- వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా తప్పదు
- డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్
ఇప్పటికే కొరోనా వైరస్ అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థను తీవ్రస్థాయిలో దెబ్బకొట్టింది. అయితే ఈ సమయంలో మరో ఏడాది పాటు కొరోనాతో పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. (డబ్ల్యూహెచ్వో) సూచిస్తోంది. తాజాగా డబ్ల్యూహెచ్వో సోషల్ డియా ద్వారా ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన ఆ సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్..ఈ ఏడాది చివరకు క్లీనికల్ ట్రయల్స్ పూర్తిచేసుకుని వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కోట్లకొద్దీ టీకాలను పంపిణీ చేసేందుకు మరింత సమయం పడుతుందని.. అందుకే మరో ఏడాది పాటు కొరోనాతో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇక, హెర్డ్ ఇమ్యూనిటీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సౌమ్య స్వామినాథన్. కొరోనాను కట్టడి చేసే రోగ నిరోధక శక్తి సహజంగా వ్యాపించాలంటే.. వైరస్ పలుమార్లు సమాజంపై తీవప్రభావం చూపించాల్సి ఉంటుందన్నారు. అంటే.. ఏదైనా ప్రాంతంలోని కనీసం 60 శాతం మందిలో కొరోనాను ఎదిరించగలిగే రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందినప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. కొరోనాకు విరుగుడును కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతుండగా.. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ వరకు వచ్చాయి. మరికొన్ని ఆ దశను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని రంగాలను దెబ్బకొట్టిన కొరోనా వైరస్..మరో ఏడాది పాటు ఇలాగే ఉంటుంది అంటే మాత్రం..పరిస్థితి ఊహించడమే కష్టంగా ఉంది.