- పిసిసి ప్రకటించి వారమైనా… కలుసుకోని ఆ ఇద్దరు
- కాంగ్రెస్‌లో ఉత్తర, దక్షిణ ధృవాలుగా రేవంత్, జగ్గారెడ్డి
- కలిసి పని చేస్తారా.. కాంగ్రెస్‌లో హాట్ టాపిక్
ఎ.సత్యనారాయణరెడ్డి / ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరూ ఫైర్ బ్రాండ్ నేతలే. సంచలన వ్యాఖ్యలకు, వివాదాలకు కేరాఫే. ఇద్దరూ జనాదరణ కలిగిన నేతలే. క్యాడర్‌కు అభిమాన నేతలే. కాంగ్రెస్ పార్టీలో ఒకరు ముందు చేరితే…మరొకరు తర్వాత చేరారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలనుకునే నేతలే. పార్టీ అధికారంలోకి రావాలని ఉబలాటేపడే నేతలే. అధిష్టానం లైన్లో నడిచే నేతలే. అన్నింటికీమించి సిఎం కేసీఆర్ కుటుంబమంటే ఒంటి కాలు మీద లేచే నేతలే. ఇద్దరూ కేసీఆర్ బాధితులే. కేసీఆర్ కోపాగ్నికి జైలుకు వెళ్లొచ్చిన వారే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఇద్దరు నేతలకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. కానీ, కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ ఇద్దరు నేతలు ఉత్తర, దక్షిణ ధృవాలు. ఆ ఇద్దరి మధ్యన చెప్పుకోదగ్గ చెలిమి లేదు. కలిసి ఉన్న దాఖలాలు అంతకంటే లేవు. ఆ ఇద్దరిలో ఒకరు తాజాగా…టిపిసిసి ప్రెసిడెంటుగా నియమితులైన రేవంత్‌రెడ్డి(మల్కాజిగిరి ఎంపి) కాగా, ఇంకొకరు వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమితులైన తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి(సంగారెడ్డి ఎమ్మెల్యే). కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు కేంద్ర బిందువుగా మారారు. దీనికి కారణం…ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉన్న రేవంత్‌రెడ్డి టిపిసిసి చీఫ్‌గా నియమితులైతే…జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమితులు కావడంతో ఈ ఇద్దరు నేతలు కలిసి పని చేస్తారా? లేదంటే ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఇప్పుడు కూడా వ్యవహరిస్తారా? అన్నది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఇప్పుడు అందరి చూపు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి వైపే. అందరూ ఈ ఇద్దరు నేతల గురించి మాట్లాడుకుంటున్నారు. చర్చించుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
రాష్ట్ర నూతన పిసిసి అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లను పార్టీ అధిష్టానం నియమించి వారం రోజులవుతున్నది. రేవంత్‌రెడ్డిని టిపిసిసి చీఫ్‌గా అనౌన్స్ చేసిన మరు క్షణం నుంచే అన్నింటిని పక్కనపెట్టి వరుసగా పార్టీ సీనియర్లందరినీ ఇండ్లలోకి వెళ్లి మరీ కలుస్తూ వొస్తున్నాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విహెచ్‌ను సైతం పరామర్శ పేరుతో కలిసి వొచ్చాడు. విహెచ్ మొదటి నుంచీ రేవంత్‌రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశాడు. అటువంటి విహెచ్‌ను సైతం రేవంత్‌రెడ్డి కలిశారు. కానీ, ఇప్పటి వరకు రేవంత్‌రెడ్డి-జగ్గారెడ్డి కలుసుకున్న దాఖలాలు లేవు. ఎవరి పని వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే, ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారడానికి కారణమైంది. ఇదిలా ఉంటే, రేవంత్‌రెడ్డిది, జగ్గారెడ్డిది ఒక జిల్లా కాకపోయినప్పటికీ…రేవంత్‌రెడ్డి పేరు టిపిసిసి చీఫ్‌గా ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి…ఎందుకో ఏమో కానీ, జగ్గారెడ్డి వ్యతిరేకించడం మొదలు పెట్టడం ప్రారంభించాడు.
