Take a fresh look at your lifestyle.

వొచ్చే ఎన్నికలలోగా కెటిఆర్‌ ‌సిఎం అవుతాడా ?

రానున్న శాసనసభ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర ఐటి శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. తాజాగా భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెటిఆర్‌కు కెసిఆర్‌ ‌పట్టం కట్టే విషయంలో కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. మంచి ముహూర్తం చూసుకుని కెసిఆర్‌ ఈ ‌ప్రకటన చేస్తారన్నది అందరిలో నలుగుతున్న వార్త. కెసిఆర్‌ ‌నాయకత్వంలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత కెటిఆర్‌ ‌సిఎం అవుతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కెసిఆర్‌ ఆరోగ్యంపై వార్తలు ప్రభలిన నేపద్యంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంలో స్వయంగా కెసిఆర్‌ ‌కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వొచ్చింది.

రెండసారి కూడా పూర్తికాలం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ పబ్లిక్‌ ‌మీటింగుల్లో, మీడియా సమావేశాల్లో చెప్పుకొచ్చారు. కాని, ఎప్పుడైతే సెంట్రల్‌లో చక్రం తిప్పుతానంటూ, కాంగ్రెస్‌, ‌బిజెపి యేతర థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానంటూ కెసిఆర్‌ ‌ప్రకటించారో, అప్పటి నుండి కెటిఆర్‌ ‌ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. దానికి తగినట్లు ముఖ్యమంత్రి విషయంలో కెసిఆర్‌ ‌స్పష్టంగా ఏ ప్రకటన చేయకపోయినా, రాష్ట్రంలోని మిగితా మంత్రులను పక్కకు పెట్టి ప్రతీ విషయంలో కెటిఆర్‌ను ఫోకస్‌ ‌చేస్తున్న విషయం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు, పార్టీ ముఖ్యనేతలంతా కెసిఆర్‌ ‌తర్వాత, కెటిఆర్‌కు అంతే ప్రాధాన్యాతనిస్తూ రావడం వెనుక కూడా కాబోయే ముఖ్యమంత్రి అన్న విషయాన్ని గుర్తుచేస్తున్నట్లుగా ఉంది. అలాగే కెటిఆర్‌కు పట్టం కట్టే సుముహూర్తాలను అటు రాజకీయ నేతలు, ఇటు మీడియా సంస్థలు లెక్కలు కడుతూనే ఉన్నాయి.

ఈ విషయం ప్రధాన చర్చనీయాంశంగా మారినప్పుడల్లా రాష్ట్ర మంత్రుల, పార్టీ నేతలు కెటిఆర్‌కు ఆ పదవి చేపట్టేందుకు కావాల్సిన అన్ని అర్హతలున్నాయన్న కితాబును ఇస్తూనే ఉన్నారు. మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇటీవల కెటిఆర్‌ ‌మంచి పాలకుడని కితాబిచ్చిన విషయం తెలిసిందే. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవల అదే విషయాన్ని ప్రస్తావిస్తూ కెటిఆర్‌కు అన్ని అర్హతలున్నాయన్నారు. వాస్తవంగా తాజాగా జరిగిన జీహెచ్‌ఎం‌సి ఎన్నికల తర్వాత కెటిఆర్‌ ‌పట్టాభిషేకం జరుగుతుందనుకున్నారు. అధికార పార్టీకి ప్రతీ ఎన్నికల్లో అంతులేని విజయం లభిస్తుండడంతో జీహెచ్‌ ఎం‌సి ఎన్నికల్లోకూడా మంచి ఫలితాలు సాధిస్తామన్న ధీమా టిఆర్‌ఎస్‌కు ఉండింది. ఆ విజయోత్సవంలో భాగంగా కెసిఆర్‌ ‌తన కుమారుడి పట్టాభిషేకం వార్తను ప్రకటిస్తారనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆ ఫలితాలు వికటించడంతో తాత్కాలికంగా ఆ అంశాన్ని కెసిఆర్‌ ‌వాయిదా వేసుకున్నట్లు భావిస్తున్నారు.

తాజాగా డోర్నకల్‌ ఎంఎల్‌ఏ ‌రెడ్యానాయక్‌ ఓ ‌సమావేశంలో ఉగాది తర్వాత కెటిఆర్‌కు పట్టాభిషేకం జరుగుతుందని ప్రకటించడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వొచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి దేవాలయ పునర్‌ ‌నిర్మాణం ఫిబ్రవరిలో పూర్తి కావొచ్చంటున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌సుదర్శన యాగం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం •కెటిఆర్‌ ‌సిఎం విషయాన్ని కెసిఆర్‌ ‌ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కెటిఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేసిన ప్రకటన అటు టిఆర్‌ఎస్‌ ‌వర్గాల్లో, ఇటు ఇతర రాజకీయ పార్టీల్లో ఆలోచనలను రేకెత్తిస్తున్నది. ప్రధానంగా కెటిఆర్‌ను ముఖ్యమంత్రి చేసిన వెంటనే టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చీలిక వొస్తుందన్న సంజయ్‌ ‌మాటలు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఇప్పటికే కెసిఆర్‌ ‌తీరు పట్ల పార్టీ నాయకులు చాలామంది అసంతృప్తితో ఉన్న విషయం అనేక సందర్భాల్లో వెల్లడయింది. దానికి తగినట్లు పలువురు సీనియర్‌ ‌నాయకులు ఇప్పటికే పార్టీని విడిచిపెట్టి వెళ్ళారు. సంజయ్‌ ‌మాటలు ఆ దిశగా స్పష్టంగా లేకున్నా, పార్టీనుండి కొందరు ఎంఎల్‌ఏలు బయటికి వొచ్చి కొత్త పార్టీ పెడతారని, అయితే వారు కెసిఆర్‌ ‌కనుసన్నల్లో మెదులుతూ మరో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారని, ఆ కొత్త పార్టీ లక్ష్యం బిజెపి వోట్లను చీల్చడానికన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. బండి సంజయ్‌ ‌వ్యాఖ్యల వెనుక అర్థం ఏదైనా రానున్న 2023 ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయాల్లో అనేక అనూహ్య మార్పులు వచ్చే అవకాశాలు మాత్రం స్ఫష్టంగా కనిపిస్తున్నాయి.

manduva ravindhar rao
మండువ రవీందర్‌రావు

Leave a Reply