Take a fresh look at your lifestyle.

మమత జైత్రయాత్రకు ఎంఐఎం అడ్డుపడుతుందా …?

“గతేడాది బీహార్‌లో ఎంఐఎం పార్టీ తన ఉనికి చాటుకోవటంలో విజయం సాధించిన నేపథ్యంలో….ఇప్పుడు ఎంఐఎం బెంగాల్‌ ఎన్నికలకు సిద్ధం అవుతున్నది. బెంగాల్‌ ‌సరిహద్దులో ఉన్న బీహార్‌ ‌సీమంచల్‌ ‌ప్రాంతంలో ఒవైసీ పార్టీ రాజకీయంగా ముఖ్యమైన సీమంచల్‌ 20 ‌స్థానాల్లో ఐదు స్థానాలను గెలుచుకుంది. ఎంఐఎం వలన బీహార్‌ ‌లో ఆర్జేడీ-కాంగ్రెస్‌ ‌కూటమికి అనేక స్థానాల్లో దెబ్బలు తగిలాయి. ఫలితంగా ఆర్జేడీ-కాంగ్రెస్‌ ‌కూటమి అధికారానికి దూరం అయ్యింది. బిజెపి-జెడియు(యునైటెడ్‌) ‌తిరిగి అధికారంలోకి రావడంతో, ముస్లింల ఓట్లు ఎంఐఎం దక్కించు కోవటం వలన మిగతా రాజకీయ పార్టీల అదృష్టాన్ని ఎంఐఎం ఎలా ప్రభావితం చేసిందనే దానిపై బీహార్‌ ఎన్నికల తర్వాత పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు బెంగాల్‌ ‌వంతు వచ్చింది.”

aruna
అరుణ ,న్యూ దిల్లీ

నూట ముప్పై కోట్ల జనాభాలో అరవై ఐదు కోట్ల మహిళా జనాభా కలిగిన భారత దేశంలో ఒకే ఒక్క మహిళా ముఖ్య మంత్రి మమతా బెనర్జీ. ఆమె పశ్చిమ బెంగాల్లో బీజేపీతో తల పడుతున్నారు అనేది ప్రముఖంగా మనకు కనిపిస్తున్నది. ప్రస్తుతం దేశ రాజకీయ నాటక రంగంలో పశ్చిమ బెంగాల్‌ అ‌గ్రస్థానంలో నిలిచి ఉన్నది. వామపక్షాలు వెర్సెస్‌ ‌మమతా బెనర్జీ అనే పోటీ కాలగర్భంలో కలిసిపోయి.. ఆ స్థానంలో మమతా వెర్సెస్‌ ‌మోడీ అనే పోటీ బెంగాల్‌ ‌లో కనిపిస్తున్నది. పశ్చిమ బెంగాల్‌లో దీదీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నది అనేది కళ్ళకి కనిపిస్తున్న నిజం.

మమతా పదేళ్ల పాలన, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌బలమైన ఉనికి, ఇప్పుడు మమతాతో అమీ తుమీ తేల్చుకోటానికి బిజెపి తన ఉనికి చాటుకోవటంతో 30 ఏళ్ళకు పైగా పశ్చిమ బెంగాల్‌ ‌ను ఏలిన వామపక్షాలకు దిక్కు తోచని ఎన్నికలు ఇవి. ఈ పరిస్థితిలో ఒక్క బీజేపీకి మాత్రమే అనుకులాలు గంప గుత్తంగా అందటం అనేది మనకి కంటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.సందట్లో సడేమియా అంటూ బెంగాల్‌ ‌లో మమతా వర్సెస్‌ ‌బీజేపీ పోరులో హైదరాబాద్‌ ‌పార్టీ ఎంఐఎం తన ఉనికి బలపరుచుకోటానికి తపిస్తున్నది. దీని ప్రభావం దేశం మొత్తం మీద పడనున్నది. ఈ పరిణామాలు దేశ వ్యాపతంగా బీజేపీని మరింత బలోపేతం చేయనున్నాయి. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు భారత రాజకీయం మరింతగా మత ఆధారితం చేస్తాయా అనే ప్రశ్న మనముందు పెడుతున్నాయి.