టిపిసిసి చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరు, ప్రస్తావన వొచ్చిన మరుక్షణమే తాను కూడా టిపిసిసి చీఫ్ రేసులో ఉన్నాననీ, టిపిసిసి చీఫ్ అయ్యేందుకు తనకు కూడా అన్ని అర్హతలున్నాయంటూ బహిరంగంగానే మీడియా ముందర ప్రకటించడమే కాకుండా, పార్టీలో రేవంత్‌రెడ్డి కంటే ఎందరో సీనియర్లు ఉన్నారనీ, వారిని కాదనీ, రేవంత్‌రెడ్డికి ఎలా ఇస్తారనీ, ఇదే విషయమై ఏఐసిసికి కూడా లేఖలు రాస్తాననీ జగ్గారెడ్డి అనేక సందర్భాలలో చెప్పిన, మాట్లాడిన విషయం విధితమే. ఓసారైతే జగ్గారెడ్డి మరో అడుగు ముందుకేసి రేవంత్‌రెడ్డి ఒక్కడే మగాడు కాడూ, పార్టీలో పులులు, సింహాలు చాలా మంది ఉన్నారనీ, వారందరినీ కాదనీ రేవంత్‌రెడ్డికి టిపిసిసి చీఫ్ పదవీ వస్తే చూస్తూ ఊరుకోననీ కూడా హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, రేవంత్‌రెడ్డి ఏమైనా తీస్‌మార్‌ఖానా..నిన్నగాక మొన్న పార్టీలోకి వొచ్చిండు..సిఎం, టిపిసిసి అంటాడా? అని ప్రశ్నించారు కూడా. అంతటితో ఆగకుండా రేవంత్‌రెడ్డి అనుచరులపై కూడా తీవ్రస్థాయిలో మండిపడిన, ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
రేవంత్‌రెడ్డి పార్టీ పరువు తీస్తున్నారనీ, రేవంత్ రెడ్డి ఒక్కడే లేడనీ, ఆయన తీరుపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తానని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చిన సందర్భమూ ఉంది. అంతేకాదూ, రేవంత్‌రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూనే…ఆయన అనుచరులు నోరు మూసుకోవాలని..చేసే పిచ్చి పిచ్చి ప్రచారం మానుకోవాలని జగ్గారెడ్డి హితవు పలుకుతూనే..సోషల్ మీడియాలో సొంత డబ్బా కొట్టుకోవడం, జైలుకెళ్లాం కాబట్టి పదవులు వొస్తాయని భ్రమలో ఉండడం రేవంత్‌కు అలవాటైపోయిందని జగ్గారెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోమార్లు రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా జగ్గారెడ్డి మాట్లాడారు. అంతేకాకుండా, తాను అనుకున్న వారికి పిసిసి చీఫ్ పదవి వొస్తే రాష్ట్రమంతటా తిరిగి పని చేస్తామనీ, లేదంటే సంగారెడ్డి నియోజకవర్గానికే పరిమితమవుతానంటూ మాట్లాడిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఊహించని విధంగా టిపిసిసి చీఫ్‌గా రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంటుగా జగ్గారెడ్డి అయ్యారు.
రేవంత్‌రెడ్డితో ఇప్పుడు జగ్గారెడ్డి ఎలా పని చేస్తారన్నదే అందరిలో ఆసక్తి, ఉత్కంఠ కలిగిస్తున్నది. వర్కింగ్ ప్రెసిడెంటు హోదాలో టిపిసిసి చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి సహకరిస్తారా? లేదంటే, గతంలో చెప్పినట్లుగా తాననుకున్న వ్యక్తి టిపిసిసి చీఫ్ కాలేదనీ సంగారెడ్డి నియోజకవర్గానికే పరిమితం అవుతాడా? అన్నదానిపై పార్టీ శ్రేణుల్లో రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇద్దరు నేతలు మనస్పర్ధలు, విభేదాలు విడిచిపెట్టి సంయమనంతో కలిసి పని చేయాలని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పని చేస్తాననీ చెప్పే నేతగా…పార్టీ శ్రేయస్సు దృష్ట్యా గతం గత: అని జగ్గారెడ్డి టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డితో కలిసి పని చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనీ విశ్వసనీయ సమాచారం. ఇద్దరూ సిఎం కేసీఆర్ బాధితులే కావడం, ఇద్దరి లక్ష్యం కేసీఆర్ కుటుంబాన్ని అధికారం నుంచి దించడమే కావడంతో ఈ ఇద్దరూ కలిసి తప్పకుండా పని చేస్తారనీ, పార్టీ ఢిల్లీ నేతలు ఈ ఇద్దరు కలిసి పని చేసేలా చేస్తారన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్న నేతలు కాంగ్రెస్‌లో ఉన్నారు. అయితే, ఉత్తర, దక్షిణ ధృవాలైన నేతలందరూ కలిసి వారి ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్‌ను అధికార కుర్చీ నుంచి దించి, కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తారా? అంటే ఏమో, కాలమే నిర్ణయించాలి మరి. ఏది ఏమైనా, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏం జరుగుతుందో చూడాలి.