Take a fresh look at your lifestyle.

పోలవరం ముంపు బాధితులను ముంచుతారా?

విజయవాడ, జూలై 5 : పోలవరం ముంపు బాధితుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని లెఫ్ట్ ‌పార్టీల నేతలు డిమాండ్‌ ‌చేశారు. వారిని పోలీసులు తరిమి వేయడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. వారికి ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ప్యాకేజీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. పోలవరానికి తాము వ్యతిరేకం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు.

పోలవరం నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్షం నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని.. నిర్వాసితులను కొండలు ఎక్కించడం సరికాదని అన్నారు. పోలీసుల చేత బలవంతంగా నిర్వాసితులను గ్రామాల నుంచి తరిమేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణ రెడ్డిని ముందు పెట్టుకుని పోలవరంలో ఫోటోలు దిగారని… నిర్వాసితులను మాత్రం పరమర్శించలేదన్నారు.

నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితులకు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రామకృష్ణ అన్నారు. ఇదిలావుంటే పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కారం చేయకపోతే తాము జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని సీపీఎం నేత మధు అన్నారు.

పోలవరం నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో మధు మాట్లాడుతూ.. 15 రోజుల్లో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని… లేకపోతే తమ ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇది రాజకీయ సమస్య కాదని…ప్రజా ఉద్యమమని అన్నారు. ప్రధానికి ఆంధ్ర అంటే చాలా చులకన భావం ఉందని తెలిపారు. 7న అన్ని ముంపు మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేయనున్నట్లు మధు వెల్లడించారు.

Leave a Reply