మమతా బెనర్జీ తన నామినేషన్‌ ‌వేసే సమయంలో ముస్లిం మహిళలు ధరించే హిజాబ్‌ ‌ధరించి నామినేషన్‌ ‌ఫైల్‌ ‌చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. నేడు హిజాబ్‌ ‌ధరించే ధైర్యం మమత చేయటం కాదు కదా కనీసం ఆలోచన కూడా చేయటంలేదు. ‘‘విభజించు..పాలించు..’’ అనే బ్రిటిష్‌ ‌మూల మంత్రాన్ని బీజేపీ వాడి అన్ని రాజకీయ పార్టీలకీ చెక్‌ ‌పెట్టగలిగింది అనే దానికి తార్కాణం ఈ పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో హైదరాబాద్‌ ‌పార్టీ ఎంఐఎం మమతకు కొత్త తలనొప్పులు తేవటానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. 2020 ఎన్నికలలో ముస్లిం ఓట్లలో గణనీయమైన భాగాన్ని ఎంఐఎం సాధించింది అనేది మనందరికీ ఎరుకే. గతేడాది బీహార్‌లో ఎంఐఎం పార్టీ తన ఉనికి చాటుకోవటంలో విజయం సాధించిన నేపథ్యంలో….ఇప్పుడు ఎంఐఎం బెంగాల్‌ ఎన్నికలకు సిద్ధం అవుతున్నది.

బెంగాల్‌ ‌సరిహద్దులో ఉన్న బీహార్‌ ‌సీమంచల్‌ ‌ప్రాంతంలో ఒవైసీ పార్టీ రాజకీయంగా ముఖ్యమైన సీమంచల్‌ 20 ‌స్థానాల్లో ఐదు స్థానాలను గెలుచుకుంది. ఎంఐఎం వలన బీహార్‌ ‌లో ఆర్జేడీ-కాంగ్రెస్‌ ‌కూటమికి అనేక స్థానాల్లో దెబ్బలు తగిలాయి. ఫలితంగా ఆర్జేడీ-కాంగ్రెస్‌ ‌కూటమి అధికారానికి దూరం అయ్యింది. బిజెపి-జెడియు(యునైటెడ్‌) ‌తిరిగి అధికారంలోకి రావడంతో, ముస్లింల ఓట్లు ఎంఐఎం దక్కించు కోవటం వలన మిగతా రాజకీయ పార్టీల అదృష్టాన్ని ఎంఐఎం ఎలా ప్రభావితం చేసిందనే దానిపై బీహార్‌ ఎన్నికల తర్వాత పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు బెంగాల్‌ ‌వంతు వచ్చింది. బెంగాల్‌లో ఎంఐఎం ముర్షిదాబాద్‌, ‌బీర్‌భూమ్‌, ‌నాడియా, నార్త్ అం‌డ్‌ ‌సౌత్‌ ‌దినజ్‌పూర్‌, ‌కూచ్‌ ‌బెహార్‌, అలీపుర్దువార్‌ ‌మరియు మాల్డా వంటి జిల్లాలపై దృష్టి సారించింది. ఈ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 27% మంది ముస్లింలు ఉన్నారు.ఈ ఇలాకాలో ఎంఐఎం కొంతకాలంగా పాగా వేసి ఆన్‌లైన్‌ ‌మరియు ఆఫ్‌లైన్‌ ‌సభ్యత్వ డ్రైవ్‌లను నడిపి తన సభ్యత్వం పెంచుకుని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నది.

