Take a fresh look at your lifestyle.

‌రాష్ట్ర రాజకీయాలపై ఖమ్మం ప్రభావం చూపనుందా ..?

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల సస్పెన్షన్‌ద్వారా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గడ్డుస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్తితులు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు ముఖద్వారంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు  మరింత దూరమయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమకాలంనుండి నిన్న మొన్నటివరకు రాష్ట్రమంతటా అన్నిజిల్లాల్లో మెజార్టీస్థానాలు సంపాదించినా, ఖమ్మంలో మాత్రం బిఆర్‌ఎస్‌ ‌పార్టీ తన ప్రభావాన్ని పెద్దగా చూపించలేకపోతున్నది. 2014, 2018 ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. అయితే తన రాజకీయ ఎత్తుగడలతో వివిధ పార్టీలనుండి నెగ్గిన వారిని కారు ఎక్కించడంలో మాత్రం బిఆర్‌ఎస్‌ ‌సక్సెస్‌ ‌కాగలిగింది.   ఉమ్మడి ఖమ్మం జిల్లాను పరిశీలిస్తే ఇక్కడ ఉద్దండ నాయకులే ఉన్నా, పార్టీ వారిని కాపాడుకోలేక పోతున్నదనేందుకు ఆ జిల్లాలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో  ప్రత్యేక గుర్తింపున్న  తుమ్మల నాగేశ్వర్‌రావు గులాబికండువ కప్పుకుని, మంత్రి పదవి చేపట్టినా గత ఎన్నికల్లో ఓటమితో ఒక విధంగా పార్టీ ఆయనను పట్టించుకోవడమే మానేసిందన్న విషయాన్ని ఆయనే తన అనుమాయులతో ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో చెప్పుకుని బాధపడిన విషయం తెలియందికాదు. అంతేగాక మరో పార్టీ తీర్థం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు అనేక వార్తలు వెలుగుచూశాయి.  తాజాగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ భారీ బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించినప్పుడు తుమ్మలను చెయ్యిజారిపోనివ్వకుండ మంత్రి హరీష్‌రావు ప్రమేయంతో కొంత ఊరటకలిగిం••టం వేరే విషయం.  అదే ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇప్పుడు పార్టీ తాజాగా సస్పెండ్‌ ‌చేసింది. వైఎస్‌ఆర్‌పార్టీకి తెలంగాణలో పెద్దగా ప్రభావం లేని కాలంలోనే ఆయన ఖమ్మం జిల్లా ఎంపీగా ఆ పార్టీనుండి గెలిచిన వ్యక్తి.  ఆ తర్వాత గులాబీ కండువ కప్పుకున్న శ్రీనివాసరెడ్ది కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నాడు. పార్టీలో ఉంటూ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పెడుతూ పార్టీ అధిష్టానంవైఖరిపైన అనేక ఆరోపణలు చేస్తూ  వొచ్చాడు. అక్కడితోనే ఆగకుండా తన వర్గంవారిని రానున్న ఎన్నికల్లో గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేస్తూ, నియోజక వర్గాల వారీగా అభ్యర్థులను  కూడా ఆయన సెలక్ట్ ‌చేసి పెట్టుకున్నారు.

తాజాగా ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మరో అసంతృప్తి నేత జూపల్లి కృష్ణారావుతో పాల్గొనడం, వీరిద్దరూ బిఆర్‌ఎస్‌ ‌నాయకత్వంపైన తీవ్రంగా విమర్శలు చేయడంతో పార్టీ వీరిని సస్పెండ్‌ ‌చేసింది. అయితే ఈ సస్పెన్షన్‌ ‌ఖమ్మంలో పార్టీ మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతుందా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో తనతో పాటు మరో ఇద్దరు ఎంఎల్‌ఏలను గెలిపించుకుని సత్తా చాటిన పొంగులేటి రానున్న ఎన్నికల్లో కూడా తన ప్రభావాన్ని చూపించుకునే అవకాశాలు లేకపోలేదు. ఖమ్మంలో కాంగ్రెస్‌, ‌టిడిపి, కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ. పొంగులేటి బిఆర్‌ఎస్‌తో విభేదిస్తున్నప్పటి నుండి  ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్‌ ‌విశ్వప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు స్థానాలను దక్కించుకోగలిగింది. పొంగులేటి తమ పార్టీలో చేరితే మెజార్టీ స్థానాలను గెలుచుకునే అవకాశం  ఉంటుందని కాంగ్రెస్‌ ‌తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ బిజెపికి పెద్దగా గుర్తింపులేదు. అయితే రానున్న ఎన్నికల్లో గొలకొండపైన కాషాయ జండాను ఎగురవేస్తామని చెబుతున్న బిజెపికి  ఇలాంటి నాయకుడు అవసరం. అందుకే ఎట్టిపరిస్థితిలో ఆయనను ఒప్పించి పార్టీలో చేర్చుకోవాలని బిజెపి సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు జాతీయ పార్టీల్లో ఏదో ఒక పార్టీని ఆయన ఎంచుకుంటారా లేక సొంత• పార్టీని ఏర్పాటు చేస్తారా అన్నది కూడా ఇప్పుడు ప్రచారంలో ఉన్నది. కొంతకాలంగా ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా తిరుగుతూ తన క్యాడర్‌ను సంఘటితం చేస్తూ, రానున్న ఎన్నికల్లో నిలబడాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసిన పొంగులేటి మరే పార్టీలో చేరిన తాను అనుకున్న వారికి టికట్లు లభిస్తాయాయన్నది ప్రశ్న. అందుకు తానే ఒక పార్టీని ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలోకూడా ఆయన ఉన్నట్లు వార్తలు వొస్తున్నాయి.  ఇదిలా ఉంటే  వాస్తవంగా బిఆర్‌ఎస్‌పార్టీని శంకరగిరి మాణ్యాలు పట్టించాలనుకుంటున్న పార్టీలన్నీ ముఖ్యంగా ఖమ్మంపైనే దృష్టి పెడుతున్నాయి. తెలంగాణలో రీ ఎంట్రీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ భారీ బహిరంగ సభను ఖమ్మంలోనే ఏర్పాటు చేయడంద్వారా తన బలాన్ని, బలగాన్ని అంచనావేసుకున్నాడు. మూడువేల అయిదు వందల కిలోమీటర్ల పాదయాత్రచేసిన వైఎస్‌ఆర్‌టిపి అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల తన రాజకీయ ప్రస్తానానికి ఖమ్మం జిల్లానే ఎంచుకుంది. షర్మిల కూడా పొంగులేటిని తన పార్టీలోకి ఆహ్వానించింది. గతంలో వైఎస్‌ ‌పార్టీతో అనుబంధం ఉండటంవల్ల ఆయన ఆ పార్టీవైపు మొగ్గుతాడేమోనన్న ప్రచారంకూడా జరిగింది.  ఇలాంటి పరిస్థితిలో  ఖమ్మంపైన  ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు ప్రత్యేక దృష్టిని పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో  ఉమ్మడి ఖమ్మంలోని పది నియోజకవర్గాలకు బిఆర్‌ఎస్‌ ‌గెలుచుకున్నది కేవలం ఒక స్థానమే.  మిగతావారంతా తర్వాత గులాబి కండువ కప్పుకున్నవారే. అయితే  ఇక్కడున్న పది స్థానాలకు కనీసం ఎనిమిది స్థానాలనైనా గెలుచుకోవాలను కుంటున్న  బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఖమ్మం ఏమేరకు దగ్గర అవుతుందో చూడాలిమరి.

Leave a Reply