Take a fresh look at your lifestyle.

వినకపోతే వొదిలేయాల్సిందే..!

municipal elections 2020, bjp seats, telangana municipal electionsమున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే చాలావరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయినప్పటికీ ఆశావహుల్లో మాత్రం ఆశ చావడంలేదు. ఆరునూరైనా తాము ఈ ఎన్నికల్లో పోటీచేసి తీరుతామన్న ధృడ నిశ్చయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా తయ్యారైంది. వొదలమంటే పాముకు కరవమంటే కప్పకు కోపంలా తయారైంది నాయకుల పరిస్థితి. ఎంత నచ్చజెప్పినా పోటీదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందుకు ఇప్పట్లో మరే ఎన్నికలు లేకపోవడం ఒక కారణం. మున్సిపల్‌ ఎన్నికలతో దాదాపు రాష్ట్రంలోని అన్ని ఎన్నికలు పూర్తి అయినట్లే. మరో నాలుగేళ్ళవరు ఇక ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇదే అవకాశంగా ఏళ్ళ తరబడి పార్టీని అంటిబెట్టుకున్న కార్యకర్తలు ఉత్సాహపడుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు వారిని గెలిపించే బాధ్యతను మంత్రులు, ఎంఎల్‌ఏల భుజస్కందాలపైన పెట్టాడు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. దీంతో మంత్రులు, ఎంఎల్‌ఏలకు అభ్యర్థుల ఎంపిక పెద్ద భారంగా పరిణమించింది. విచిత్ర విషయమేమంటే కార్యకర్తల్లో చాలా మంది పార్టీ పుట్టినప్పటి నుండి అంటిపెట్టుకుని ఉన్నవారే కావడంతో కొందరు మంత్రులు, ఎంఎల్‌ఏలకన్నా వారే సీనియర్లు అవడంతో వారిని బుజ్జగించడం, నిలువరించడం మధ్యలో పార్టీలో చేరి పదవులు అలంకరించిన మంత్రులు, ఎంఎల్‌ఏలకు కాస్తా ఇబ్బందికరంగానే మారింది. ఈ పంచాయితీ చివరకు అధినేత కెసిఆర్‌ ‌వరకు చేరడంతో ఆయన దీన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తున్నది. గురువారం మంత్రులు, శాసనసభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రెబల్స్ ‌పట్ల కఠినంగానే వ్యవహరించాలని సూచించడంతో చాలామంది ఆశావహులపై వేటు తప్పదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మంత్రులు, ఎంఎల్‌ఏలపై అభ్యర్థుల ఎంపిక బాధ్యత పెట్టడంతో వారు తమ అనుమాయులనే ఎంపిక చేస్తున్నారన్న అపవాదు ఉంది. స్థానికంగా బలమైన అభ్యర్థిని పక్కకు పెట్టి కేవలం తమవాడన్న అభిప్రాయంగా ఎంపిక చేయడంపట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నామినేషన్లకు పెద్దగా సమయం లేకపోవడంతో ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కెసిఆర్‌ ‌గురువారం నాటి సమావేశంలో సూచించారు. అశావహులను బుజ్జగించే ప్రయత్నం చేయాలని, వారికి పార్టీ పరమైన పదవులు, ఇతర అవకాశాలు వొస్తాయని చెప్పాలని, అప్పటికీ వినకపోతే ఇక వారిని వదిలివేయాల్సిందేనని సీరియస్‌గానే చెప్పినట్లు తెలుస్తుంది. అప్పటికీ రెబల్స్‌గా ఎన్నికల్లో పోటీచేసే పక్షంలో వారిని పార్టీనుంచి బహిష్కరించాలని కూడా సూచించడం రెబల్స్ ‌పట్ల కఠినంగా వ్యవహరించాలన్న ఆయన నిర్ణయాన్ని తెలియజేస్తున్నది. అంతటితో ఆగకుండా భవిష్యత్‌లో మళ్ళీ ఎప్పుడు పార్టీలోకి అలాంటివారిని తీసుకునేదిలేదన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. తాజాగా జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికల్లో సంపూర్ణ విజయాన్ని సాధించిన టిఆర్‌ఎస్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా అదేతరహా విజయాన్ని సాధించాలని ఇంతకు ముందే టిఆర్‌ఎస్‌ ‌విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు, నాయకులకు కెసిఆర్‌ ‌సూచించిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల కాకముందే అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగానే తెప్పించుకున్నట్లు తెలుస్తున్నది. అంతేగాక ఈ ఎన్నికలకు సంబంధించి నాలుగైదు సర్వేలను కూడా ఆయన ప్రత్యేకంగా చేయించాడు. అన్ని సర్వేల్లో కూడా మెజార్టీ మున్సిపాల్టీలు టిఆర్‌ఎస్‌కే దక్కుతాయన్నదే సమాచారం. అదే ధీమాతో ప్రతిపక్షాలకు ఎక్కడా చోటు లభించకుండా కెసిఆర్‌ ‌వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతిపక్షాలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచార కార్యక్రమంలో ముందుండాలన్నది కెసిఆర్‌ ‌వ్యూహం. కాని, రెబల్‌ ‌గొడవలు ఆయనకిప్పుడు చికాకు తెప్పించేవిగా ఉన్నాయి.

వాస్తవంగా రెబల్‌ ‌గొడవన్నది ప్రతీ ఎన్నికల్లో ప్రతీ పార్టీలో ఉండేదే. కాని, ఈ ఎన్నికలను టిఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది కాబట్టి రెబల్‌ అభ్యర్థులకు, అసంతృప్తులుగా ఉండి పార్టీ హానిచేస్తారన్నవారిపై కఠినంగా వ్యవహరించేందుకు కెసిఆర్‌ ‌నిశ్చయించారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కూడా ఎవరి వ్యూహల్లో వారున్నారు. ఏ ఎన్నికల్లోనైనా కలిసి పోటీ చేయాలనుకున్న సిపిఐ, సిపిఎంలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం అనుమానంగానే ఉంది. తనతో కలిసివొచ్చే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిపిఐ ఇష్టపడుతుండగా, సిపిఎం మాత్రం కాంగ్రెస్‌, ‌బిజెపితో పొత్తుకు ఇష్టపడడం లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలను కుంటోంది. జనసేన పార్టీ తన కార్యకర్తలకు ఇండిపెండెంట్‌గా పోటీలో దిగేందుకు అనుమతిచ్చిందేగాని, జనసేనపార్టీ ప్రత్యక్షంగా పోటీచేసే అలోచనలో లేనట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌ ఇం‌కా అంతర్ఘత కుమ్ములాటలో ఉండడంతో టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్నవారి చూపంతా బిజెపిపై ఉంది. ఇప్పటికే తెలంగాణలోని ఒక వెలుగు వెలిగిన ఇతర పార్టీల్లోని నాయకులు బిజెపి గూటికి చేరారు కూడా. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్‌ ‌స్థానాలను గెలిచినప్పటి నుండి పార్టీలో కొత్త ఊపు కూడా వొచ్చింది. దీంతో బిజెపి టికెట్ల కోసం ఆశావహులు లైన్లు కడుతున్నారు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ అధికార పార్టీ, బిజెపి మధ్యనే ఉండే అవకాశం ఉంది.

Tags: municipal elections 2020, bjp seats, telangana municipal elections results

Leave a Reply