ఎంఐఎం చీఫ్‌ ఒవైసీ తన పార్టీ ఐదుగురు బీహార్‌ ‌శాసనసభ్యులను బెంగాల్‌లో నియమించి, ఎన్నికల మైదానంలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పావులు కదుపుతున్నారు. ముఖ్యమైన అంతర్గత సర్వేలను ఒవైసీ చేపట్టారు. అమూర్‌ ఎమ్మెల్యే అయిన ఎంఐఎం బీహార్‌ ‌యూనిట్‌ అధ్యక్షుడు అక్తారుల్‌ ఇమామ్‌ ‌మరియు యువ అధ్యక్షుడు ఆదిల్‌ ‌హసన్‌ ‌కు ముర్షిదాబాద్‌, ‌బీర్భం మరియు నాడియా జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఉత్తర మరియు దక్షిణ దినజ్‌పూర్‌, ‌కూచ్‌ ‌బెహార్‌ ‌మరియు అలీపుర్దువార్‌లలో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని జోకిహాట్‌ ఎమ్మెల్యే మొహద్‌ ‌షాహ్నావాజ్‌, ‌కొచ్చాదమన్‌ ఎమ్మెల్యే ఇజార్‌ అస్ఫీ చూస్తున్నారు. మాల్దా జిల్లాకు పరిశీలకులుగా బహదూర్‌గంజ్‌ ఎమ్మెల్యే అంజర్‌ ‌నయీమి, బయాసి ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌లు నియమితులయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఒవైసీ స్వయంగా బ్యాక్‌-‌టు-బ్యాక్‌ ‌ర్యాలీలను నిర్వహిస్తారు అని తెలుస్తున్నది. ఎనిమిది దశల ఎన్నికలలో 4 వ రౌండ్‌ ‌ప్రారంభం నుంచి అంటే మార్చి 27 నుండి ఏప్రిల్‌ 29 ‌వరకు ఎంఐఎం తన లక్ష్యంగా పెట్టుకున్న నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. కోల్కతా లోని మెటియాబురుజ్‌లో ఇది ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం.. ఇక్కడ ఓవైసీ తన మొట్టమొదటి మెగా ర్యాలీని నిర్వహించాలి అనుకొన్నారు అయితే అనుమతి నిరాకరించడంతో దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.

 

బెంగాల్‌ ఎన్నికలలో ఎంఐఎం తన ఉనికి చాటుకోటానికి చేస్తున్న ప్రయత్నం వలన ఏం జరగనున్నది…? బెంగాల్‌లో, ముస్లిం ఓటర్లు అనేక స్థానాల్లో అభ్యర్థుల తల రాత నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు. బెంగాల్‌ ‌లో ఎంఐఎం ప్రవేశం ఈ ఎన్నికలకు ఆసక్తికరమైన డైనమిక్స్‌ను జోడిస్తుంది. అంతే కాదు బెంగాల్‌ ఎన్నికల ప్రభావం దేశంలో మత రాజకీయాల పునాదిని మరింత విస్తృతం చేస్తుంది. బెంగాల్‌ ‌లో 294 సీట్లలో 200 స్థానాలకు పైగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి ఎంఐఎం ఫ్యాక్టర్‌ అనుకూల ఫ్యాక్టర్‌ ‌కానుంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో బెంగాల్‌ ‌రాష్ట్రంలోని 42 పార్లమెంట్‌ ‌స్థానాలలో 18 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ప్రస్తుతం బెంగాల్‌ ‌లో ఉత్సాహంగా ఉన్నది. ఈ నేపథ్యంలో బిజెపికి ఎంఐఎం ఫ్యాక్టర్‌ ‌ప్రయోజనంగా ఏకైక మహిళా ముఖ్యమంత్రి మమతకు ప్రమాదకారిగా పరిణమించే అవకాశాలు మెండుగా వున్నాయి. బెంగాల్‌ ఎన్నికల పరిణామాలు కేవలం బెంగాల్‌ ‌కి మాత్రమే పరిమితం కాబోవు వీటి ప్రభావం దేశవ్యాపితంగా ఉంటుంది అనేది స్పష్టం.

Leave a Reply