్లి కనకేష్‌ ఇప్పుడు  ఆ కుటుంబం పరువు తీస్తుంన్నాడనేది రాఘవ మాట అంతరార్థం. వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న తనయుడు వనమా రాఘవేంద్రరావు వ్యవహార శైలితో మనస్తాపానికి గురవుతూ ఏందీ ఈ కర్మ అంటూ వనమా ఆవేదన చెందుతున్నట్లు లీక్‌ అయిన ఆడియోలో తెలుస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ కురువృద్ధుడు ఎమ్మెల్యే వనమా రాజకీయ జీవిత చరమాంకంలో తనయుడి తీరుతో మచ్చ లేని రాజకీయ ప్రస్తానంలో ఈ మధ్య కాలంలో ప్రతిష్ట పూర్తిగా దిగజారే దుస్థితి రావడంపై కార్యకర్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు. రాఘవా ఇక మారడు అంటూ ఎమ్మెల్యే వనమా అభిమానులు పెదవి విరుస్తున్నారు.
పిఎను బలిపశువును చేస్తున్నారా ? : వనమా రాఘవ పర్సనల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రిషీ అనే యువకుడు కాస్త దుందుడుకు స్వభావం కల్గిన వ్యక్తి. అంతర్గత వ్యవహారాలు, వసూళ్ళకు సంబంధించిన విషయాలు, ఇంట్లో జరిగే సంభాషణలు మీడియాకు లీకులు అవుతూ సృష్టిస్తున్న వివాదాలు రాఘవను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంటి గుట్టు ఈశ్వరుడు కూడా పట్ట లేడన్నట్లు అసలు ఈ వ్యవహారానికి కారంణం అంతా అతనే అంటూ వనమా రాఘవ ఇటీవల అనుమానంతో చేయిచేసుకోవడంతో అదికాస్త చిలికి చిలికి పెద్ద గాలివానలా మారింది. ఈ నేపథ్యంలో రిషిని రాఘవ కుటుంబ సభ్యులు అనుమానిస్తూ దూషించడంతో మనస్తాపానికి గురయిన అతడు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సంచలనంగా మారింది. అయితే పోలీసుల జోక్యంతో అదికాస్తా సద్దుమణగడంతో రిషిని పనిలో నుండి తొలగించారు. మళ్లీ తాజాగా మరో ఇంట్లో ఎమ్మెల్యే వనమా కుటుంబ సభ్యుల సంభాషణ ఆడియో లీక్‌ అవ్వడం పెను దుమారం లేపుతుంది. అయితే ఇదికూడా అతని పని అంటూ రిషి పేరు తెరపైకి వొచ్చింది. దీనితో కుటుంబాన్ని కోల్పోయి పుట్టెడు దు•:ంతో ఒంటరిగా మారిన రిషిపై ఆరోపణలు చేస్తూ బలిపశువును చేయడం సరికాదంటూ అతని మిత్రులు ఆగ్రహిస్తున్నారు.
గడల ఎత్తుగడేనా ? : ఎమ్మెల్యే వనమా ముఖ్య అనుచరుల్లో ఒకరిగా కాంపెల్లి కనకేష్‌ ‌మీద ఎమ్మెల్యే ఆశిర్వాదబలం, అండదండల తోడగా కాలం కలిసిరావడంతో అంచలంచెలుగా  రియాల్టర్‌గా ఎదిగాడు. పాల్వంచ మండలంలో తిరుగులేని రియాల్టర్‌గా అనతికాలంలో మారారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు ఉండటు అన్న చందంగా ఒకప్పుడు ఆ కుటుంబానికి మంచి విధేయుడు. ఇప్పుడు బద్ద శత్రువులా మారి ఏకంగా ఇంటి గుట్టును బట్టబయలు చేసేందకు సైతం వేనుకాడలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తొక వింత పాతొక రోత అన్నట్లు ఎక్కడ చెడిందో కానీ ఉన్న ఫలంగా కాంపెళ్లి కనకేష్‌ ‌ప్లేట్‌ ‌ఫిరాయించి డీహెచ్‌ ‌వర్గంలో చేరాడు. కొత్తగూడెం నియోజకవర్గం అధికార పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్‌ ‌రేసులో తాను ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ హెల్త్ ‌డైరెక్టర్‌ ‌గడల పంచన చేరాడని, అప్పటి నుండి ఎమ్మెల్యే కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు ఇంటి గుట్టును రచ్చకు ఎక్కిస్తున్నాడంటూ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ ఆడియో లీక్‌ ‌వ్యవహారం వెకనాల డిహెచ్‌ ‌హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజకీయంగా ఎమ్మెల్యే వనమా ప్రతిష్టను దిగజార్చి, ఎమ్మెల్యే సీటు రేసులో నిలవకుండా చేసి, అధిష్టానం దృష్టి తనపై మరల్చే ఎత్తుగడలో భాంగంగా ఇలా కాంపెళ్ళిని అస్త్రంగా వాడుకున్నారా ? అనేది జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వాడంటూ వనమా అనుచరులు కాంపెళ్లిపై ఆగ్రహిస్తున్నారు. ఈ వయస్సులో తమ అభిమాన నే•తను ఇంత మానసిక క్షోభకు గురిచేయడంపై కార్యకర్తలు కన్నెర్ర చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు సబ్‌ ‌రిజిస్టారు దేనికి  అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు రాఘవను కలిశారు అనేది మిలియన్‌ ‌డాలర్ల ప్రశ్నగా మారింది. రాఘవ వసూళ్ళ పర్వం మీద ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్లాసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

Leave a Reply